నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య హననం
బీజేపీపై విరుచుకుపడ్డ కేసీఆర్
అన్ని వేల కోట్లు ఎక్కడనుంచి వచ్చాయని ప్రశ్న
బ్రోకర్ల రూపంలో రాజకీయాలా అంటూ మండిపాటు
అంతటి ఇందిరకే పరాభవం తప్పలేదన్న ముఖ్యమంత్రి
ఎమ్మెల్యేలనే కొంటారా! ఆధారాలను అందరు సీఎంలకు పంపా
మీడియా ముందు బీజేపీ గుట్టు విప్పిన కల్వకుంట్ల
హైదరాబాద్, నవంబర్ 3: “సెకండ్ షో మొదలుపెడుతున్నా” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం రాత్రి తన ప్రెస్‌మీట్‌ను ప్రారంభించారు. భారమైన మనసుతో దీనిని స్టార్ట్ చేస్తున్నాననీ, తన జీవితంలో మొదటిసారిగా అంటూ ప్రారంభవాక్యంతో మొదలు పెట్టారు. గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యహత్యలు చేస్తున్న హంతకుల వ్యవహారం దేశానికే ప్రమాదకరం అని కేసీఆర్ హెచ్చరించారు. ఊహకు కూడా అందని దుర్మార్గాలు చేస్తున్నారన్నారు. ఎనిమిదేళ్లలో బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిందని విరుచుకుపడ్డారు.
రూపాయి విలువ దారుణంగా పడిపోయింది…. నిరుద్యోగం తాండవిస్తోంది…. ప్రజలను విభజిస్తున్నారు. భారత జనజీవనాన్ని కలుషితం చేస్తున్నారంటూ విమర్శలు కుప్పించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి తనను కలిసినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
రెండు గెలిచాం… రెండు ఓడాం…
ఎన్నికలన్న తరువాత గెలుపుఓటములు సహజమనీ, నాలుగు ఉపఎన్నికలు జరిగితే రెండు గెలిచామనీ, రెండు ఓడామనీ కేసీఆర్ తెలిపారు. రాజకీయాల్లో ఉన్నవారు విలువలను కాపాడుకోవాలని హితవు పలికారు. వాళ్ళను గెలిపిస్తే ఎలెక్షన్ కమీషన్ సక్సెస్. వాళ్ళు ఓడితే ఎలెక్షన్ కమీషన్ విఫలం! ఇదా పధ్ధతి. గెలుపోటములను గంభీరంగా స్వీకరించాలంటూ చెప్పారు.
అందరు ముఖ్యమంత్రులకూ పంపా
బీజేపీ దుర్మార్గ విధానాలను దేశంలోని అన్ని రాజకీయపార్టీలకు, ముఖ్యమంత్రులకు పంపించానని వెల్లడించారు. అందరూ బీజేపీ ఘాతుకాలను తెలుసుకోవాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు. బంగ్లాదేశ్ యుద్ధం తరువాత ఇందిరాగాంధీకి తిరుగులేదనుకున్నారు. ఆమె చేసిన చిన్న పొరపాటు వలన తదుపరి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేపీ చేస్తున్న జుగుప్సాకర రాజకీయాలు చూస్తే అసహ్యం కలుగుతుందని విమర్శించారు.
ఇంత దిగజారాలా!
ఒక ప్రధానమంత్రిగా ఉండీ బెంగాల్ వెళ్లి తృణమూల్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెబుతారు. ఒక ప్రధాని ఇంత దిగజారి మాట్లాడటం ఏనాడైనా విన్నామా? ప్రజాస్వామ్యంలో ఇది వాంఛనీయమా? దేశంలోని మీడియా అంతా ఖండించాలని కోరారు. టచ్‌లో ఉండడమా! అదేం టచ్… పాడు టచ్.. టచ్చా… సంపర్కమా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఆ వీడియోను కోర్టుకు పంపాం
రామచంద్రభారతి అనే ఢిల్లీ మనిషి ఇక్కడికొచ్చి మా ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యాలని ప్రయతించాడని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఎంత దారుణం అంటూ ప్రశ్నించారు! ఆ ఎపిసోడ్ మొత్తం మూడు గంటల వీడియో. దానిని కోర్టుకు అందచేశాం. వాటిని చూశారంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
ఆ రాక్షసుల కుట్రను మా ఎమ్మెల్యేలు బయటపెట్టడంతో అంతా బయటకొచ్చింది. అనేక రోజులుగా ఈ కుట్ర జరుగుతున్నది.
