స్వరమే ఆమెకు వరం…ఆ స్వరం పేరు సుశీల

Date:

(డాక్టర్ పురాణపండ వైజయంతి)
ఆమె ప్రత్యేకత పాట. ఆ గొంతులో వీణలు మోగుతాయి. కోయిలలు కూస్తాయి. చిలిపి పాటలూ పాడతాయి. కొన్ని వేల పాటలు ఆమె గళం నుంచి జాలు వారాయి. గొంతు వినగానే ఠక్కున గుర్తించగలిగే స్వరం అది. ఆనాటి నేపథ్య సంగీతానికి అనువైన గళం అది. ఆమె పి. సుశీల. తెలుగు చిత్ర సీమలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న సుశీల సోమవారం నాడు 89 వ వసంతంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా గాన కోకిలతో వైజయంతి మాటామంతి ఇది.

‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా… కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా…’ అన్న చందాన పి. సుశీల పాడటం వల్ల పాటకు అందం వచ్చిందా, పాటలోని మాధుర్యం వల్ల పి.సుశీల గాత్రానికి అందం వచ్చిందా… అంటే… ఇందుకు సమాధానం లేదు.
‘వాగర్థావివ సంపృక్తౌ’ (వాక్కు + అర్థం) అన్న చందాన పాటను, పి. సుశీల గాత్రాన్ని విడదీయలేం.
ఆమె పాడే రాగం ఏదైనా, అది సుశీల రాగమే…
గిన్నిస్‌ రికార్డు సాధించిన ఆమెను విజయవాడ ఏడేళ్ల క్రితం సన్మానించింది. ఆ సందర్భంగా పద్మభూషణ్‌ శ్రీమతి పి.సుశీలతో సాగిన ముఖాముఖి ఇది.
కృష్ణవేణి’ చిత్రంలో పాడిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణీ’ పాట విజయవాడ వచ్చినప్పుడు గుర్తుకొస్తుందా అన్నప్పుడు విజయవాడ రావడం చాలా ఆనందంగా, హాయిగా ఉంటుందన్నారు ఆమె. తనకు విజయవాడతో ఉన్న అనుబంధం అలాంటిదన్నారు. ‘కృష్ణవేణి’ చిత్రంలోని ఆ పాట చాలా మంచి పాటనీ, ఆ రోజుల్లో అంత మంచి పాటలు పాడటం వల్లే గుర్తింపు వచ్చిందనీ అంటూ అది భగవంతుడు తనకిచ్చిన వరంగా భావిస్తానని సుశీల వినమ్రంగా చెప్పారు.
తన గురించి చెప్పుకోవడం ఎక్కువ ఇష్టం ఉండదని చెప్పారు. ఏ పాట ఇచ్చినా, మనసుకి సొంతం చేసుకుని పాడతాననీ, అదే నాకు ఇష్టమని స్పష్టం చేశారు. ‘సుశీల పాడితే ఈ పాట బాగుంటుంది. మంచి మెరుగు వస్తుంది అనుకున్నప్పుడే నాతో పాడిస్తారనీ, పాడిన అన్ని పాటలూ ఇష్టమైనవేనని చెప్పారు. పాటలు పాడటానికి విశ్రాంతి ఇవ్వడం తనకు ఇష్టం ఉండదనీ, వరంగా ఇచ్చిన గాత్రానికి పూర్తి న్యాయం చేకూర్చితే చాలని చెప్పారు.
విజయవాడ ఆకాశవాణితో పరిచయం…
మొదట్లో విజయవాడ ఆకాశవాణిలో కర్ణాటక సంగీతం విభాగంలో బి గ్రేడ్‌ ఆర్టిస్టుగా ఉన్నానని తెలిపారు. తరవాత మద్రాసుకు మార్చుకున్నానని చెప్పారు. అక్కడ ఏ గ్రేడ్‌ కోసం మళ్లీ ఆడిషన్‌కి రమ్మన్నారు. అప్పటికే సినిమాలలో బిజీగా ఉండటంతో ఇక మళ్లీ వెళ్లలేదని తెలిపారు సుశీల. అక్కడితో కర్ణాటక సంగీతం పాడటం తగ్గించేశాననీ, సినిమాలకు పరిమితమయ్యానని చెప్పారు.
