రంజాన్ విందు స్వీకరించిన ముఖ్యమంత్రి
ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపిన కల్వకుంట్ల
హైదరాబాద్, ఏప్రిల్ 22 : ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లిం సహోదరులు పవిత్ర మాసం గా జరుపుకునే రంజాన్ నెల చివరి రోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వున్న ముస్లింలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఆహ్వానం మేరకు వారి నివాసంలో శనివారం నాడు సిఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో పాల్గొన్నారు.
శనివారం మధ్యాహ్నం తమ నివాసానికి చేరుకున్న సిఎం కేసీఆర్ కు మహమూద్ అలీ వారి కుటుంబ సభ్యులు, సిఎంని శాలువాతో సత్కరించి పుష్ఫగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హోం మంత్రి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయపద్దతిలో వారు ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని తన వెంట వచ్చిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధుల బృందం తో కలిసి సిఎం కేసీఆర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా రంజాన్ మాసంలో ఆచరించే పవిత్ర ఉపవాస దీక్షలు, జరిపే దైవ ప్రార్థనలు, ఈసందర్భంగా పెంపొందే క్షమాగుణం, కరుణ ప్రేమ తదితర ఆధ్యాత్మిక భావనల గురించిన అంశాలపై రంజాన్ పండుగ ప్రాశస్త్యం గురించి సిఎం స్మరించుకున్నారు. ఇవే అంశాలపై తన వెంట వచ్చిన మంత్రులు ప్రజాప్రతినిధులు ముస్లిం పెద్దల తో సిఎం కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా తనను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియచేయాడానికి వచ్చిన పలువురు మత పెద్దలు, సామాన్యులను పేరు పేరునా పలకరించి, అలాయ్ బలాయ్ తీసుకుని వారికి సిఎం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా ఉద్యమకాలం నుంచీ నేటి వరకు తనతో కొనసాగుతున్న సీనియర్ కార్యకర్త సత్తార్ గుల్షనీ ని పేరు పెట్టి పిలిచి దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ విజయలక్ష్మీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పలు కార్పోరేషన్ల చైర్మన్లు మసీఉల్లాఖాన్,సలీం, రవీందర్ సింగ్, మేడె రాజీవ్ సాగర్, సీనియర్ నేతలు మొయిత్ ఖాన్, రాయిడన్ రోచ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోం మంత్రి దంపతులు కుమారుడు అజమ్ అలీ, కూతుర్లు కోడలు తదితర కుటుంబ సభ్యులు తమ ఆతిథ్యం స్వీకరించినందుకు సిఎంకి ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా సిఎం కేసీఆర్ కు హోం మంత్రి జ్జాపికను బహుకరించారు.