భార‌త్‌కు ర‌త్నం పింగళి వెంకయ్య

Date:

నేడు 146వ జ‌యంతి
జాతీయ జెండా రూప‌క‌ర్త‌కు జ‌య‌హో
(అద్బుతంగా నివాళి అర్పించిన ర‌చ‌యిత‌కు కృత‌జ్ఞ‌త‌లు)
భారత్ కు రత్నం లాంటి మనిషి జీవితాన్ని ఒకసారి మననం చేసుకుందాం.
ఆ ఊరిపేరు నడిగూడెం సూర్యపేటనుంచి 30 కిలోమీటర్లు వుండొచ్చు, ఇప్పుడంటే సూర్యపేట జిల్లాలో వుంది కానీ 1956 నవంబరు 1 కి ముందు కృష్ణాజిల్లాలో భాగంగా వుండేది. ఆ నడిగూడెంలో ఒక ప్రముఖ పరగణా మునగాల. లచ్చమ్మారావు, దేశముఖు నాయని వెంకటరామయ్య దంపతులకు దత్తపుత్రుడు జమీందారు రాజా బహదూర్ నాయని రంగారావు గారికి 1906లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో పింగళి వెంకయ్యగారితో పరిచయం ఏర్పడింది. రాజావారి కోరిక మేరకు పింగళి వెంకయ్య గారు మునగాల పరగణాకు ఆహ్వానించబడ్డారు. పైగా అక్కడ కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు దీవాన్ గా పనిచేస్తున్నారాయే. పింగళి వారికి నడిగూడెంలోనే నివాసం ఏర్పాటు చేసారు, పత్తిపై ఒక పరిశోధనా క్షేత్రాన్ని స్థాపించారక్కడ. పేరుకు రాజాగారే కానీ వెంకయ్యగారికంటే పదమూడేళ్ళు వయసులో చిన్ని, పైగా ఈయనంటే ఒక అభిమానం చాలా గౌరవంగా చూసుకునేవారు. 1906 నుంచి 1911 వరకు వెంకయ్య కేవలం పత్తి పంట మీద పరిశోధనలు చేశారు. అప్పుడే ఆయనకు ‘పత్తి వెంకయ్య’ అన్న బిరుదు వచ్చేసింది.
బోయ‌ర్ యుద్దంలో పాల్గొన్న అనుభ‌వం
ముప్పయ్యేళ్ల యువకుడు మన పింగళి వెంకయ్య కానీ అప్పటికే పదేళ్ళ క్రితమే బోయర్ యుద్దంలో పాల్గొన్న అనుభవంతో పాటు తిరుగుప్రయాణంలో అరేబియా, ఆప్ఘనిస్థాన్ లను చూసుకుంటూ వచ్చిన ముచ్చట్లు అక్కడి మిత్రులతో రైతులతో చెప్తుండేవారు. 19 ఏళ్ళ వయసుకే తను పాల్గొన్న బోయర్ యుద్దం గురించి చెపుతూ దేశీయ సంపదను దోచుకునే వాళ్ళు ఎన్ని కల్లబొల్లి కబుర్లయినా చేపుతారు. మనం వాటిని సృష్టించుకోవడం ఎంత అవసరమో కాపాడుకోవడమూ అంతే అవసరం అంటారాయన.
