ఆత్మకూరు-వెంకయ్య నాయుడు

Date:

ఉప ఎన్నిక పోలింగ్ శాతంపై వాద‌న‌లు
(శివ రాచ‌ర్ల‌)
ప్రపంచం బాధంతా శ్రీశ్రీది అయితే కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానిది అని సాహిత్య రంగంలో ఒక నానుడి.. ఇప్పుడు వెంకయ్య నాయుడి గారి బాధ మొత్తం తెలుగు జాతిది అని ఏబీన్ వెంకట కృష్ణ ప్రచారం చేస్తున్నారు.
వెంకయ్యనాయుడు గారికి రాష్ట్రపతి పదవి దక్కనందుకు సౌత్ ఇండియా భావన పెరుగుతుందని ఏబీఎన్ వెంకటకృష్ణ ఒక సూత్రీకరణ చేశారు. వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి పదవి ఇవ్వకపోవటం వలన తెలుగు ప్రజలు అందరూ తీవ్ర వేదనలో ఉన్నారట. సరే వెంకయ్యనాయుడు మీద చంద్రబాబు నాయుడు మీద ఆంధ్రజ్యోతికి, ఏబీఎన్‌కు ఉన్న అవ్యాజ ప్రేమ తెలిసిందే. అప్పట్లో అంటే వాజపేయి గారు ప్రధానిగా ఉన్నరోజుల్లో “ముగ్గురు నాయుడులు” అని ఇండియాటుడే వెంకయ్యనాయుడు (నాటి కేంద్ర మంత్రి), ఎర్రం నాయుడు(నాటి టీడీపీ లోక్ సభ పక్ష నాయకుడు), చంద్రబాబు నాయుడు (నాటి సీఎం ) ఆర్టికల్ వెంకటకృష్ణకు దొరికివుంటే మంచి స్టోరీ చేసేవారు.
ప్రత్యేక హోదా కోసం కష్టపడుతున్న తెలుగు తేజం, ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించిన తెలుగు నాయకుడు.. నేను రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి వెయ్యి కోట్ల నిధులు తీసుకొస్తున్నాను మీకు అవి వద్దా? ప్రత్యేక హోదా మాత్రమే కావాలా అని దబాయించిన వెంకయ్యనాయుడిగారికి 2014-2019 మధ్య మంచి మర్యాదలే జరిగాయి. విజయవాడలో రధం ఎక్కించి ఊరేగించి సన్మానం చేశారు. హోదా, ప్యాకేజి విషయాల్లో రాష్ట్రానికి వెంకయ్య నాయుడు చేసిన సహాయానికి 2017 నుండి 2019 వరకూ చేసిన సన్మానాల, కప్పిన శాలువాల ఖర్చు సుమారు 63 లక్షలు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది . రేపు ఉప రాష్ట్రపతి పదవి ముగిసిన తరువాత విజయవాడ వచ్చిన తొలిసారి కూడా ఇలాంటి సన్మానాలే జరుగుతాయి. వెంకయ్య నాయుడు మీద ఆంధ్ర‌ బీజేపీ వాళ్లకు ఎందుకు ప్రేమలేదో టీడీపీ వాళ్లకు ఎందుకు ప్రేమనే విషయం 1995 నుంచి రాజకీయాలు చూస్తున్న వారందరికి ముఖ్యంగా 1998 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా వచ్చిన 18% ఓట్లు ఏవిధంగా టీడీపీ ఒడిలో కరిగిపోయాయి తెలుసు.
సరే వెంకయ్యనాయుడి గారిని రాజకీయంగా సొంతపార్టీ నేతలతో సహా చాలా మంది విబేధించినా ఆయన రాజకీయాల్లో ఆజాతశత్రువు. పార్టీలకు అతీతంగా ఆయన స్నేహాలు ఉంటాయి. రాజకీయ విమర్శలే కానీ వ్యక్తిగత విమర్శలు ఉండవు.
ఆత్మకూరు-వెంకయ్యనాయుడు
ఆత్మకూరు ఉప ఎన్నికలకు వెంకయ్యనాయుడికి ఏమి సంబంధం అని అనుమానం రావొచ్చు. వెంకయ్యనాయుడు ఎప్పుడైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారా? అని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటాయి.
