వ్యూస్ ప్రత్యేకం
ప్రముఖ జర్నలిస్ట్ జగన్నాథస్వామి రచన
లలిత సంగీత, చలనచిత్ర నేపథ్య గాయక సమ్రాట్ ఘంటసాల వేంకటేశ్వరరావు గారి శత జయంతి వత్సరమిది. ఈ సందర్భంగా దేశవిదేశాల్లోని తెలుగు వారు, వివిధ సాంస్కృతిక సంస్థలు, సంఘాలు అనేకానేక కార్యక్రమాల ద్వారా ఆయన దివ్యస్మృతికి నివాళులు అర్పిస్తున్నాయి.జీవించింది యాభయ్ రెండేళ్లు, భువిని వీడి నలభయ్ ఏడేళ్లు. నాటి నుంచి లెక్కకు మిక్కిలిగా ఆరాధనోత్స వాలు, సంగీత విభావరులు. అన్నమయ్యాది వాగ్గేయకారుల తరువాత ‘స్వరనీరజనం’ అందుకుంటున్న దేశంలోనే ఏకైక గాయకుడుగా చెప్పవచ్చేమో!!
ఘంటసాల తెలుగుజాతి ఉమ్మడి గాత్ర సంపద. ఆయనను ప్రతి తెలుగు కుటుంబం తమ సభ్యుడిగా భావిస్తోంది, ఆరాధిస్తోంది. ఆయన గురించి మురిపెంగా చెప్పుకుంటోంది. ఆయన భౌతికంగా దూరమైన తరువాత కళ్లు తెరిచిన తరం కూడా ఆయన గానాన్ని ఆస్వాదించడం ఆ గాత్ర మాధుర్యానికి ఉత్తమ నిదర్శనం.కూనిరాగం తీయని వారు ఉండనట్లే ఘంటసాల వారి గీతాలలో ఒక పదం,పంక్తినైనా ఆలపించని తెలుగు వారు ఉండరనడంలో అతిశయం లేదు.ఆ మహనీయుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంటుంది.ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం, నిరాడంబరత, నిజాయతి, వినయం,వృత్తిపట్ల నిబద్ధత,అంకితభావం,జీవిత,నేపథ్య గాన ప్రస్థానాలలో ఎగుడు దిగుడులు,వాటిని అధిగమించిన తీరు అభిమానులకు,,ప్రత్యేకించి గాయనీ గాయకులకు స్ఫూర్తిదాయకాలు.ఘంటసాల గారి సమకాలికులు,దగ్గరి పరిచయస్థులు ఎందరో ఆయనతో గల అనుభవాలను వివరించిన తీరును వారి శతజయంతి సంవత్సరం సందర్భంగా మరోసారి స్మరించుకోవాలన్నది ‘వ్యూస్’ సంకల్పం. విశేషాంశాలతో వారం వారం ‘ఘంటసాల స్మృతి పథం’ పేరిట త్వరలో ధారావాహికను సమర్పిస్తుంది.