అమరగీతానికి అపచారాన్ని ఆపాలి
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
తరాతరాలకు సరిపడేంత సంపాదించాలనుకోలేదు, సంపాదించనూ లేదు. గాయక సమ్రాట్ గా మాత్రం చిరకీర్తిని దక్కించుకున్నారు. కొత్త గాయకులను ప్రోత్సహించాలని తహతహలాడారు. బతికినంతకాలం పాడాలని, పాడినంత కాలమే బతకాలిఅని మాటను నిజం చేసినట్లు, ఇంటికో
ఘంటసాలను తయారు చేసి తరలిపోయారు. తన పేరు విన్నంతనే పులకించిపోయేంతలా జనహృదిలో నిలిచిపోయిన ధన్యజీవి. జానపదాల నుంచి జావళీల దాకా, ఆకతాయి పాటల నుంచి అష్టపదుల దాకా, లలిత సంగీతం నుంచి శాస్త్రీయ సంగీతం వరకు ఆయన
కంఠ`శాలలో కొలువుతీరాయి. పద్యం గానం ఆయన ప్రత్యేకతగా స్పష్టం చేయనవసరంలేదు. ఆయన కంఠస్వరంతో పాటు ఆయన వ్యక్తిత్వమూ మధురమే. మధుర రాగసుధలు పంచి కోట్లాది మనసులను కొల్లగొట్టిన ఘంటసాల వేంకటేశ్వరరావు ఆ గాన వైభవం గురించి చెప్పుకోవడం చర్వితచర్వణమే అవుతుంది. సహస్రాధిక గీతాలాపన, శతాధిక చిత్రాల సంగీత దర్శకుడిగా శ్రోతల మనసులను రజింపచేసిన ఘంటసాల వారి గురించి ఎంత చెప్పుకోవడం చర్వితచర్వణమే అవుతుంది. అయినా జయంతి, వర్ధంతుల సందర్భంగా ఆయన ఉన్నతిని, వ్యక్తిత్వాన్ని స్మరించుకోవడం ఓ మధురానుభూతి. ముఖ్యంగా ఇది వారి శతజయంతి వత్సరం కావడం మరో విశేషం.
అదీ ఆయన వ్యక్తిత్వం…
ఘంటసాల నేపథ్య గానాన్ని బతుకుతెరువుగా తీసుకున్నారు తప్ప సర్వం సహా చక్రవర్తిగా ఎలాలన్నా భావన ఎన్నడూ లేదని ఆయన సహధర్మచారిణి సావిత్రమ్మ గారు సహా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలవారి మాటలను బట్టి తెలిసింది. నటించే అవకాశాలు వచ్చినా నేను పాటలు పాడి బతుకుతున్నాను చాలు. నేను నటిస్తే మరొక నటుడుకి అవకాశం పోతుంది. ఆ నటుడి పొట్టకొట్టకూడదు. వీలైనంత వరకు ఇతరులు బతకడానికి మనవంతు కృషి చేయాలి అనే మనస్తత్వంతో
అని మృదువుగా తిరస్కరించేవారట. తానొక్కరే సినీ నేపథ్య రంగాన్ని ఏలాలి
అని ఎన్నడూ అనుకోలేదు. మీరే పాటలన్నీ పాడాలన్న దర్శక నిర్మాతలకుఅన్నీ నేనే పాడితే బాగుండదు బాబూ!
