పెట్రోలు ధరల తగ్గింపు అందుకేనా!
మరింత తగ్గే అవకాశముందా?
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందా అనే అనుమానాలు క్రమేపీ బలపడుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యలపై చర్చ సాగుతుండగానే ప్రస్తుతానికి దానిని పక్కనపెట్టి, తాను ముందస్తుకు మొగ్గుచూపుతున్నట్లు కొన్ని చర్యలు వెల్లడిస్తున్నాయి. ఇంతవరకూ ప్రజలను కదిపికుదిపేసిన పెట్రోలు ధరలను అకస్మాత్తుగా తగ్గించింది. ఒకే సారి 8రూపాయలమేర తగ్గించడం అంటే కలిగే ఉపశమనం అంతా ఇంతా కాదు. దీనికి తోడు కీలకమైన ఓటు బ్యాంకయిన రైతుల వైపు కేంద్రం దృష్టి సారించింది. ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న వేళ, ఎరువుల ధరలను తగ్గిస్తూ రైతుల ఆందోళనను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల ధరలపై లక్ష పదివేల కోట్ల రాయితీని ప్రకటించింది. తాజా నిర్ణయంతో 2022-23 ఏడాదికి రూ.2.15 లక్షల కోట్లు రైతులకు ఎరువులపై సబ్సిడీ రూపంలో అందనుంది. ఇది కచ్చితంగా రైతులను ఆకట్టుకునే నిర్ణయమే. పెట్రోలు ధరలపై ఎక్సయిజ్ సుంకం తగ్గించడంతో దాదాపుగా పది రూపాయలు తగ్గింది. కేరళ దీని పర్యవసానాన్ని ముందే ఊహించి, వ్యాట్‌ను తగ్గించి ఆ రాష్ట్రంలో మరింత ఉపశమనం కలిగించింది.
మిగిలిన రాష్ట్రాలు కూడా అదే దారిలో పయనిస్తే దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు మరింత తగ్గడం ఖాయం. మెజారిటీ ఓటర్లు ఈ రెండిటి వినియోగదారులే. తప్పో ఒప్పో వ్యవసాయ చట్టాలపై వెనకడుగు వేసి, రైతులకు కేంద్రం స్వాంతన చేకూర్చింది. చమురు ధరలు తగ్గడం వల్ల ఆ ప్రభావం అన్ని రంగాలపై నా పడి ముఖ్యంగా నిత్యావసర వస్తువులు దిగి వస్తాయి. కేంద్రంపై ఓటరుకు కరుణ కలగడానికి ఇంతకు మించిన మహత్తర అవకాశం మరొకటి లేదు. ఉన్నట్లుండి కేంద్రం ఇలాంటి ఉపశమన చర్యలకు ఎందుకు దిగిందన్నదే ఇక్కడ కీలక అంశం. దేశంలో బీజేపీకి ఇంతవరకూ సరైన ప్రత్యామ్నాయం లేదు. కానీ, కాంగ్రెసేతర ప్రతిపక్షాలు బలపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కారణమేదైనా గెలుపు తన బలం తగ్గలేదనే భావనను బీజేపీకి కలిగించాయి. కీలకమైన కాంగ్రెస్ కూడా తనవంతుగా బలోపేతానికి అవసరమైన చర్యలకు దిగుతోంది. కాంగ్రెస్ బలపడితే, అధికారంలో ఉన్న పార్టీకి తిప్పలు తప్పవు. అది వచ్చే ఎన్నికలలో సీట్లను వందకు చేర్చుకోగలిగితే, మిగిలిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపక తప్పదు. అప్పుడు ఏం జరుతుందో చెప్పాల్సిన అవసరం. సరిగ్గా ఈ అంశాన్ని బీజేపీ సీరియస్‌గా పరిగణిస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ముందస్తుకు వెడితే తప్పేముందన్న ఆలోచన పొడచూపిందంటున్నారు.
హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు అమిత్ షా ఇప్పటికిప్పుడు ఎన్నికలకు సిద్ధం కాగలరా అంటూ టిఆర్ఎస్‌ను సవాలు చేశారు. ఇలాంటి సవాళ్ళు సాధారణంగా ఎన్నికల ఆలోచన మదిలో ఉంటేనే వస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం ప్రతిపక్షాలను కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బహుశా ఇది బీజేపీలో ముందస్తు ఆలోచనను కలిగించి ఉండవచ్చు. అందుకే ఆ దిశగా వెళ్ళేందుకు ఎందుకైనా మంచిదని చమురు ధరల తగ్గింపు, ఎరువులపై సబ్సిడీ పెంపు వంటి ఉపశమన చర్యలకు దిగుతూ ఉండి ఉండవచ్చు. గతంలో చమురు ధరలు తగ్గినా 2 రూపాయలు మించి లేదు. ఇప్పుడు ఏకంగా అది పదిరూపాయల వరకూ ఉంది. ఇదే బీజేపీ రాష్ట్రాలకు ఇచ్చిన సందేశం. సో ముందస్తుకు అంటే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సిద్ధమైపోవచ్చు. ఈలోగా మరిన్ని తగ్గింపులు ఉండవచ్చు కూడా.