లలిత సంగీతంలోనూ ప్రవేశం
ఎస్‌. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఎన్నో లలిత గీతాలు పాడానని చెప్పారు. అప్పుడు తన గొంతును డా. మంగళంపల్లి బాలమురళిగారికి వినిపించారు. ఆయన ‘నీ గాత్రం బాగుంది. నువ్వు సినిమాలకి పాడితే బావుంటుంది’ అని ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వాదంతో ఇంతదాన్ని అయ్యానని సుశీల వినమ్రంగా తెలిపారు. ఆయన ఆశీర్వదించిన కొంత కాలానికి ఆయనతో గొంతు కలిపి సినిమాలలో పాడటం తన అదృష్టంగా భావిస్తానన్నారు. ఇద్దరం ఒకే మైక్‌ దగ్గర పాడుతున్న సందర్భంలో ‘నేను చెప్పిన అమ్మాయి ఇంత పెద్ద గాయని అయింది’ అని ఆయన సంబరపడ్డారని సుశీల చెప్పారు.
ఉయ్యూరు చంద్రశేఖర్‌ గారికి రుణపడి ఉంటా…
‘ఉయ్యూరు చంద్ర శేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే నేను పాడిన ఎన్నో వేల పాటలను భద్రపరచుకోలేదు.‘ నా పాటలు 2000 దాకా చంద్రశేఖర్ భద్రపరిచారు, గిన్నిస్‌ రికార్డుకు ఈ సేకరణ ఎంతో ఉపయోగపడిందని కృతజ్ఞతలు చెప్పారు. ఎంత అభిమానం లేకపోతే ఇంత జాగ్రత్తగా తన పాటలను భద్రపపరుస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఆయనను చూడలేదు, కాని ఆయన తనపట్ల ప్రదర్శించిన అభిమానాన్ని మాత్రం ఎన్నటికీ మర్చిపోలేనని తెలిపారు.
ఇప్పటి తరం గురించి…
చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ ఎంతో బాగా పాడుతున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా తన పాత పాటలు ఎంతో మధురంగా పాడుతున్నారని చెప్పారు. ఆ పాటలకు వారు మెరుగులు కూడా దిద్దుతున్నారు. వాళ్ల ద్వారా మా పేరు నిలిచి ఉంటోందని చెప్పారు. ఆడమగ గాత్రం తేడా లేకుండా తన పాటలు, బాలు పాటలు, జేసుదాసు గారి పాటలు, అందరూ అన్నిపాటలూ పాడుతున్నారని సంబరంగా తెలిపారు.
ప్రజలు తనకు రిటైర్మెంటు ఇవ్వట్లేదనీ, ఎక్కడా విడిచిపెట్టట్లేదనీ తెలిపారు సుశీల. సభలకు, సన్మానాలకు పిలుస్తున్నారు. భక్తి సంగీతం ఎక్కువగా పాడుతున్నానని, ఎక్కువ ఓపిక లేక అన్నిచోట్లకీ కదలలేకపోతున్నానని చెప్పారు.
ఆ సంఘటన అనిర్వచనీయం…
గాంధీ జయంతి నాడు రాజ్‌ఘాట్‌ దగ్గరకు వెళ్లి పాడిన సంఘటనను జీవితంలో మరిచిపోలేనని తెలిపారు. దక్షిణాది నుంచి వెళ్లి రాజ్ ఘాట్ లో ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మిగారి తర్వాత పాడింది తను మాత్రమే అన్నారు. ఇదెంతో ఆనందం కలిగిస్తుందన్నారు. శ్రీలంకలో ‘కంబన్‌’ అవార్డు ఇస్తున్నసందర్భంగా తను ఊరేగింపుగా తీసుకువెళ్లారని, అది మరో తీపి జ్ఞాపకమని సుశీల ముఖాముఖిని ముగించారు. (గాన కోకిల పి. సుశీల జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...