బోయర్ యుద్దం గురించి చెప్పాలంటే కెజియఫ్ స్టోరీకన్నా పెద్ద బంగారు గనుల కథ చెప్పాలి వాటికోసం దేశాల మధ్య కుమ్ములటను అర్ధం చేసుకోవాలి. 1886లో విట్ వాటర్సాండ్ లో దాదాపు పదిహేడు వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విశాలమైన బంగారు నిక్షేపాలున్న ప్రాంతాన్ని కనుగొన్నారు. బంగారం అంటే మట్టిని జల్లించుకంటూ సేకరించుకోవడమే దీనిమీద ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ డిగ్గర్స్ ఎగబడ్డారు. అక్టోబరు 11, 1899 నుండి మే 31, 1902 వరకు రెండవ సారి బోయర్ యుద్దం జరిగింది. ఇంతకీ బోయర్ లు అంటే దక్షిణ ఆఫ్రికాలోని డచ్ నివాసితులు అన్నమాట, 1899 లో, బ్రిటీష్ మరియు బోయర్స్ మధ్య వివాదం మూడు దశల్లో జరిగింది. యుద్ధం యొక్క మొదటి దశ బోయర్స్ బ్రిటీష్ దళాలపై పైచేయి అయ్యింది , కాని తరువాతి రెండు దశలు బ్రిటీష్ వారే ఆదిపత్యం చూపారు. సరే అదంతా పక్కన పెడితే సహజ సంపదలను వినియోగించుకోవడం ద్వారా దేశాభివృద్ధి జరుగుతుంది అనే పాయింటు ప్రధానమైనది. భారతదేశం విషయానికి వస్తే మనది సమశీతోష్ణ మండలం మొక్కల పెరుగుదలకు అత్యద్భుత ప్రాంతం మందు మొక్కలు మషాలా దినుసుల కోసం ఇండియాపై ఎన్నిదేశాలు ఆతృతగా వచ్చేవో మనకు చరిత్ర చెపుతుంది. మనదేశంలో రాతి నిల్వలు, ఖనిజ సంపద కూడా అపారంగా వుంది. ప్రపంచంలోనే అతిపెద్ద అతి గొప్ప వజ్రాలు దొరికింది మనదగ్గరినుంచే. వెంకయ్య గారు బహుశా యుద్దం సందర్బంలో ఏమోం గమనించారో కానీ, మద్రాసు రైల్వే గార్డు ఉద్యోగమో, బళ్లారి లో చేసిన ప్లేగు అధికారి ఉద్యోగమో ఆయన మనసుకు తృప్తినిచ్చినట్లు లేవు. అంతకు మించిన పనేదో చెయ్యాలి అనుకుంటున్న సమయంలోనే విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమ వీచికలు పింగళి వెంకయ్య గారిలో మరింత లోతు ఆలోచనలను రేకెత్తించాయి.
ప‌త్తిపై ప‌రిశోధ‌న చేసిన వెంక‌య్య‌
విదేశీ వస్తువులను బహిష్కరించడంతో పాటు స్వదేశీ సంపదను మరింత పటిష్టపరచుకోవాలి కదా అనుకున్నారు. వ్యవసాయ ప్రధాన దేశంలో ఆర్దికంగా లాభం ఇవ్వగల పద్దతులపై పరిశోధనలు జరగాల్సి వుంది. వెంకయ్య గారు అదే మొదలేసారు. పత్తిపంట నూలు వడకడమే కాక నీలిమందు అద్దకంలోనూ ప్రముఖపాత్ర వహించిన నాగులవంచ వంటి ప్రాంతాలిక్కడివే కదా. గాంధి స్వదేశీ అంటే ప్రదానంగా నూలు వడకడాన్ని సింబాలిక్ గా తీసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్న రోజులు, అందుకు ఊతంగా పత్తిలో రైతులు ఎదుర్కొనే కష్టాలకు నివారణ కనుక్కోవాలనుకున్నారు. కంబోడియా నుంచి మేలు రకం పత్తి విత్తనాలను తెప్పించి స్వదేశీ రకాలతో సంకరం చేసి వచ్చిన కొత్త విత్తన రకాల ఉత్పత్తి ఎలావుంది చీడపీడలనుంచి తట్టుకునే గుణం ఎలా మెరుగుపడింది వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశోధించారు. మెరుగైన ఫలితాలను సాధించారు. అందులోని నాణ్యతని గుర్తించిన ది రాయల్‌ అగ్రికల్చరల్‌ సొసైటీ (లండన్‌) ఆయనను ఫెలోషిప్‌తో గౌరవించింది.