అనినచ్చచెప్పిఇతర గాయకులతో పాడించిన సందర్భాలు ఎన్నెన్నో. స్వీయ సంగీత దర్శకత్వంలో ఇతరులతో పాడించారు. తమిళ, కన్నడ చిత్రాలలో తాను పాడడం వల్ల ఆయా భాషా గాయకులకు అవకాశాలు తగ్గుతాయన్న భావనతో వాటికి పాడనని ప్రతినబూనారని చెబుతారు. నేపథ్యగాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచ స్థాయిలో ఉన్నప్పుడే ఆయనలో చెప్పలేని ఆవేదన,భయం చోటు చేసుకున్నాయని ఆయన శిష్యుడు, సంగీత దర్శకుడు జేవీ రాఘవులు ఒక సందర్భంలో చెప్పారు. ఈ సినిమా పరిశ్రమలో ఇకపై మనుగడ కష్టం అని, నాటకాలైనా వేసుకొని బతకాలని చాలా వూళ్లలో నాటకాలు వేయడం ప్రారంభించారు. నేనూ వెంటవెళ్లేవాడిని
అని రాఘవులు చెప్పినట్లు నటుడు రావి కొండలరావు ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
- ‘గీతా’వతరణ….
యాభయ్ ఏళ్లు దాటుతున్నాయి. సంపాదించింది చాలు. చాలకపోయినా గుళ్లో పురాణ పఠనంతో కాలక్షేపం చేద్దాం. మనకన్నా తక్కువ డబ్బున్నవాళ్లు బతకడంలేదా?
అని సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఆత్మసంతృప్తి
వైరాగ్యంతో నిర్ణయం తీసుకుని చాలా పాటల అవకాశాలు వదులుకున్నారు. తాను పాడవలసినవి వర్ధమాన గళంలో రావడాన్ని ఆశీర్వదించారు.బతుకు తెరువు కోసం సుమారు మూడు దశాబ్దాల పాటు చలన చిత్ర నేపథ్య గాయకుడిగా కొనసాగాను. కొత్త గాయకులు వస్తున్నారు, రావాలి. సాహిత్యమూ మారిపోతోంది. భగవద్గీత, రామదాసు కీర్తనలు, అష్టపదులు లాంటివి రికార్డు చేస్తూ కాలక్షేపం చేస్తా. అదీగాక జన్మ ఎత్తినందుకు చిరస్థాయిగా ఉండే ఏదో ఒకటి యాలి
అనే సంకల్పం కలిగింది. అదే భగవద్గీతావరణం
. కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులతో ‘గీతా’లాపనకు ఉపక్రమించారు. ఆరోగ్య సమస్య వచ్చినా లక్ష్య పెట్టకుండా భగవద్గీత శ్లోకాల ఎంపిక, వాటికి పండితులు కోట సత్యరంగయ్యశాస్త్రి గారితో తాత్పర్యాలు రాయించడంలో నిమగ్నమయ్యారు. నిష్ఠతోపాడారు. ఆరు నెలల తేడాతో భగవద్గీత
రికార్డులు రెండు భాగాలు పూర్తయ్యాయి.భగవద్గీత పాడిన నోటితో సినిమా పాటలు పాడను
అన్నారట. ఆ మాట దక్కించుకున్నట్లే పాటలు పాడడం అంటుంచి గీత
ను వినకుండానే (రికార్డులు విడుదల కాకుండానే) ఆ గాత్రం మూగవోయింది. గీతా
గానం కోసం ఆయన పడిన తపన, శ్రమ గురించి వారి అర్థాంగి సావిత్రమ్మ గారు అనేక సందర్భాలలో వివరించారు.
‘బతుకు పూలబాట కాదు…’
ఘంటసాల జీవితం పూలబాట కాదు. సంగీత విద్యార్జన కాలం నుంచి నేపథ్య గాయకుడిగా నిలదొక్కుకునేంత వరకు కష్టాలు-కన్నీళ్లు, ఈసడింపులు, అవమానాలు. అయినా ధైర్యం కోల్పోలేదు. అనుకున్నది సాధించా లనే తపన. పోయినచోటనే వెదకాలన్నట్లు కాదన్న వారి నోటితోనే ఔననిపించు కోవాలనే పట్టుదల.ఏదీ తనంత తానై నీ దరికి రాదు/శోధించి సాధించాలి అదియే ధీరం గుణం
అని అనంతర కాలంలో పాడుకున్నపంక్తులను ఆచరణలో చూపారు.నేను ఒక్కడినే సినీ నేపథ్య రంగాన్ని ఏలాలి
అని ఎన్నడూ అనుకోలేదు. మీరే పాటలన్నీ పాడాలన్న నిర్మాతలతో అన్నీ నేనే పాడితే బాగుండదు బాబూ!