దర్యాప్తు సంస్థలనుంచి రక్షిస్తామని, వై ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారు. వాళ్ళేమైనా కేంద్ర మంత్రులా? ఎలా మాట్లాడుతారు? ఇంత విశృంఖలతా? ఆ ముఠాలో ఇరవైనాలుగు మంది ఉంటారట. ఒక్కొక్కరికి రెండు మూడు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు ఉంటాయట. రాహుల్ గాంధీ మీద కేరళలో పోటీ చేసిన తుషార్ అనేవాడు దీని సూత్రధారి. ఆయన్ను ఎంకరేజ్ చేసింది కేంద్ర హోమ్ మంత్రి! (ఆ డాక్యుమెంట్స్ అన్నీ విలేకరులకు చూపించారు కేసీఆర్).. అందరు న్యాయమూర్తులకు ఈ వివరాలు పంపిస్తున్నాను.
దీన్ని చాలా సీరియస్ గా పరిశీలించాలని న్యాయమూర్తులను, కోర్టులను కోరుతున్నాను. మఠాధిపతులు రూపాలు, వేషాలతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలి. అలాంటి ఉద్యమానికి శ్రీకారం చుడతానని వెల్లడించారు.
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తరహా ఉద్యమాన్ని మొదలుపెడతామని కేసీఆర్ వివరించారు. దేశం కోసం చావనైనా చస్తా కానీ ఇలాంటి అరాచకాలు క్షమించనని స్పష్టంచేశారు. ఏం చేస్తారో చేస్తానన్నారు.
8 ప్రభుత్వాలను కూలదోసింది..
బీజేపీ ఇప్పటికి ఎనిమిది ప్రభుత్వాలను కూలద్రోసింది. ఇప్పుడు తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్రా ప్రభుత్వాలను కూలగొడతాం అంటున్నారని తెలిపారు. ఈ వేలకోట్ల రూపాయలను బీజేపీకి ఎవరు సమకూర్చుతున్నారు? విచారణ జరగాలి. డబ్బులతో కోనేట్లయితే ఇక ఎన్నికలు దేనికి? మేము ఎవ్వరినీ కలుపుకోలేదు.
కొద్దిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నన్ను కలిసి నియోజకవర్గం అభివృధ్ధికోసం మీ పార్టీలో చేరుతామంటే నాలుగు నెలలు వెయిటింగ్ చేయించి అందరితో ఆలోచించి పార్టీలోకి తీసుకున్నాం తప్ప ఎవ్వరినీ మేము కొనుగోలు చెయ్యలేదు. 88 స్థానాలు వచ్చిన మాకు ఎవ్వరి అవసరం లేదన్నారు కేసీఆర్.
మూడు భాషాల్లో గంభీరంగా
ఎప్పటిలాగే కేసీఆర్ తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో అత్యంత గంభీరంగా ఉపన్యసించారు. మధ్యలో కేసీఆర్ మార్క్ మెరుపులూ ఉన్నాయి. ప్రయోగించిన కొన్ని పదాలు, ప్రయోగాలు అచ్చ తెనుగులో, గ్రాంధిక భాషలో విద్యుల్లతల్లా మెరిపించాయి.
సామెతలు, నుడికారాలు, జాతీయాలు ఆయన నోటిపై నాట్యం చేసాయి. విలేకరులు అందరికి ఆ వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ లు ఇచ్చారు కేసీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు సంభాషణల వీడియోలను ప్రదర్శించారు. మీరు సమయం ఉన్నప్పుడు చూసుకోవచ్చు అన్నారు. వీడియోను విలేకరుల ముందు ప్రదర్శించారు.