జియాల‌జీ ప‌ట్ట‌భ‌ద్రుడు..వ‌జ్రాల త‌వ్వ‌కాల్లో రికార్డు
పత్తి పంట పై పరిశోధనలతోనే ఆపకుండా మన ప్రాంతపు మరో ముఖ్యమైన అపురూప ఆదాయ వనరు ఎక్కువగా బ్లాక్ మార్కెట్ లోకే కానీ దేశసంపదలోకి చేరని వజ్రాల ఉనికిపైన తీవ్ర పరిశోధనలు చేసారు. జియాలజీలో పట్టభద్రుడైన ఆయన మన ప్రాంతపు వజ్రాల తవ్వకాలలో రికార్డు సృష్టించారు. నవరత్నాల మీద అనేక పరిశోధక వ్యాసాలు రాశారు. ఈ విషయంలో ఆయన భారత ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేశారు. జాతిరత్నాలు, వాటిని పోలి ఉండే రాళ్లు దేశంలో చాలా చోట్ల దొరుకుతాయని ఆయన చెప్పేవారు. రాయల వారి కాలంలో రత్నాలు, వజ్రాలు అంగళ్లలో పోసి అమ్మెవారని చదవుకున్నాం. పోర్చుగీసు, డచ్, ఈస్టిండియకంపెనీ వంటి విదేశీయులెందరో మనదేశంనుంచి వజ్రాలను తరలించిన సంగతులు చదువుకున్నాం, ఇప్పటికీ జొన్నగిరి, కొల్లూరు వంటి ప్రాంతాలలోని పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయన్న వార్తలూ చదువుతున్నాం. కానీ నేటి ఆత్యాధునిక పరికరాలు పరిజ్ఞానం సహాయంతో వాటి ఉనికిని దేశసంపదగా మార్చే ప్రయత్నాలు ఎంతవరకూ చేయగలుగుతున్నాం. కర్పన రూపాంతరాలైన బొగ్గు గ్రాఫైట్ వజ్రం నిల్వలు ఏర్పడటానికి అవకాశం వున్న నేలలపై కింబర్టైట్ ట్యూబ్స్ వున్న కొన్ని జిల్లాలలోనూ, కోరండం నిల్వలు హెచ్చగా వున్న ప్రాంతాలలోనూ ప్రజలకు ప్రభుత్వానికి ఆదాయం చేరే పద్దతులు ఎన్నిఅనుసరిస్తున్నాం అనేది ఇంకా సరిచూసుకోవలసిన అంశమే అనిపిస్తుంది. 1924 నుండి 1944 వరకు నెల్లూరు ప్రాంతంలో ఉంటూ మైకా (అభ్రకం) గురించి పరిశోధన చేశాడాయన.
కొలంబో వెళ్లి సీనియర్‌ కేంబ్రిడ్జ్‌ పూర్తి చేసుకుని వచ్చారు. భూగర్భశాస్త్రం అంటే ఉన్న అపారమైన ప్రేమతో అదే అంశంలో ఆయన పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు డాక్టర్ వెంకయ్య. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు అంటే ఆయనకు 82 ఏళ్ల వయసు వచ్చే వరకూ పనిచేసారు. అంత విలువైన పదవిలో వుంటూ కూడా తనకుంటూ వెనకేసుకోక పోవడం ఒక కోణంలో ఆయన నిజాయితీ నిబద్దతలను చూపెడుతుంటే మరోవైపు నేటి కాలపు కొలతల ప్రకారం బ్రతకనేర్వని తనాన్నీ చూపెడుతోంది.
వెంక‌య్య గారి కుటుంబ చ‌రిత్ర ఇదీ…
వెంకయ్య గారిది పెద్ద కుటుంబమే ఈయనకు ఐదుగురు సోదరులు ఇద్దరు సోదరీ మణులు, వీరి తాతగారి పేరునే హనుమంతరాయుడు గారు ఈయనకు పెట్టారు. వెంకయ్య వారి సతీమణి రుక్మిణమ్మ గార్లకు ముగ్గురు సంతానం ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోనే కాక పదునైన రచనల జర్నలిస్టుగా పేరుపొందిన పరశురామయ్య (బార్య దమయంతి) పెద్దకుమారుడు వారికి అన్నపూర్ణ, నాగలక్ష్మి, భవాని మూడవతరం. ఇక సైన్యంలో చేరిన రెండవ కుమారుడు పింగళి హేరంబ చలపతి రావు(భార్య జానకి) దేశం కోసం చిన్న తనంలోనే ప్రాణాలను వదిలారు. చలపతిరావుగారబ్బాయే పింగళి దశరథ రామ్(సుశీల) పెద్దనాన్న గారి జర్నలిజం వారసత్వంగా తీసుకున్నట్లు ఎన్ కౌంటర్ పత్రికను నడిపింది ఈయనే. దశరథ రామ్ గారికి చైతన్య, అవినాష్, వెంకయ్యదశరథరామ్ అనే పిల్లలు పింగళి చైతన్య రచయిత్రిగా పేరు సంపాదించింది. ఈమె వ్రాసిన చిట్టగాంగ్ విప్లవ వనితలు అనే పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ నుండి 2016లో యువ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. వెంకయ్య గారి అమ్మాయి పేరు సీతామహాలక్ష్మి వీరిని ఘంటశాల ఉగ్రనరసింహం గారికిచ్చారు.