ఏబీవీపీ నాయకుడిగా విద్యార్థి జీవితం మొదలుపెట్టిన వెంకయ్యనాయుడు ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో నాయకుడిగా ఎదిగాడు. అప్పట్లో వెంకయ్యనాయుడు, మాజీ మంత్రి మాదాల జానకిరామ్ కలిసి “ఆంధ్రాసేన” అని ఒక సంఘాన్ని కూడా నడిపారు. 1978 ఎన్నికల్లో వెంకయ్యనాయుడు జనతాపార్టీ తరపున, మాదాల జానకిరామ్ ఇందిరా కాంగ్రెస్ తరపున ఉదయగిరి నుంచి పోటీచేశారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, కమ్మ సామాజికవర్గంలో బలమైన నేత ధనేకుల నర్సింహం సహాయంతో వెంకయ్యనాయుడు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
1983 ఎన్నికల్లో టీడీపీకి మ‌నేకాగాంధీ నాయకత్వంలోని సంజయ్ విచార్ మంచ్‌తో మాత్రమే పొత్తు. అది కూడా 5 స్థానాల్లో. గోనె ప్రకాశ రావు, కటకం మృతుంజయం కరీం నగర్ జిల్లా నుంచి గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి బీజేపీకి ఎలాంటి పొత్తు లేదు కానీ ఉదయగిరిలో బీజేపీ తరపున పోటీచేసిన వెంకయ్యనాయుడికి టీడీపీ మద్దతు ఇచ్చింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ తరుపున పోటీచేయగా వెంకయ్య నాయుడు 20 వేల మెజారిటీతో గెలిచారు.. ఆ ఎన్నికలు మేకపాటికి తొలి పరాజయం, వెంకయ్యకు చివరి గెలుపు.


1985 ఆత్మకూర్ లో పోటీ
నాదెండ్ల ఎపిసోడ్‌లో కమ్యూనిస్టులు, బీజేపీ ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలవటంతో ఆ పార్టీల మధ్య 1985 ఎన్నికల్లో పొత్తు పొడిచింది. ఎన్టీఆర్ కుడి చేతితో బీజేపీ ఎడమ చేతితో కమ్యూనిస్టులతో ఏకకాలంలో పొత్తుపెట్టుకున్నారు. కమ్యూనిస్టులు మాకు బీజేపీతో ప్రత్యక్ష పొత్తు లేదు అని చెప్పుకొన్నారు..
1983లో మూడు స్థానాలు గెలిచిన బీజేపీ 1985లో టీడీపీ పొత్తుతో పది స్థానాల్లో పోటీచేసి 8 స్థానాల్లో గెలిచింది. అన్నీ తెలంగాణ నుంచే. వెంకయ్య నాయుడు పొత్తులో భాగంగా ఉదయగిరి నుంచి ఆత్మకూరుకు మారి కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి చేతిలో 830 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. వెంకయ్యనాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన చివరి ఎన్నికలు అవే.
వెంకయ్యనాయుడు 1989 లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బాపట్ల నుంచి పోటీచేసి 40వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అద్వానీ రథయాత్ర, బాబ్రీ సంఘటనతో దేశవ్యాప్తంగా బీజేపీ స్వయంగా ఎదగాలన్న ఆలోచనలో భాగంగా 1994 నాటికి బీజేపీ టీడీపీతో పొత్తు తెంచుకుంది.
వెంకయ్యనాయుడు 1996 ఎన్నికల్లో హైద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.. వెంకయ్య నాయుడు హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేయటానికి ప్రధాన కారణం 1991 ఎన్నికల్లో బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డి సలాఉద్దీన్ ఒవైసీ మీద కేవలం 40వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వెంకయ్య నాయుడు జాతీయ నేత కచ్చితంగా గెలుస్తాడని హైదరాబాద్ బరిలో దిగారు కానీ 73 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్ధి సుధీర్ కుమార్‌ను మూడవ స్థానానికి నెట్టి వెంకయ్య రెండవ స్థానంలో నిలవటం మాత్రం తృప్తిని ఇచ్చి ఉండొచ్చు. 1996 ఎన్నికల తరువాత వెంకయ్య నాయుడు పూర్తి కాలం ఢిల్లీ రాజకీయాలకు పరిమితం అయ్యారు.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ రాజ్యసభ కు ఎన్నికయ్యారు.
