యదార్థ గాథకు వెండి తెర రూపం
ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆర్జీవీ ప్రతిభ
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి, ఇద్దరి మధ్య జరిగిన ఆధిపత్య పోరాటం అనుకుని చూస్తే అందులో రామ్‌గోపాల్ వర్మ కనిపిస్తారు. ఒక 4 దశాబ్దాల క్రితం వరంగల్ జిల్లాలోని వ్యక్తుల పోరాటాన్ని కళ్ళకు కట్టడంలో వర్మ విజయం సాధించారు. పోతే ప్రేక్షకుల మనసులను ఆయన టేకింగ్ కట్టిపడేస్తుంది. శివ స్థాయిలో దీనిని చూడలేము కానీ, ఈ చిత్రం స్థాయి ఏమాత్రం తగ్గలేదు. క్రైమ్ చిత్రీకరణలో తన బాణీని మరోసారి ప్రదర్శించారు రాము. రాజకీయాల్లో ఎలాంటి ఎత్తులుపైఎత్తులు ఉంటాయి. వ్యక్తిత్వ హననాలు ఎలా చేస్తారు అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా మలచారు దర్శకుడు. హీరో నటనలో హీరో పవర్ కనిపించింది. హీరోయిన్ కూడా అతనితో పోటీపడి నటించింది. ఇదంతా …..కొండా….చిత్రం గురించే.
ఈ చిత్రం ఎలాగూ కొండా మురళి దంపతుల అభిమానుల మనసుదోచుకుంటుంది. వారు చూస్తే చాలా? సగటు ప్రేక్షకుడి సంగతేమిటి అనేగా ప్రశ్న. ఎస్ వారిని కూడా ఆకట్టుకుంటుంది. రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మాత్రం చూడకూడదు.
నక్సలిజం నేపథ్యంలో కొండ చిత్రం సాగుతుంది. నల్లా సుధాకర్‌కూ, కొండా మురళికి మధ్య పోరాటమే దీనికి ఆలంబన. మురళిని చంపడానికి సుధాకర్ పన్నే పన్నాగాలు… వాటిని మురళి ఎదుర్కొనే సన్నివేశాలు కళ్ళప్పగించేలా చేస్తాయి. ప్రధానంగా మురళిపై దాడి…ఆస్పత్రిలో అంతమొందించేందుకు సుధాకర్ వేసిన ప్రణాళికలో దృశ్యాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఎన్‌కౌంటర్ సీన్లు చూస్తే… ఇలాగే చేస్తారా అనిపించకమానదు. ఒక్క సన్నివేశం అని కాదు… ప్రతి సన్నివేశం కూడా కట్టిపడేస్తుంది.
కొండా మురళి యువకుడిగా ఉంటే ఎలా ఉండేవారో చూపడంలో దర్శకులు కృతకృత్యులయ్యారు. మురళిగా త్రిగుణ్ వంద శాతం న్యాయం చేశారు. ఫుల్ పవర్‌తో నటించారు. హీరోయిన్ సైతం విద్యార్థినిగా కొండా సురేఖ ఎలా ఉండేవారో సాక్షాత్కరింపజేశారు.
కొండా మురళి తల్లిదండ్రులుగా ఎల్బీ శ్రీరామ్, తులసి కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ అద్భుతంగా నటించారు. ఒక తల్లి తన కుమారుణ్ణి కాపాడుకోవడానికి పడే తపన మొత్తం తులసి కళ్ళలోకనిపించింది. హత్యాయత్నం తరవాత కోలుకుని ఇంటికొచ్చిన మురళిని చూసి, అతని తల్లి ఎలా రియాక్ట్ అయి ఉంటారో తులసి నటనను చూస్తే అర్థమవుతుంది.
అన్యాయం చేసిన వారిని నక్సల్స్ ఎలా హతమార్చేవారు? నక్సల్స్‌ను ఎన్‌కౌంటర్ చేయడానికి పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించేవారు? ఈ అంశాలు చిత్రంలో కళ్ళకు కడతాయి. ఇందులో ఒక్క ఆర్జీవీ తనతో పాటు కొందరికి ఎప్పటిలాగానే లైఫ్ ఇచ్చారు. ఆయన దర్శకత్వ శాఖలో ఎనిమిదిమందికి అవకాశం ఇచ్చారు. ఈసారి చంద్రబోస్‌తో ఒక పాట కూడా రాయించుకున్నారు. అనేక సినిమాల్లో మాదిరిగా ఈ సినిమాలో కూడా ఆర్జీవీ ఒక పాట పాడారు. ఇలా చెప్పాలంటే ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. రాము మార్క్ గోచరిస్తుంది. ఆ కిక్ కొండా సినిమా చూస్తేనే తెలుస్తుంది. చాలాకాలం తరవాత పూర్తిస్థాయిలో దర్శకత్వంపై ఆయన దృష్టిని కేంద్రీకరించి, తీసిన చిత్రం ఇది.