జి.ఎం.సి. బాలయోగి ప్రస్థానం
జాతీయ రహదారితో కోనసీమ అనుసంధానం
కోటిపల్లి రైల్వే లైనుకు మోక్షం కల్పించిన నాయకుడు
ఈనాడు – నేను: 34
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)

తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమకు దేశం మొత్తం మీద ప్రత్యేక స్థానం ఉంది. దీనికి కారణం ఆ ప్రాంత నైసర్గిక స్వరూపం ఒక్కటే కాదు. ఆహ్లాదపరిచే వాతావరణం. కేరళను తలపించేలా కొబ్బరి తోటలు. కొబ్బరి చెట్లపై ఆధారపడిన కుటుంబాలు. కోనసీమ భూగర్భంలో నిల్వ ఉన్న చమురు, సహజ వాయు నిల్వలు. అంతకు మించిన ఆలయాలు. వీటిని తలదన్నే రాజకీయ నాయకులు. స్వచ్ఛత, సౌమ్యత, హార్దికత, తేనెలూరే మాటలు, ఆతిథ్యం ఈ ప్రాంతీయులకు పెట్టని కోటలు.
రాజకీయ ప్రస్థానం
కోనసీమకు రాజకీయంగా దేశంలో సమున్నత స్థానం కల్పించిన వారు గంటి మోహన చంద్ర బాలయోగి. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా ప్రారంభించిన వైట్ కాలర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, రాజకీయాల్లోకి వచ్చారు. 1986 లో కాకినాడ కో ఆపరేటివ్ బ్యాంక్ కు ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 1987 లో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1991 లో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 1996 లో ఓడిపోయారు. అనంతరం ముమ్మిడివరం నుంచి ఎం.ఎల్.ఏ. గా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నత విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1998 లో మళ్ళీ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అప్పటి రాజకీయ సమీకరణాలు ఆయనను అందలానికి ఎక్కించాయి. కోనసీమ కుమారుడు లోక్ సభ స్పీకర్ అయ్యారు. ఆయన తన పదవిని ఎంతో విజ్ఞతతో నిర్వహించి, ఆ స్థానానికి వన్నె తెచ్చారు. కీలక సమయాలలో సమతూకంగా వ్యవహరించి తెలుగు వారి ప్రతిష్టను నిలబెట్టారు. దేశం అంతా కోనసీమ వైపు చూసేలా చేశారు.
అనేక కమిటీలకు అధ్యక్షులుగా..
లోక్ సభ 12 వ స్పీకరుగా బాలయోగి బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీ, జనరల్ పర్పసెస్ కమిటీ, స్టాండింగ్ కమిటీ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ ఇన్ ఇండియాకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్, నేషనల్ గ్రూప్ ఆఫ్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, ఇండియా బ్రాంచ్ ఆఫ్ ది కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్లకు కూడా చైర్మన్ గా వ్యవహరించారు. అనేక దేశాలను సందర్శించిన ఇండియన్ పార్లమెంటరీ ప్రతినిధుల కమిటీలకు నాయకత్వం వహించారు.
బాలయోగి మహోపకారాలు
అన్నిటికంటే ప్రధానంగా ఆయన చేసిన మూడు పనులు కోనసీమకు మహోపకారాన్ని చేసిపెట్టాయి. వాటిలో మొదటిది ఎదుర్లంక యానాం వంతెన నిర్మాణం. రెండోది కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకూ జాతీయ రహదారి, మూడోది అతి ముఖ్యమైనది కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్. కోనసీమ చిరకాల కోరిక ఇది. బాలయోగి స్పీకర్ గా ఉన్నప్పుడే ఇది కాగితాల దశ దాటి, అంచనాల నుంచి నిర్మాణ స్థాయికి వచ్చింది.

గోదావరి మీద వంతెనలు నిర్మితమవుతున్నాయి. ఇది పూర్తయితే… కోనసీమకు రైల్వే సదుపాయం ఏర్పడుతుంది. యానాం-ఎదుర్లంక వంతెన, కత్తిపూడి – పామర్రు జాతీయ రహదారులకు ఆయనే శంకుస్థాపన చేశారు. అవి పూర్తికాకుండానే తుది శ్వాస విడిచారు.

పార్లమెంటు నమూనాలో ఆర్డీవో కార్యాలయం
బాలయోగి స్పీకర్ కాగానే, అమలాపురంలో రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని నిర్మించ తలపెట్టారు. ఇది దేశంలోనే పేరెన్నికగన్నది కావాలని భావించారు. అందుకే, దీనిని పార్లమెంటు భవనం నమూనాలో నిర్మించారు. దీనిని కూడా ఆయన ప్రారంభించలేకపోయారు. ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. మహానుభావులు ఎప్పుడూ అంతే.. పని చేస్తారు తప్ప ఫలితాన్ని ఆశించరు. ఆ కోవకే బాలయోగి చెందుతారు.
51 ఏళ్లకే తుది శ్వాస
1951 అక్టోబర్ ఒకటో తేదీన జన్మించిన బాలయోగి అతి పిన్న వయసులోనే ఒక ప్రమాదంలో తనువు చాలించారు. 2002 మార్చి 3 న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పార్లమెంటు చరిత్రలో తొలి దళిత స్పీకర్ అయిన బాలయోగి ఇంతటి ఉన్నత స్థానానికి ఎదగడం వెనుక ఆవిరళమైన ఆయన కృషి ఉంది. కాలమూ కలిసివచ్చింది.
ఆయన మరణించిన రోజున ఏమి జరిగింది. ఈనాడు ఆ వార్తను ఎలా కవర్ చేసిందీ? వివరాలు రేపటి ఎపిసోడ్ లో..