అని నచ్చచెప్పి, నాయకుడికి తాను పాడినా మిగిలిన పాత్రలకు ఇతరులతో పాడించిన సందర్భాలు ఎన్నెన్నో.ఇతర సంగీత దర్శకుల సినిమాల సంగతి ఎలా ఉన్నా తన సంగీత దర్శకత్వంలో మాత్రం ఇతరులతో పాడించారు..తమిళ, కన్నడ చిత్రాలలో తాను పాడడం వల్ల ఆయా భాషా గాయకులకు అవకాశాలు తగ్గుతాయన్న భావనతో వాటికి పాడనని ప్రతినబూనారని చెబుతారు
ఎదిగిన కొద్దీ….
తానేమిటో, తన గాత్రధర్మం ఏమిటో ఎరిగిన వారు. వృత్తిపరంగా నేల విడిచి సాము చేయలేదు. తాను నేర్చుకున్నది శాస్త్రీయ సంగీతమే అయినా, చలనచిత్ర నేపథ్య గాయకుడిగా (లలితసంగీతం) స్థిరపడ్డారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సహా ప్రముఖ విద్వాంసుల సంగీతాన్ని ఆస్వాదించడమే తప్ప వాటి జోలికి పోలేదు. ఆయనతో త్యాగరాజు కీర్తనలు పాడించాలని చాలామంది విఫలయత్నం చేశారట. ఆయన పాడలేక కాదు. `కీర్తనలు పాడేందుకు నెల, రెండు నెలల పాటు సాధన చేయాలి. గొంతు ఆ సంగీతానికి అలవాటు పడితే లలితసంగీతం పాడడం కష్టం. దాని వల్ల తనకు అర్థికంగా కలిగే నష్టం కంటే నిర్మాతలకు కలిగే నష్టం ఎక్కువ‘ అనేవారని చెప్పారు శ్రీమతి ఘంటసాల సావిత్రమ్మ గారు. ఇంతటి అపురూప, అపూర్వ గాత్రం తెలుగువారికి దక్కడం వెనుక ఆయన గురువు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి సలహా ప్రధానమైనదని చెప్పుకునేవారు ఘంటసాల. వయోలిన్ నేర్చుకోవాలనుకున్న ఘంటసాల వారి కంఠస్వరం విన్న ద్వారం వారు గాత్ర విద్యాభ్యాసం వైపు మళ్లించారు. లేకపోతే వయోలిన్ కళాకారుడుగా పేరు పొందేవారేమో….!
వినయ సంపన్నత
ఎంతటి విద్యావంతుడు, విద్వాసుండైన వినయశీలి కాకపోతే రాణించడని ఆర్యోక్తి. విద్య వినయాన్ని ఇస్తుందన్న మాట ఘంటసాల వారి విషయంలో అక్షరసత్యం. ధిషణహంకారానికి బహుదూరం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటే తత్వం. చదువుకునే రోజల్లో ఆదరించి ఆకలి తీర్చిన వారెవ్వరిని మరువలేదు. ఉదాహరణకు, విజయ నగరంలో చదువుల రోజుల్లో ఆదుకున్న కళాకారిణి సరిదె లక్ష్మీనరసమ్మ (కళావర్ రింగ్) కాలం చేసిన కొన్నేళ్లకు ఆ ఊరు వెళ్లిన ఘంటసాల ఆ ఇంటిని సందర్శించి నమస్కరించి, భోరుమంటూ గుమ్మం మీద కూలబడి పోయారట. భక్తి విశ్వాసాలంటే అవి అన్నారు ఒక సందర్భంలో రావి కొండలరావు.లవకుశ‘లో వాల్మీకి పాత్రధారి నాగయ్య గారికి పాడవలసి వచ్చినప్పుడు వణికిపోయారట. వారి సంగీత దర్శకత్వంలో
గుంపులో గోవిందలా గొంతు కలిపిన నేనేమిటి? ఆయనకు గాత్రమివ్వడం ఏమిటి?ఎంతటి అపచారం?‘ అని మధనపడి చివరికి నాగయ్య గారి అనునయం, ప్రోత్సాహం మేరకు పాడక తప్పలేదు.
