(మహాదేవ్, 9490646306)
అనగనగా ఒక శాపగ్రస్తమైన ఊరు..
ఆ ఊరికి ఉన్న శాపం – చీకట్లో మగ్గడం,వెలుతురు రవ్వంత అయినా ఆ ఊరిలో ప్రసరించకపోవడం..
దీనంతటికీ కారణం, ఆ ఊరు చుట్టు వలయంలా ఉన్న పెద్ద పెద్ద కొండలు, ఆ ఊరు ను మొత్తాన్ని చీకటి తో కప్పేసాయి..
ఈ సమస్య నుంచి బయటపడడడం కోసం, ఆ ఊరు జనాలు అందరూ చాలా పురాణాలు,గ్రంధాలు అన్నీ తిరగేసి వాళ్ళు తెలుసుకున్నది ఏమిటంటే- “ఎవరైనా ఆ వూరి జనాల్లో ఒక్కరు వెళ్లి కేవలం ఒక కొండ శిఖరం పైన జ్యోతిని వెలిగిస్తే చాలు ఆ ఊరు కి ఉన్న శాపం మొత్తం పోతుంది అని”.
కానీ ఆ ఊరి జనాలు అందరూ -” నువ్వు వెళ్ళురా అంటే నువ్వు వెళ్ళు”అని ఒకర్ని ఒకరు తోసుకుంటారు తప్ప ఎవరూ ముందుకు కదలరు.,అందరూ భయపడుతూ ఉంటారు..
ఇంతలో ఒక పది ఏళ్ల పిల్లాడు చిన్న లాంతరు పట్టుకుని ఎంత మంది “వద్దు” అని వారించినా వినకుండా – దారిలో తగిలే రాళ్లు,రప్పలు, ముల్లులు గుచ్చుకుంటున్నా లెక్కచేయకుండా భయపడకుండా వెళ్లి ఆ కొండ శిఖరం మీద జ్యోతిని వెలిగిస్తాడు..
వెలిగించగానే – ఒక అద్భుతం లాగా ఆ ఊరుకు ఉన్న శాపం మొత్తం పోతుంది..సూర్య కిరణాలు ప్రసరిస్తాయి.. వెలుతురు వస్తుంది.. రెండే రెండు నిమిషాల్లో ఆ కొండ శిఖరం నుంచి ఈ ఊరు కి మెట్లు ఏర్పడతాయి..
వెంటనే ఆ ఊరి జనాలు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పిల్లాడిని ఎత్తేసుకుని వూరేగిస్తారు..
ఆ తర్వాత రోజు నుంచి రోజుకు ఒకరు చొప్పున వెళ్లి ఆ కొండ శిఖరం మీద జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు..
ఇదొక ఆనవాయితీ గా మారుతుంది..
అంతా బాగానే ఉంది కానీ,ఆ ఊరిలో ఉన్న ఒక పెద్దాయన కి ఒక సందేహం వస్తుంది..
ఆ పిల్లాడిని దగ్గరకు పిలిచి ఒడిలో కూర్చోపెట్టుకుని..
“నాన్న ! నువ్వు ఒక్కడివే ఆ చీకట్లో అంత ఎత్తుకు వెళ్ళావ్ కదా ! నీకు ఏమి భయం వెయ్యలేదా ” అని అడుగుతాడు.
అప్పుడు ఆ పిల్లాడు అమాయకంగా ఆ తాత వైపు చూసి “అసలు భయం అంటే ఏమిటి తాత ?” అని అడుగుతాడు..
వాళ్ళమ్మ వాడికి భయానికి అర్ధం కూడా తెలీకుండా పెంచుతుంది..
ఈ కథలోని ఆ పిల్లాడు.. మనందరి కథా నాయకుడు..
నాకు మాత్రం ఆయన సాక్షాత్ శ్రీ వీరాంజనేయ స్వరూపం..
ONE AND ONLY THE MEGASTAR – పద్మవిభూషణ్ – డాక్టర్ శ్రీ అంజనాదేవి పుత్ర చిరంజీవి గారు..పుట్టిన రోజు శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారు.,
మన చుట్టుపక్కల ఉండే వ్యక్తి ఏదైనా సాధిస్తే,మనకి కూడా అది సాధించాలి అనే తపన రావడం చాలా సహజం..
కానీ మీరు, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళకి మాత్రమే కాదు,ఒక తరానికి జీవితంలో ఏదైనా సాధించాలి అనే తలంపు,తపన తీసుకొచ్చారు..మీలా మేము కూడా చెయ్యాలి అని ఎంత కష్టపడి గింజుకుని ప్రయత్నించినా – “కొండంత ప్రయత్నం” మాత్రం భాగహారం లో సశేషంలా మిగులుతూనే ఉంటుంది.
నిజానికి మీ పుట్టిన రోజు ఏరోజో “మాది” అయిపోయింది సార్..ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి వ్యక్తి జరుపుకునే పర్వదినం ఈరోజు..
జనరల్ గా ఎవరైనా అత్యున్నత స్థానంకి వెళ్తే – ఆ వ్యక్తి పుట్టినరోజుని ఆయన ఏం చేస్తారో ఆ వృత్తికి సంబంధించిన రోజు గా ప్రకటించి గౌరవిస్తూ ఉంటారు.(ఇంజనీర్స్ డే, డైరెక్టర్స్ డే..,)
నాకు మాత్రం ప్రకటిస్తే మీ పుట్టిన రోజును “HOPE DAY” గా ప్రకటించాలి అనే కోరిక సార్..ఎందుకు అంటే మీ పుట్టుకని కేవలం నటనా వృత్తి కి పరిమతం చేసి ACTOR’S DAY అనడం సరియైనది కాదు అని నా అభిప్రాయం..
“చిరంజీవి” అనే పేరు గొప్ప నటన కి మాత్రమే పర్యాయ-పదం కాదు, గొప్ప వ్యక్తిత్వానికి కూడా ప్రతీక అని నా భావన.
ఏ వృత్తిరంగంలో ఉన్న వాళ్ళు అయినా మీరు పడిన కష్టాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ జీవితాల్లో పురోగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు..మీరు పొందిన బిరుదులు,సత్కారాలు కంటే మా అందరి హృదయాల్లో మీరు సృష్టించిన ఆ HOPE యొక్క స్థానం చాలా విలువైనది సార్..చాలా గొప్పది..అది మమ్మల్ని నిద్రపోనివ్వదు, కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు, విశ్రాంతి తీసుకొనివ్వదు.. అన్నిటికంటే – “అస్సలు బద్ధకించనివ్వదు” అందుకే మీ పుట్టిన రోజున జీవితంలో ఏదైనా సాధించాలి అని బలంగా సాధన చేసే ప్రతి వ్యక్తి కీ “HOPE DAY ” గా మారాలి అని నా అభిలాష .
మీ నట శిష్య పరమాణువులలో ఒకడు.

(వ్యాస రచయిత వర్ధమాన నటుడు)