మొన్నటి ఉప ఎన్నికలు
వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి పదవి రాకపోవటం మీద బాధ‌ పడ్డ ఆంధ్రజ్యోతి ఆత్మకూర్ ఉప ఎన్నిక మీద “వైసీపీ పై మొహం మొత్తిందా ” అని పోలింగ్ శాతం తగ్గటానికి ప్రభుత్వం మీద ఆగ్రహమేనని బ్యానర్ ఐటెం రాసింది.
రాజకీయాలు ఫాలో అయ్యేవారికి ఉప ఎన్నికల తీరు అదీ కూడా ప్రధాన ప్రతిపక్షం పోటీచేయని సందర్భంలో పోలింగ్ శాతం తగ్గటం కానీ మెజారిటీ పెరగటం గురించి అవగాహన ఉంటుంది. మరీ పాత లెక్కలోకి వెళ్లకపోయినా గత అక్టోబర్ లో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో 68.12% మాత్రమే పోలింగ్ జరిగింది. 2019లో 77.64% పోలింగ్ జరిగింది అంటే దాదాపు 5% పోలింగ్ తగ్గింది వైసీపీ మెజారిటీ మాత్రం 2019లో 44734 వస్తే 2021 అక్టోబర్ ఉప ఎన్నికల్లో 90089 మెజారిటీ వచ్చింది.
ఆత్మకూర్ ఉప ఎన్నికలో కూడా ఇదే జరిగింది.. 2019లో 82.44% పోలింగ్ 22,276 మెజారిటీ రాగా మొన్న 23న జరిగిన ఉప ఎన్నికల్లో 64.14% పోలింగ్ జరిగింది. బద్వేల్ ఉప ఎన్నికలో లాగానే ఇక్కడ కూడా 85 వేలకు అటు ఇటుగా మెజారిటీ రావొచ్చు.
పోలింగ్ శాతం ఎందుకు తగ్గింది?
ఆత్మకూర్ నియోజకవర్గంలో మొదటి నుంచి రెడ్డి కమ్మ కులాలు గట్టిగా తలపడుతున్నాయి. రెడ్డి కుల ఓట్లు 37 వేలు ఉంటే కమ్మ ఓట్లు 23 వేలు ఉన్నాయి. ముస్లిం 30 వేలు, యాదవ 17 వేలు, యస్సి 40 వేల ఓట్లు ఉన్నాయి.
టీడీపీలో ప్రధానంగా మూడు వర్గాలు
2019లో ఓడిపోయిన బొల్లినేని కృష్ణయ్య, 2014లో ఓడిపోయిన కన్నబాబు, మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర వర్గం, ఈ వర్గాలకు సంబంధం లేకుండా టీడీపీ హార్డ్ కోర్ .. వీటిలో టీడీపీ హార్డ్ కోర్ ఎన్నికలకు దూరంగా ఉంది.. కన్న బాబు వర్గం కొన్ని ఓట్లు BSP ,కొన్ని ఓట్లు నోటా మరికొన్ని ఓట్లు బీజేపీకి వేశారు.. కృష్ణయ్య వర్గం మాత్రం ఉమ్మడి నిర్ణయం తీసుకోకుండా ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు ఓటు వేశారు. ఇండిపెండెంట్ గా బరిలో టీడీపీ ఎంపీటీసీ శశిధర్ రెడ్డికి బొమ్మిరెడ్డి మరియు కృష్ణయ్య వర్గం ఓట్లు కొన్ని పడ్డాయి..
బద్వేల్ లో బీజేపీకి పడ్డ ఓట్లలో 95% టీడీపీవే కానీ ఆత్మకూరులో మాత్రం టీడీపీ ఓట్లు బీజేపీకి ఎక్కువ పడకపోవటానికి ప్రధాన కారణం 2024లో మరోసారి టీడీపీ బీజేపీ పొత్తు కుదిరితే బొల్లినేని కృష్ణయ్య బీజేపీ తరుపున టికెట్ ఎగరవేసుకొని వెళతాడని అటు కన్నబాబు వర్గం,ఇటు టీడీపీ హార్డ్ కోర్ వర్గాలు భావించటమే.
