1965 నాటి కథ : నేటి తరానికి పనికొచ్చే అంశం
(ఇది చదవబోయే ముందు భారతం శాంతి పర్వంలో భీష్మ కృష్ణ సంవాదం చదవగలిగితే మాధవపెద్ది బళ్ళారి వారల అనుబంధం సుఖంగా అర్థమవుతుంది. ఈ మాట చెప్పడం దేనికంటే భారతం నాటి నుంచి నేటి వరకు భారతదేశంలో మానవ మనస్తత్వంలో మార్పు లేదు. మానవత్వానికి దూరులైన వారికి భారతమూ అవసరం లేదు. భారతీయ సంస్కారమూ అనవసరమే.)
చాలా రోజుల క్రితం మాట ౼ అంటే నాలుగు దశాబ్దాల పై మాట.
అప్పటికి సినిమా హీరోలకు పాద పూజలూ ఉండేవి కావు, తారల చిత్రాలు పడక గదిలో గోడల మీదా నవ్వేవి కావు. అసలు మనిషిని మనిషి ఆరాధించడం ఎరగని కాలం. మనిషిలోని ప్రతిభకు వినయంగా గౌరవం లభించే దివ్య క్షణాలవి.
ఆ రోజుల్లో ౼
తిరుపతి వేంకట కవుల ఉద్యోగ విజయాలు నాటకం వేస్తున్నారంటే పాతిక ముప్ఫై మైళ్ళ దూరం (కిలోమీటర్లు పుట్టని రోజులవి) బళ్ళ మీద వచ్చి ముచ్చటగా చూసేవారు. అప్పటికింకా ౼
“నారి సారించుచున్” అనే మాట పూర్తి కావడానికి “సా” ౼ దగ్గర ఆరున్నర నిమిషాలు జిలేబీ చుట్టల సంగీతం పుట్టలేదు.
ఆ రోజులలో ౼
మాధవ పెద్ది వెంకట్రామయ్యగారని ఒక మహానటుడుండేవారు.
ఆయన రంగస్థలం మీదనే కాదు, రాచ బాటలో నడుస్తున్నా దుర్యోధన సార్వభౌముని ఠీవి ఫెళఫెళలాడేది.
ఆ రోజుల్లోనే ౼
విశ్వనాథ సత్యనారాయణ గారు నర్తనశాల రాశారు. దానిలో మాధవ పెద్దివారు కీచకుని పాత్ర ధరించేవారు. ఒకనాడు ఆ నాటకం చూడడానికి వచ్చిన ప్రేక్షకులలో బళ్ళారి రాఘవ కూడా ఉన్నారు.
ముందు వరసలో కూర్చుని మాధవ పెద్ది వారి నటనలోని విశిష్ట లక్షణాలను తిలకిస్తున్నారు.
మొదటిసారి అంతఃపురంలో తిరస్కరించి ఛి ఛీ అన్న సైరంధ్రి, మరునాడు కీచకునితో రహస్యంగా నర్తనశాలలో గడపుదాం అని చెప్పి పంపుతుంది.
ఆ సాయంకాలం కీచకుడు బాగా అలంకరించుకుని సైరంధ్రి వంటి అందగత్తెను సమ్మోహింపజేసే రీతిలో తన అలంకారం ఉన్నదో లేదో అని తన శయ్యా మందిరంలోని అద్దంలో తన ముఖం చూసుకుంటూ చిరునవ్వుతో కోరమీసం పైకెగదువ్వుకుని ఒక్కసారి ప్రేక్షకుల వైపు తిరిగాడు.
మరు క్షణంలో అద్దం దగ్గరకు వెళ్లి తన ప్రతిబింబాన్ని తనివితీరా చూసుకున్నాడు. వివిధ భంగిమలలో తన అందాన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఒక్క క్షణం ప్రేక్షకుల వైపు తిరిగి రెండు అడుగులు వేసి మళ్లీ అద్దంలోని తన వదనారవిందాన్ని చూసుకుంటూ ఆ ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకున్నాడు ౼
మరుక్షణంలో బళ్లారి రాఘవ ఒక్క అంగలో రంగస్థలం మీదికెక్కి మాధవ పెద్దిని గాఢాలింగనం చేసుకొని పాదాభివాదం చేసి ౼
“నువ్వు నటతపస్వివి నీవంటి నటుడు దొరికిన విశ్వనాథ ధన్యుడు” అన్నారట.
బళ్ళారి రాఘవ అంత మాట అన్నా చలించకుండా మాధవ పెద్ది తన నటన పూర్తి చేసి తెర వెనుకకు వెళ్లాక, “రాఘవ కూడా తపస్వి” అన్నారట. అలా ఉండేవి ఆ రోజులలో.
ఏ కళలో అయినా ఆరితేరిన వారు అదే కళలో ఆరితేరిన సార్వభౌములకు అభినందనలు అందించి ఆనందించేవారు. ఆ ఔదార్యానికి హారతులు పట్టగలిగినా చాలు మనం మనుషులం అనుకోవడానికి.
౼ ఉషశ్రీ
(1965 ప్రాంతంలో ఉషశ్రీ రచన ఇది. అప్పట్లో ఆయన రేడియో ఉద్యోగంలో కొత్తగా చేరారు. ఉషశ్రీ 95 వ జయంతి సందర్భంగా)