30 ర‌కాల జెండా న‌మూనాల స‌మ‌ర్ప‌ణ‌
1916లో ఆయన ఆంగ్లంలో రాసిన నేషనల్‌ ఫ్లాగ్‌ ఇన్‌ ఇండియా అనే గ్రంథానికి అప్పటి వైస్రాయ్‌ కార్యనిర్వాహక సభ్యుడు, కేంద్ర మంత్రి నరసింహేశ్వర శర్మ పీఠిక రాశారు. అందులో 30 రకాల జెండా నమూనాలను ప్రతిపాదించి అందరినీ మెప్పించాల్సి వచ్చింది. 1921లో విజయవాడలో కాంగ్రెస్ సదస్సులో ఆమోదం కూడా పొందారు. జలియన్‌వాలా బాగ్ దురంతానికి నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో 1923 ఏప్రిల్ 13న నాగ్‌పూర్‌లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తొలిసారిగా పింగళి జెండాను ఎగురవేశారు. 1921లో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ‘స్వరాజ్’ పతాకం గాను.. 1931లో ఆమోదించిన త్రివర్ణ పతాకాన్ని ‘పూర్ణ స్వరాజ్ పతాకం’గాను అంటుంటారు. చరఖా స్థానంలో బుద్ధుడి ధర్మ చక్రాన్ని చేర్చాలని రాజ్యాంగసభ చైర్మన్ డాక్టర్ అంబేడ్కర్ ప్రతిపాదించారు కానీ. ధర్మచక్రానికి బదులు అశోక చక్రాన్ని చేర్చాలన్న ప్రతిపాదన మీద రాజ్యాంగసభ సిఫారసు చేయడంతో నెహ్రుప్రభుత్వం సవరణ ఆమోదం తెలిపింది. త్రివర్ణ పతాకాన్ని 22 జూలై, 1948న జాతీయ పతాకంగా భారత జాతి స్వీకరించింది. ఇంకెవరో కూడా ఇటువంటి నమూనానే చేసారు. అంటూ మరేదో ఉదాహరణ చూపగానే పింగళి వెంకయ్యగారు కాదట అని హడావిడిగా అనేసే తెలుగు వాళ్ళ మధ్యన ఇంకా ఆయన అనామకంగానే మిగిలిపోయారు. ఆయన సమగ్ర చరిత్ర చాలినన్ని ఫోటోలు సైతం వెలుతురులోకి రాలేదు. ఆయన రాసిన పుస్తక ప్రతులైనా దొరుకుతాయో లేదో తెలియదు. జవసత్వాలుడిగిన ముసలి రూపాన్ని మాత్రమే ఊహించుకునే మనకు
బోయర్ యుద్దంలో పోరాడిన యోధుడు వెంకయ్య,
పట్టా పొందిన డాక్టర్ వెంకయ్య,
దేశపు హృదయంపై రెపరెపలాడే జెండా వెంకయ్య
కంబోడియా రకంపై పరిశోధనలు చేసిన పత్తి వెంకయ్య,
వజ్రాలపై అపారసమాచారం ఇచ్చిన డైమండ్ వెంకయ్య,
ఉద్యమ పోరాటాలకు ముందు దారి చూపిన దార్శనికుడు వెంకయ్య,
అపురూప విశేషాలు పంచిన రచయిత వెంకయ్య,
అనర్షల పాలీగ్లాట్ జపాన్ వెంకయ్య,
పెద్ద పదవుల్లో కూర్చున్నా తాటాకు ఇంటినే మిగుల్చుకున్న నిజాయితీ వెంకయ్యను మనం ఎప్పటికి చూడగలుగుతాం. రత్నం లాంటి ఈ మనిషిద్వారా భారత రత్నబిరుదుకు వన్నె ఎప్పుడు అద్దుతాం.
బెజ‌వాడ‌లో క‌న్నుమూత‌
దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణం పింగళి హనుమంతరాయుడు , వెంకటరత్నమ్మ లకు కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో జన్మించిన పింగళి వెంకయ్యగారు అనేక హోదాలు, అనేక దేశాలు, అనేక పరిస్థితులనూ చూసి చివరికి జూలై 4,1963లో బెజవాడలో ఒక తాటాకు ఇంట్లో కన్నుమూసే ముందు తన ఆఖరికోరికగా జాతీయ జెండాను తన పార్ధివదేహంపై కప్పాలని అంతిమ స్థలిచేరిన తర్వాత ఆ జెండాను అక్కడి రావిచెట్టుకు కట్టాలని కోరుకున్నారు. ఆయన ఆఖరికోరికే నేడు అసువులుబాసిన వీరులకు అత్యున్నత అంతిమ పురస్కరమై నిలచింది.
బిగ్ శెల్యూట్ వెంకయ్య గారూ ఇవి మా తరపున మీ జయంతి నివాళులు.🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...