వీటన్నిటినీ మించి 22 తారీకు రాత్రి నర్రవాడ వెంగమాంబ తిరుణాల జరగటం కూడా ఓటింగ్ శాతం తగ్గటానికి ముఖ్య కారణం. కరోనాతో 2 సంవత్సరాలు తిరునాళ్లు జగరలేదు , వెంగమాంబ మీద ఆత్మకూర్, ఉదయగిరి, కావలి,కనిగిరి ప్రాంతాలలో భక్తి ఎక్కువ. వెంగయ్య, వెంగమ్మ పేర్లున్న వారిలో వెంగమాంబ భక్తులే ఎక్కువ.
దురదృష్ట జాతకుడు
ఈసందర్భంలో 1989 ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి కూడా చెప్పాలి. కర్నాటి ఆంజనేయ రెడ్డి సీనియర్ బీజేపీ నేత. ఇప్పటికీ రోజు ఎదో ఒక టీవీ డిబేట్ లో కనిపిస్తుంటారు. నేను ఆయన 4,5 డిబేట్ లలో కలిసి పాల్గొన్నాము.
1985 ఎన్నికల్లో ఆత్మకూర్ నుంచి కేవలం 830 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోవటంతో 1989 ఎన్నికల్లో కూడా ఆత్మకూర్ సీట్ ను ఎన్టీఆర్ బీజేపీకే కేటాయించారు. కర్నాటి ఆంజనేయ రెడ్డి విద్యార్ధి ఉద్యమాల నుంచి ఎదిగిన నేత. 1982-1993 ప్రాంతంలో నెల్లూరు టౌన్ లో జరిగిన ఘర్షణల్లో ఆంజనేయరెడ్డి మీద హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్ధులు గునపంతో కడుపులో పొడిచారు. పొడిచింది కమ్యూనిస్ట్ మద్దతుదారులే , ఆయన్ను అక్కడి నుంచి భుజం మీద వేసుకొని తప్పించింది కమ్యూనిస్ట్ నాయకుడే..
ఆంజనేయ రెడ్డి 1989 ఎన్నికల్లో ఆత్మకూర్ నుంచి పోటీచేసి హోరాహోరీ ఎన్నిక జరిగింది. భోగసముద్రం అనే ఊర్లో రీపోలింగ్ జరిగింది. కాంగ్రెస్ తరపున చేజర్ల ఎంపీపీగా ఉన్న కొమ్మి లక్ష్మయ్యనాయుడు తన రాజకీయ గురువు నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి గెలుపు కోసం భోగసముద్రం రీపోలింగ్ లో సర్వశక్తులు వొడ్డి పోరాడాడు.. బొమ్మిరెడ్డి 334 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.. భోగసముద్రం రీపోలింగ్ లేకుంటే ఆంజనేయ రెడ్డి గెలిచేవాడని ఇప్పటికీ అందరూ భావిస్తారు.
కాలం తెచ్చిన మార్పు ..
1994 ఎన్నికల్లో ఇదే కొమ్మి లక్ష్మయ్యనాయుడు టీడీపీ తరుపున పోటీచేసి తన గురువు బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డిని ఓడించారు. 2004లో పొత్తులో భాగంగా బీజేపీ తరుపున బొల్లినేని కృష్ణయ్య (1999లో కాంగ్రెస్ తరుపున గెలిచాడు, అయినా పార్టీ మారాడు ) పోటీ చేయటంతో రెబల్ గా వేసి కొమ్మి లక్ష్మయ్య నాయుడు గెలిచాడు. వైస్సార్ శాసనసభలో లక్ష్మయ్యనాయుడు బలమైన నేత అని పొగిడారు. లక్ష్మయ్య నాయుడు 2014లో వైసీపీ తరుపున వెంకటగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు.
ఇప్పుడు లక్ష్మయ్యనాయుడు, బొల్లినేని కృష్ణయ్య , బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి కొడుకు మాజీ జడ్పీ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి అందరూ టీడీపీలోనే ఉన్నారు..
రేపే కౌంటింగ్.. భారీ మెజారిటీ రావటం మీద ఏమి రాయాలో ఈపాటికే ఆంధ్రజ్యోతి సిద్ధం చేసుకొని ఉంటుంది.. ఏదైనా వివరంగా రాస్తే జనాలకు తెలుస్తుంది.. అది గెలుపే కాదు అంటే ఇంక ఎన్నిక ఎందుకు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Most Important exponents of Vaishnava tradition

Today is the 1007th birth anniversary of Ramanujacharya Why returns...

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...