(కాళోజీ బతికుంటే ఈ పని జేస్తివని బాధపడి హ్రుదిని ఆవేదనల కవిత ఇట్లా రాసుకునేదుండె అనే ఊహ ఇది)
రాకరాక తెలంగాణాకొస్తె, ‘కాకతీయ కాక’ తీసేస్తుంటిరి,
అన్యాయం అన్యాయం, ఎందుకురా ఇంత పనిని జేస్తుంటివి.
‘అక్షరం రూపం దాల్చినదీ ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్లకు కదలిక’
అనుకున్నమని బోయె గాని, మరేమీ పని లేక మెదళ్లకు కదలికే లేదా?
‘నమ్ముకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టికుంటివి
పదవి అధికారము బూని పదిలముగా తల బోడిజేస్తివి
దాపునకు రాననుచు చనువుగా టోపి పెడితివి లాభపడితివి’
అని ఎన్ని సార్లు తిట్టిపోస్తివి, అందుకు లాభపడితివి.
కాకతీయ ద్వారం నిన్నేమన్న జేసెనా, చార్మినార్ ఎందుకొద్దురా నీకు
రాజులు వద్దు వద్దు అంటున్నరు గాని, రామప్ప గోపురం నిన్నేమన్నది.
‘గిట్టని వానిని కొట్టుటకే కదా, మట్టి గొట్టిన విగ్రహాలు నిన్నేమన్నయి?
తోచిన కాడికి దాచుటకే కదా…పొగిడి మన్ననలు పొందుటకే కదా’.
కాకతీయ శిల్పాలు, నిన్నేమన్నయి? అసలు ఎందుకు జేస్తున్నర్ర.
ప్రపంచమంత మెచ్చిన రామప్పను ఎందుకు బెట్టలేదు చెప్పు?
కాటన్ గోదావరి ఆనకట్ట వల్ల ఆంధ్రలో జనానికి బువ్వ పెట్టినోడి వలె
రామప్ప, లక్నవరం తెలంగాణకు బువ్వ.
సంస్కృతి నీకెందుకు కనబడకపాయె
ఇదివరకు ఇన్నేళ్లు ఎప్పుడున్నా జై తెలంగాణమన్న వింటివా?
తెలంగాణ పోరాటంలో పొగలు బెట్టి, మంట బెట్టి, అధికారం రాగానే
‘జయ జయహే తెలంగాణ’ జిందాబాద్, ‘కాకతీయ వైభవం’ వద్దెందుకు?
చార్మినార్ నిన్నేమన్నది, తెలంగాణ గీతం నీకు వద్దెందుకు?
‘మనిషి ఎంత చెడ్డవాడు బతికున్న వాని మంచి
గుర్తించడు గాని, వాని చెడుని వెతికి మరీ గెలుకుతాడు’ అన్నట్టు
మన రామప్ప ప్రపంచ పటంలో కనపడటం లేదా?
‘అవకతవకలు సవరింపలేనప్పుడు ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’
అందుకే కాళోజీ ఇదివరకే అన్నడు గదరా
‘నిన్నుఎన్నుకుంటె వెలగటెట్టడం.. కాదు
ఇంక ఇప్పటిదాకా ఏం చేశినవో చూడు..
పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు’
కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్
మెచ్చుకుంటే నీకెందుకు, నొచ్చుకునే బాధ నాకెందుకు?
ఓరుగల్లు పోతన్న కావ్యం ఇక్కడుంటే నీ ముళ్లేం బోయె.
ఆ గీతంలో రద్దులెందుకు, నా గేయానికి గాయాలెందుకు
ఎందుకింత పనిచేస్తివి. నిన్నేమన్న రామప్ప గొట్టిందా
‘నమ్ముకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టుకుంటివి’
ఏం చేయలేకపోతే పోనీ, పేర్లు మార్చుకుంటే అదే గొప్పతనమా?
(మాడభూషి శ్రీధర్)
(రచయిత మహీంద్రా స్కూల్ ఆఫ్ లా డీన్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్)