ఎలా పాడాలో నాగయ్య దగ్గర నేర్చుకున్నానుఅని వినయంగా చెప్పేవారు ఘంటసాల.
ప్రభుత్వ పరంగా పద్మశ్రీకే పరిమితమైనా ప్రజా హృదయాల్లో ఏ గాయకుడి దక్కనంత అపూర్వ గౌరవం. జయంతి, వర్ధంతి ఉత్సవాలు. వాగ్గేయకారుల్లో త్యాగయ్య, అన్నమయ్య తర్వాత ఆ స్థాయిలో ఆరాధ నోత్సవాలు అందుకుంటున్న లలితసంగీత చక్రవర్తి.
తాము రాసిన గీతాల్లో ఒక్కటైనా ఆయన పాడితే బాగుండుననుకున్న కవులెందరో. పాత్రికేయుడిగా, వర్ధమాన కవిగా ఘంటసాల గారితో సన్నిహితత్వం ఉన్నా నా ఒక్క గీతం కూడా ఆయన కంఠం నుంచి జాలువారని దురదృష్టవంతుడిని
అని దివంగత వేటూరి సుందరరామమూర్తి అనేవారు. ఘంటసాల వారు ఉత్తర భారతదేశంలో పుట్టక పోవడం అక్కడి శ్రోతల దురదృష్టం. నాలాంటి గాయకుల అదృష్టం
అని ప్రఖ్యాత గాయకుడు మహ్మద్ రఫీ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య చాలు ఆయనకంఠ
మాధుర్యం, ఔన్నత్యానికి.
అమరగాత్రానికి అపచారం…?
ఉత్కృష్టమైన గీతను సరళభాషలో మధురగానంతో ఈ జాతికి అందించారు ఘంటసాల. కానీ జీవనగీత
వరస మారుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఆలయాలలో కంటే అంతిమయాత్రలలో ఇది ఎక్కువగా వినిపించడం శోచనీయం. ఆయన గానం చేసిన గీత
విన్నవెంటనే ఆయా ప్రదేశాలలో శవ జాగరణో, శవయాత్రో
అనే సంకేతాలు ఇచ్చే స్థితికి తీసుకురావడం చాలా మందిని బాధించే అంశం. భగవద్గీతకు, అంతిమయాత్రలో దానిని వాడడానికి సంబంధం ఏమిటో బోధ పడదు.
విద్యావంతుల నుంచి సామాన్యుల వరకు ఇదే వైఖరి. మృతి చెందిన వ్యక్తి (సజీవంగా ఉన్నప్పుడు) ఆస్తికుడా? నాస్తికుడా? అనే దానితో నిమిత్తం లేదు. ఒకవంక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా మన్ననలు అందుకుంటూ, మనిషి మనీషి
గా ఎలా మారాలో చెప్పే జ్ఞానగీత
ఇలా జాగరణ గీత
గా మారడం బాధించే అంశం. ఈ తీరు మారాలి.ఇది శోభ
గీత కానీ శోక
గీత కాదు,కారాదనే భావన కలిగినప్పడు, కల్పించగలిగినప్పుడే గీత
కు గౌరవం, అమరగాయకుడికి అసలైన నివాళి. (వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)