సంప్రదాయంపై రథం మనోరథం
భావ కవితలు వెల్లువెత్తించే ముగ్గు
సంక్రాంతి సంబరాల నెమరువేత
(వైజయంతి పురాణపండ)
రథం బయలుదేరుతోంది…
ఒక్క రథం కాదు…
వందల వేల లక్షల రథాలు…
ప్రతి ఇంటి ముంగిట నుంచి ఆనంద వర్ణాలతో బయలుదేరుతున్నాయి…
ఒక రథంతో ఒక రథం పెనవేసుకుంటూ అనుబంధాల కలబోతగా బయలుదేరుతున్నాయి.
అవును సంక్రాంతి పండుగను కొందరు కనుమ నాడు మరికొందరు ముక్కనుమ నాడు రథం మీద ఊరేగిస్తారు.
బయలుదేరుతున్న రథాలన్నీ ఒకరితో ఒకరు తమ తమ అనుభవాలను పంచుకుంటుంటే, రథానికి పూన్చిన గంగిరెద్దులు, రథంలో ఠీవిగా కూర్చున్న హరిదాసులు, భోగాలు అనుభవించిన గొబ్బెమ్మలు… అంతా బంగారు కర్ణాలను అటువైపుగా ఉంచారు.. ఏమరుపాటుగా ఉంటే ఎక్కడైనా విషయాలు మర్చిపోతామేమోనని.
అంతలోనే రథాలన్నిటికీ మహారాజయిన రథం ఇలా అనటం ప్రారంభించింది…
ఈ నెల నాళ్లు తెలుగు లోగిళ్లు అందమైన ముగ్గులతో రంగురంగుల రంగవల్లులతో కళకళలాడాయి కదా!
అమ్మో నా గురించి మర్చిపోతే ఎలా, ముత్యాల ముగ్గుల్లు… ముగ్గుల్లో గొబ్బిళ్లు… రతనాల ముగ్గుల్లు… ముగ్గుల్లో గొబ్బిళ్లు… అంటూ నా గురించి ప్రముఖ భావ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన పాట మరచిపోతున్నావా రథ రాజా.
నీ గురించి ఎలా మరచిపోతారమ్మా. ముగ్గులోని గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ, జై శ్రీమద్రమారమణ గోవిందో హరీ అనగానే మా శిరసు మీద ఉండే అక్షయపాత్రలో ధాన్యం పోసి, కూరగాయలు, పండ్లు ఇస్తుంటారు. ఇంటికి ఏడాదికి సరిపడా గ్రాసం లభిస్తుంది.
మీకే కాదు సామీ, మా గంగిరెద్దుతో మేం ఆటలాడించి, అందరికీ ఆనందాన్ని ఇస్తుంటే, వారు మా నందీశ్వరుడి మూపురం మీద ఎన్ని వస్త్రాలు కప్పుతారో. మా నందిరాజు ఆటను కళ్లప్పగించి చూస్తుంటారు.
నిజమేనయ్యా…
మీరందరూ నెల్లాళ్లపాటు … అదే .. ధనుర్మాసమంతా ఆనందంగా గడిపి, ఆ సంబరాలను ఏడాది పాటు నెమరువేసుకుంటూ, మరుసటి సంవత్సరం దాకా మీ మనసులను పదిలంగా ఉంచుకుంటారు.
అందుకు సంతోషించాలి కదా, విచారంగా మాట్లాడుతావేంటి.
మరేమీ లేదు, నేను మీ అందరినీ ఎవరి ఇళ్ల దగ్గర వారిని విడిచిపెట్టాలి కదా, నా గుండె బరువుతో నిండిపోతుంది. మరుసటి సంవత్సరం వరకు గుండె బరువుతో ఉండిపోవలసి వస్తుంది. అది నాకు ఎంత కష్టమో మీకు ఎలా తెలుస్తుంది. తండ్రి తన ఆవేదనను బయటకు చెప్పుకోలేకపోతాడు.
మీ మాటలు నిజమే సామీ, మేమంటే మా నంది మాకు సంపాదించిన బహుమానాలను చూసుకుంటూ, మా నందిని ఇబ్బంది పెడుతూ ఆడించినందుకు ఆ సామి ముందు మోకరిల్లి క్షమాపణలు చెప్పుకుని, ప్రేమగా అక్కున చేర్చుకుంటూ హాయిగా గడిపేస్తాం.
గాదెలను నింపే అక్షయ పాత్ర
మా అక్షయపాత్రలోని ధాన్యం చూసుకుంటూ, మా గాదెలు నింపినందుకు ఆ అక్షయపాత్రకు, కావిడికి నమస్కరించి మరుసటి సంవత్సరం వరకు దానిని భద్రపరిచే పనిలో మునిగిపోతాం. అయినా రథరాజా! నీకో విషయం చెబుతాను. ఇంటింటా తల్లిదండ్రులు పడే బాధ ముందు, నీ బాధ ఎంత చెప్పు. పిల్లలకు పెళ్లిళ్లు చేసి, అత్తవారిళ్లకో, ఉద్యోగాలకో పంపి, ఏటా వచ్చే పండుగ కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తుంటారు. వాళ్లేమో ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. పెద్దవాళ్లు వారి బాధలను గుండె పొరల్లో ఎవ్వరికీ కనపడకుండా దాచేసుకుంటారు. పిల్లల్ని కని పెంచి పాతికేళ్లు వచ్చాక వారి మానాన వారు ఎదుగుతుంటే ఆనందపడతారు తల్లిదండ్రులు. కాని పిల్లలు దూరం వెళ్లేకొద్దీ, వారి మనసుల్లోని ఆనందం మరింత దూరం వెళ్లిపోతుంటుంది. అన్నిటినీ మౌనంగా భరించటం అలవాటు చేసుకుంటారు.
