సుపరిపాలన రంగంలో దేశానికే ఆదర్శం
తెలంగాణ పోలీసు కీర్తికిరీటంలో కలికితురాయి
హైదరాబాద్, ఆగస్ట్ 4: శాంతి భద్రతలతో పాటు, అన్ని ప్రభుత్వ శాఖల సమాచార సమన్వయానికి, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఫ్యూజన్ కేంద్రం)’ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రారంభించారు. దేశంతో పాటు ప్రపంచం లోనే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా, సుపరిపాలనారంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ అందించిన బహుమతిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిలిచింది. ‘తెలంగాణ రక్షణ కేంద్రం’గా ‘తెలంగాణ శాంతి భద్రతల సౌధం’గా తెలంగాణ పరిపాలనా సమన్వయ కేంద్రం ’ గా రాష్ట్ర పాలనా వ్యవస్థకు మకుటాయమానమై, తెలంగాణ పోలీసుల కీర్తి కిరీటంలో కలికి తురాయిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిలుస్తుంది.
బైక్ ర్యాలీతో పోలీసుల స్వాగతం
కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు సిసిసి సమీపంలోని జగన్నాథ టెంపుల్ వద్ద మౌంటెడ్ ప్లాటూన్ పోలీసులు స్వాగతం పలికి బైక్ ర్యాలీతో తోడ్కొని వెళ్లారు. సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని వ్యూ పాయింట్ నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ తూర్పు ముఖ ద్వారం వద్ద ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుమ్మడికాయ కొట్టగా, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనం లోపలికి ప్రవేశించారు. సీఎం కేసీఆర్ కొబ్బరికాయ కొట్టి, కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ త్రీడీ గ్లాస్ మోడల్‌ను సీఎం పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏ – టవర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 18వ అంతస్థులోని పోలీస్ కమిషనర్ చాంబర్‌లో సీఎం కేసీఆర్ చండికా దుర్గా పరమేశ్వరి పూజలు చేశారు. హైదరాబాద్ కమిషనర్‌ను ఆయన సీటులో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
హైదరాబాద్ పోలీస్ చరిత్రపై ప్రదర్శన
1847 నుంచి నేటి వరకు హైదరాబాద్ పోలీస్ చరిత్రను తెలియజేసేలా 14వ ఫ్లోరులో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం కెసిఆర్ తిలకించారు. అనంతరం, కమాండ్ కంట్రోల్ సెంటర్ 7వ ఫ్లోరులో ఉన్న సీఎం చాంబర్‌లో కొద్దిసేపు ముఖ్యమంత్రి కేసీఆర్ గడిపారు. కమాండ్ కంట్రోల్ హాల్ లోకి ప్రవేశించారు. పోలీసు అధికారులు, పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం కోసం ఏర్పాటు చేసిన మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీ టీవీ మానిటరింగ్, వార్ రూం వంటి వ్యవస్థల గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన లక్షలాది సిసి కెమెరాల అనుసంధానం, ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే గుర్తించే అంశాలను సిఎం కు వివరించారు. నేరాలు జరిగినప్పుడే కాకుండా నేరాలు జరిగేందుకు దోహదం చేసే పరిస్థితులను ముందుస్తుగానే ఎట్లా అంచనావేస్తారో అందుకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఎట్లా ఉపయోగిస్తారోననే విషయాలను సిఎం కెసిఆర్ గారికి అధికారులు సోదాహరణంగా వివరించారు. తద్వారా ప్రమాదాల నివారణ, నేరాలను అరికట్టడం ఎంతగా సులవవుతుందో ఈ క్రమంలో పలు శాఖలతో ఏకకాలంలో ఎట్లా సమన్వయం చేసుకోగలమో వివరించారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ప్రభుత్వంలోని మున్సిపల్ ఆర్ అండ్ బి రూరల్ , అగ్రికల్చర్ తదితర శాఖలకు చెందిన సమాచారాన్ని అవసరం మేరకు ఎట్లా సమన్వయం చేసుకోని ఇచ్చిపుచ్చుకోవచ్చునో అధికారులు సిఎం కెసిఆర్‌కు సోదాహరణంగా వివరించారు.
అడిగి మరీ పరిశీలన
జాతీయ రహదారులపై పరిస్థితి ఎలా ఉంది? చూపించండి ’ అని సీఎం కేసీఆర్ అడగడంతో, వెంటనే పోలీసు అధికారులు ఆయా ప్రదేశాల్లోని పరిస్థితులను కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే వారికి చూపించి విశ్లేషించారు. ఐఎఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ సహా మాజీ పోలీసు ఉన్నతాధికారులు, పలు శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆహుతులతో నిండి వున్న ఆడిటోరియానికి సిఎం కెసిఆర్ చేరుకున్నారు.
సెంటర్ ప్రత్యేకతలపై ప్రదర్శన
తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణపై రాష్ట్ర పోలీసింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలపై పోలీస్ శాఖ రూపొందించిన వీడియో చిత్రాల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన లఘుచిత్రాల ద్వారా.. శాంతి భధ్రతల పరిరక్షణకోసం రాష్ట్ర ఆవిర్భావం నుంచి సిఎం కెసిఆర్ గారి దార్శనికత తీసుకున్న నిర్ణయాలు వాటి అమలుతో పాటు పోలీసు శాఖకు ఉద్యోగులకు సిఎం కెసిఆర్ అందిస్తున్న సహకారం గురించి గొప్పగా చిత్రీకరించారు. కమాండ్ కంట్రోల్ గురించి., రాష్ట్రంలో శాంతి భధ్రతల రక్షణలో పోలీసు శాఖ పనితీరు, సిఎం కెసిఆర్ సహకారం గురించి డిజిపి మహేందర్ రెడ్డి రూపొందించి ప్రదర్శించిన లఘుచిత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను అమితంగా ఆకట్టుకున్నాయి. అడగడుగునా వారి నుంచి కరతాళ ధ్వనులు మారుమోగాయి.
లఘు చిత్రాల ప్రదర్శన అనంతరం.. సిఎం కెసిఆర్ ముఖ్య అతిధిగా సభ ప్రారంభమైంది. హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన సభ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ లు ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రసంగం అనంతరం… కమాండ్ కంట్రోల్ సెంటర్ బ్రోచర్ ను సీఎం కేసీఆర్ గారు ఆవిష్కరించారు. అనంతరం కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణంలో పనిచేసిన అధికారులను, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థ ప్రతినిధులను సన్మానించిన ముఖ్యమంత్రి వారికి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పోలీసు ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నమూనాను జ్ఞాపికగా అందజేశారు.
ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట… మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్. మల్లారెడ్డి, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్సీలు పీవీ వాణీదేవి, సిరికొండ మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నవీన్ రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బేతి సుభాష్ రెడ్డి, గణేష్ గుప్తా, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, రవీంద్రనాయక్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, ఫీర్జాదీగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.