పంచాయతీ సెక్రెటరీలూ అభినందనలు
నిబంధన మేరకు క్రమబద్దీకరణ
ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కె.సి.ఆర్.
హైదరాబాద్, జులై 11 : తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లోని అభివృద్ధిలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా వున్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడివున్నదన్నారు. సాధించిన దానితో సంతృప్తిని చెంది అలసత్వం వహించకూడదని, తెలంగాణ పల్లెలు మరింతగా గుణాత్మక మార్పు చెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయితీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగుతూనే వుండాలని సిఎం ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో.. తమ నాలుగు సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేశించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి, క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
పంచాయితీ కార్యదర్శులు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం. మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతో పాటు పలు రకాల బాధ్యతలను చేపట్టాలనే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం వారికి విధిగా నిర్ణయించింది.
తమ ప్రొబేషన్ పీరియడ్ ను పూర్తి చేసుకున్న కార్యదర్శులను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ పరిశీలనలో నిర్థేశించిన లక్ష్యాలను మూడింట రెండు వంతులు చేరుకున్న వారికి రెగ్యులరైజ్ చేయాలని ఉన్నతస్థాయి సమావేశం లో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ని పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న వీ ఆర్ ఏ (విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్) లను, వారి వారి విద్యార్హతలను, సామర్థ్యాలను అనుసరించి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో వీఆర్ఏ లతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సిఎం అన్నారు. ఇందుకు గాను, మంత్రి కె.టి.రామారావు ఆధ్వర్యంలో మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లతో కూడిన మంత్రి వర్గ ఉప సంఘాన్ని సిఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు.
రేపటి నుంచి చర్చలు
సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వర్గ ఉప సంఘం వీఆర్ఏ లతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనున్నది. చర్చల అనంతరం ఉప సంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకోని వీఆర్ఎ ల సేవలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉప సంఘం కసరత్తు పూర్తయి తుది నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలని సిఎం ఆదేశించారు.