(కలగ కృష్ణ మోహన్)
ఏమిటిది? …ఏమవుతోంది??
కాలం చిరుకొమ్మ మీద పూసిన మనోహరమైన రాగాలన్నీ ఒకటొక్కటిగా రాలిపోతున్నాయేమిటో!
సహజమే కావొచ్చు. కానీ .. ..
స్నేహానికీ, ప్రేమకూ వయస్సుతో సంబంధం లేదని
అనేక పగళ్ళూ, సాయంత్రాలూ, రాత్రులూ
సంగీతపరమైన నా సంశయాలను
ఓపికగా తొలగించి
సుజ్ఞాన తీరాలకు దారి చూపిన
“లలిత సంగీత చక్రవర్తి” మరి లేరా ?
ఇంకెప్పటికీ నా మాటలూ, పాటలూ, రచనలూ వినలేరా ??
శృతి వీడని గానం ..
లయ తప్పని ధ్యానం – ఆయన సంగీతం.
పలకరించే చిరునవ్వుతో కదిలే చైతన్య.
సున్నితమైన హాస్యం,
ఎవరినీ కించపరచని పెద్దరికం –
ఆయన వ్యక్తిత్వం.
సంగీతానికి సంబంధించిన
అన్ని ప్రక్రియలనూ గౌరవించే హృదయం…
కొత్తదనాన్ని ఆహ్వానించి, ఆస్వాదించే గుణం…
ఆయన సంస్కారం.
మాష్టారికి –
జీవితమంటే సంగీతమే.
పాటే తన ధ్యానం .
పాటే తన గమనం .
పాటే తన గమ్యం .
నిరంతర “స్వరధ్యానం”, అసామాన్య “స్వర జ్ఞానం”తో
శోధనా, బోధనా –
అదే వారి మనుగడ.
“సంగీత జ్ఞానము – భక్తివినా.. ..”
అని త్యాగరాజ స్వామివారు చెప్పిందానికి తోడు
ఆ సంగీతం పట్ల
శ్రద్ద, విధేయతకు
నిజమైన ఉదాహరణ – చిత్తరంజన్ మాస్టారు.
లలిత గీతానికి
లాలిత్యాన్ని అద్ది
అందమైన సంగతులతో మెరుగులు దిద్ది
సొగసుగా, జనరంజకంగా, చిత్తరంజకంగా
పాడిన గాత్రం
ఇక వినిపించదన్నది నమ్మలేని నిజమే అయినా
నమ్మక తప్పదు మరి !
నన్నొక ఏకలవ్య శిష్యుడిగా స్వీకరించి .. ఆదరించిన
💓సుస్వర యతి💓
ఇంక ఎప్పటికీ కనిపించరన్నది
ఈ మోహనాత్మలో – ఎప్పటికీ ఒక
తీరని వెలితే మరి !
సుస్వర యతికిదె వందనం – విమల
సంగీత మతికిదె వందనం
సప్తస్వర నాద సుధారస లలిత
సంగీత నిధికిదె వందనం
నాద శోధనకు రాగ సాధనకు
మనసా వాచా అంకితమై
మనతో తిరిగే – సామవేద – మధుర
గానమూర్తికిదె వందనం
కదిలే పాటల పాఠశాల – ఎద
మెదిలే సుమధుర రాగ హేల – తన
నడకా నడతా సంగీతమయమైన
మృదుల గరిమకిదె వందనం
ఆత్మానందమె పరమావధిగా
మనసూ హృదయం మమేకమై – జన
రంజకమై చిత్తరంజనమై చెలగు
మోహనాత్మకిదె వందనం
(వ్యాస రచయిత ఆకాశవాణి పూర్వ ఉన్నతోద్యోగి ముఖ సంగీతవేత్త చిత్తరంజన్ కన్నుమూసిన సందర్భంగా సమర్పించిన నివాళి)