మంటకు పిడకలతో భోగం
ఇదంతా బానే ఉంది. మీరంతా నన్ను మర్చిపోయారు. పండుగ నాతోనే మొదలవుతుంది కదా. కట్టెపుల్లలు, పిడకలు తీసుకువచ్చి మంట వేసుకుని భోగి మంట అంటారు కదా.
అవును. ముందుగా మంటకు భోగం చేయాలి కదా అగ్ని రాజా!
నిజమే, ఆ మధురక్షణాలు నేను ఎలా మరచిపోగలను. పిల్లలంతా నా చుట్టూ చేరి, చలిని దూరం చేసుకుంటూ, నాకు ప్రణమిల్లుతూ ఓ రెండు గంటలు నా దగ్గరే ఆనందంగా గడుపుతారు. నా మంట చల్లారగానే, నా గుండెల మీద నీళ్లు కాచుకుని, తలంట్లు పోసుకుంటారు. అలా వారు నా గుండెల మీద ఆడుకుంటుంటే, తండ్రి ప్రేమను పూర్తిగా ఆస్వాదిస్తాను నేను. ఆ రెండు గంటల ఆనందాన్ని ఏడాది పొడవునా స్మరించుకుంటూ హాయిగా గడిపేస్తాను.
నన్ను కూడా గుర్తు చేసుకోవాలి రథరాజా! ఆ రోజు అంటే భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగం చేస్తారు కదా. అదే నా పళ్లతో… అదేనయ్యా… రేగుపళ్లను భోగిపళ్లు అంటారు కదా. నన్ను ఆ చంటిపిల్లల తలల మీద పోస్తున్నప్పుడు, నేను ఆ బంగారు తల్లులను ఆరోగ్యంగా ఉండమని ఆశీర్వదిస్తాను. వారు ఆరోగ్యంగా ఉంటేనే కదా నాకు ఆనందం. ఆ పసివారిని నిత్యం గుర్తు చేసుకుంటూ మరుసటి సంవత్సరం కోసం నిరీక్షిస్తూ ఉంటాను.
సంక్రాంతి లక్ష్మి బుంగమూతి
అంతలోనే కొంచెం బుంగమూతి పెట్టుకుని మకర సంక్రాంతి లక్ష్మి…
మీరంతా నా సంగతే మరచిపోయారు. నేను కూడా రథం ఎక్కుదామని వచ్చేలోపే రథం బయలుదేరిపోయింది. సూర్యుడు నా రాశిలోకి ప్రవేశిస్తేనే కదా ఈ పండుగ ఇంత సంబరంగా జరుపుకుంటారు. నా మనసులో కూడా ఒక చిన్న బాధ మిగులుతుంది, అంతలోనే ఆనందమూ కలుగుతుంది. మకర సంక్రమణం రోజునే కదా పెద్దలను తలచుకుని వారికి నైవేద్యాలు పెడతారు. అలా ఆ రోజున వారందరినీ చూసి ఆనందిస్తాను, అంతలోనే ఆ రోజు గడిచిపోతుంది. మళ్లీ నా మనసులో దిగులు మామూలే.
కొలువుకు బొమ్మల తరలింపు
అయ్యో రథ రాజా నన్ను కూడా మరచిపోయావు. వారందరినీ బొమ్మల కొలువులా తరలిస్తావు. అసలైన బొమ్మలకొలువును నన్ను మరచిపోతే ఎలా. ఆ బ్రహ్మదేవుడు కొలువుతీర్చటమే బొమ్మల కొలువు అంటారు కదా. నా పేరుతో ఎన్ని బొమ్మలను వరుస క్రమంలో అందంగా అమరుస్తారో కదా. నాకు హారతి పేరున నీరాజనాలిస్తారు. పిల్లలంతా ఎంతో హుషారుగా నా కొలువును అందంగా తీరుస్తారు. నన్ను మరచిపోతే ఎలా రథరాజా! మేమంతా ఈ ఆనందంతో ఏడాదిని ఒక్క క్షణంలా గడిపేస్తాం.
మిమ్మల్ని ఎవ్వరినీ మరచిపోలేదు నేను.
మీ అందరి సంగతి బాగానే ఉంది. మరుసటి సంవత్సరం కోసం మీరంతా నిరీక్షిస్తూ ఉంటారు. నేను మాత్రం తడిసిన గుండెలతో మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరి ఇళ్ల దగ్గర దింపుతుంటూ, నా హృదయం ఆర్ద్రమవుతూ బరువెక్కిపోతుంటుంది. ఇంతమందిని మీమీ అత్తవారిళ్లలో దింపుతూ, నేను మాత్రం ఒంటరిగా నా ఇంటికి చేరుతాను. మరుసటి సంవత్సరం వరకు భారమైన గుండెలతో అలా నిరీక్షిస్తుంటాను. అయినా ఇవన్నీ జీవితంలో భాగమే కదా!
అవును రథరాజా! ఈ ప్రపంచమంతా మాయ అనీ, భగవంతుడు ఆడించే నాటకంలో భాగమనీ మనకు తెలియచెప్పడానికే నిన్నుఆ శ్రీమన్నారాయణుడు పంపించి ఉంటారనిపిస్తుంది.
ఎంతైనా ఆ హరిదాసువి కదా, నువ్వు వేదాంతమే బోధిస్తావు. నీ మాట ఎందుకు కాదనాలి. అంతా విష్ణు మాయ అనుకుంటే మనసుకి హాయి, శాంతి చేకూరతాయి.
వీలైతే రథ సప్తమినాడు మళ్లీ అందరూ రండి.
కాస్తంత చక్కెర పొంగలి చేసుకుని అందరం నోరు తీపి చేసుకుందాం.
(సృజన రచన)