కేసీఆర్ దార్శనికతతో పండుగైన వ్యవసాయం
రాష్ట్రానికి దేశం నలుమూలలనుంచి రైతన్నలు
హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్రంలో దండుగన్న వ్యవసాయం సీఎం కేసీఆర్ దార్శనికతతో అనతికాలంలోనే పండుగైన నేపథ్యంలో.. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, రైతు సంక్షేమ పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ట్రాల రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి రోజు రోజుకూ పెరుగుతున్నది.
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణను అమలు పరుస్తున్న తెలంగాణ రాష్ట్రం వైపు రైతు ప్రపంచం ఆశ్చర్యంతో చూస్తున్నది. రైతుబంధు ద్వారా పంటసాయం, రైతు కుటుంబాల్లో భరోసాను నింపే రైతు బీమాతో పాటు, 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు పుష్కలమైన నీరందించడంతోపాటు, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయం పట్ల దేశ రైతాంగం ఆసక్తిని కనబరుస్తున్నది.
రైతు బాంధవుడు కేసీఆర్
ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. వారు క్షేత్ర స్థాయి పర్యటనకు బయలు దేరే ముందు మీడియా తో మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా అమలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించడానికి మేం తెలంగాణకు వచ్చామని తెలిపారు. ఈ పరిశీలన ద్వారా మా రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అమలుచేస్తున్న రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి విధానాల అమలుకు తమ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి మాకూ ఉంటే బాగుండేదన్నారు. నష్టాలు లేకుండా తెలంగాణా రైతులు వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా కొనసాగించడం మాకెంతో ఆశ్చర్యం అనిపించిందన్నారు.
రైతు చరిత్రలో గొప్ప పరిణామం
ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైతు నాయకుడు హిమాంశ్ మాట్లాడుతూ … సీఎం కేసీఆర్ ఎకరానికి 10 వేల రూపాయల రైతుబంధు సాయం, 5 లక్షల రూపాయల రైతు బీమా సాయం అందించడం దేశ రైతు చరిత్రలోనే గొప్ప పరిణామమన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన కిసాన్ ఆందోళనలో పాల్గొని అమరులైన రైతులకు, సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు.. దేశానికే రైతు బాంధవుడు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, కర్ణాటక తదితర 25 రాష్ట్రాలకు చెందిన రైతులు దాదాపు 100 మంది పాల్గొన్నారు. వారు తెలంగాణ వ్యవసాయం, సాగునీటి రంగ అభివృద్ధినీ పరిశీలించేందుకు, క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.