ప్రత్యర్థులను విస్మయంలో ముంచిన కె.సి.ఆర్. నిర్ణయం
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
మంచి రోజు… మంచి సమయం చూసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. అసెంబ్లీ ఎన్నికల గోదాలోకి దిగడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. జాతకాలనూ, సుముహుర్తాలను ప్రగాఢంగా విశ్వసించే కల్వకుంట్ల మూడు నెలల ముందుగానే ఎన్నికల బరిలో నిలిచే గుర్రాలను సిద్ధం చేశారు. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని అందుకు ఆయన ఎంచుకున్నారు. తెలంగాణ భవన్ వేదికగా మధ్యాహ్నం సరిగా 2 38 కి అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. 119 స్థానాలలో 115 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. జాబితాలో పెద్దగా మార్పులు ఏమీ లేవు. తీవ్ర వ్యతిరేకత అంటే పార్టీని నష్టపరిచే చర్యలకు పాల్పడ్డ ములుగు ఎమ్మెల్యే రాజయ్య లాంటి వారిని పక్కన పెట్టారు. ఈ చర్య కె.సి.ఆర్. ఆంతర్యాన్ని సూటిగానే చెప్పింది. ఇదే సమయంలో హై కోర్టులో అనర్హత వేటు పడి, సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకున్న వనమా వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
అసలు విషయానికి వస్తే… అభ్యర్థుల ప్రకటనలో కె.సి.ఆర్. ఎందుకింత ముందర ఉన్నారు? అదే తొందర పడ్డారు? అంటే సమాధానం చాలా తేలిగ్గానే దొరుకుతుంది.
👉2014 లో కేసీఆర్ కు వ్యవస్థలు లేవు, జనాల్లో ఆదరణ ఉంది.
👉2018 కేసిఆర్ కు వ్యవస్థ ఉంది, జనాల్లో కొంత ఆదరణ ఉంది, ప్రతిపక్షం బలహీనంగా ఉంది.
👉2023 లో కేసీఆర్ కు వ్యవస్థ మాత్రమే ఉంది. జనాల్లో ఆదరణ అస్సలు లేదు.
తన అధికారంతో, వ్యవస్థలతో లేని బలాన్ని చూపిస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం.
తనదైన ముద్రను ప్రదర్శించిన కె.సి.ఆర్.
ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో ఆయన తనదైన ముద్రను అభ్యర్థులను ముందే ప్రకటించడం ద్వారా ప్రదర్శించారు. రెండోసారి ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన కె.సి.ఆర్. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు? కేంద్రంతో సత్సంబంధాలు ఉంటే తప్ప ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సాధ్యం కాదనే విషయం ఆయనకు తెలుసు. ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పుడు తొంబై శాతం పాత వారినే కొనసాగించడం దేనికి సంకేతం. తెలియని మూర్ఖుని కంటే తెలుసున్న శత్రువు మేలన్న సూత్రాన్ని పాటించినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పుడు విధేయత కనబరుస్తున్నవారు… ఒక వేళ టికెట్ రాకపోయి ఉంటే ఎలా వ్యవహరించేవారో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. టికెట్ వచ్చినా మైనంపల్లి హనుమంతరావు చేస్తున్న విమర్శలను చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో కాంగ్రెస్, టి.డి.పి. నుంచి వచ్చిన వారే. వీరంతా కె.సి.ఆర్. శైలికి అలవాటుపడినవారు.
మూడు నెలల ముందుగా జాబితాను ప్రకటించడం ద్వారా తాను ఎంత బలంగా ఉన్నానో చెప్పకనే చెప్పారు కె.సి.ఆర్. 2018 లో ఎనిమిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి, సెప్టెంబరులో 105 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేశారు. ఇప్పుడు కూడా నాలుగు నెలల ముందే ఆ పని చేశారు. ఆసిఫాబాద్, బోధన్, ఖానాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఉప్పల్, వైరాలలో మాత్రమే అభ్యర్థుల్ని మార్చారు.
ఇంతకంటే ఒక గొప్ప విశేషం ఉంది. ఎన్నికలు మూడు నెలలలోకి వచ్చాయి. అభ్యర్థుల్ని ప్రకటించేశారు. అయినా కె.సి.ఆర్. మంత్రివర్గ విస్తరణ తలపెట్టారు. ఇలా చేయడం ఒక్క కె.సి.ఆర్.కె చెల్లుతుందేమో. పార్టీ వారు దీనిని సానుకూలంగా చూస్తుంటే… ప్రతిపక్షాలు ఈ చర్యలో కె.సి.ఆర్. అభద్రతను చూస్తున్నాయి. ఏది ఏమైనా మంత్రివర్గ విస్తరణ వెనుక కొత్తగా నెరవేరే లక్ష్యం ఏమిటనేది అంతుబట్టని బ్రహ్మ పదార్థమే.
కిందటి ఎన్నికల్లో టి.ఆర్.ఎస్.కు ఎనభై ఎనిమిది సీట్లు దక్కాయి. కాంగ్రెస్, టి.డి.పి.ల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో ఆ సంఖ్య వంద దాటింది. ఈ సారి బి.జె.పి., కాంగ్రెస్ పార్టీలకు వేళ్ళపై లెక్కించే స్థాయిలో సీట్లు లభిస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఏ.ఐ.ఎమ్.ఐ.ఎమ్. ఏడు స్థానాలు గెలుచుకుంటుందని చెబుతున్నారు. తమ పార్టీ 95 సీట్లు గెలుస్తుందని ఆయన చెబుతున్నారు.
జర్నలిస్టులపై వ్యాఖ్యలు….
అభ్యర్థుల ప్రకటన కార్యక్రమంలో జర్నలిస్టులపై ఆయన చేసిన వ్యాఖ్యలు నివ్వెరపరిచాయి. జర్నలిస్టులు అందరిలాగే ఉద్యోగులు. యాజమాన్యం ఏది చెబితే అది చెయ్యాలి. వారికి సొంత నిర్ణయాలు తీసుకునే వీలుండదు. ఆ మాత్రం జ్ఞానం, విజ్ఞానం పాత్రికేయులకు ఉండాలి కదా అన్న సీఎం వ్యాఖ్య సరైనదే. అలా ఆలోచించేవారు జీతగాళ్లుగా ఎందుకు పనిచేస్తారు? పత్రికలంటారా ఆయన మాటలకు ఆక్షేపణే లేదు. కారణం పార్టీకి ఒక పత్రిక… ఒక ఎజెండా.. అందులో ఈ పాత్రికేయులు జీతగాళ్ళు. చెప్పింది చేయకపోతే నాలుగు రాళ్లు ఇంటికి రావు. ఇలాంటి పరిస్థితికి వారిని యాజమాన్యాలు నెట్టేశాయి. ఈ విషయంలో సీఎం గారికి ఎవరో రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి ఉంటారనిపిస్తోంది.
ముందస్తు జాబితాకు కారణం ఏమిటంటే…?
Date: