అది ఫేక్ ఎన్‌కౌంటర్
సుప్రీం కోర్టుకు సిరార్పూర్ కమిటీ నివేదిక
387 పేజీల నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించిన కమిటీ
కేసును హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం ఉత్తర్వులు
నివేదికను బహిరంగ పరచవద్దని కోరిన డిఫెన్స్ లాయర్
వెల్లడించడం తమ బాధ్యతన్న ధర్మాసనం
హైదరాబాద్, మే 20: హైదరాబాద్‌లో జరిగిన దిశ ఎన్‌కౌంటర్ నివేదికపై సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కేసును హై కోర్టుకు బదిలీ చేసింది.
ఇకపై పోలీసులు జాగ్రత్తగా ఉండాల్సిందే. ముష్కరుల పట్ల సైతం కఠినంగా వ్యవహరించడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నకిలీదని ఈ సంఘటనపై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక తేల్చింది. సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్‌లో సుప్రీం ధర్మాసనానికి అందిన నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. నిందితుల నుంచి ఆయుధాలు లాక్కున్నారని చెప్పడం నమ్మశక్యంగా లేదని కమిషన్ భావించింది.
పోలీసులపై కాల్పులు చేశారన్న దానికి ఆధారాలు లేవని స్పష్టంచేసింది. బాధ్యులపై 302కింద కేసు పెట్టాలని సిఫార్సు చేసింది. పోలీసులు కట్టుకథలు అల్లారని పేర్కొంది. ఎన్‌కౌంటర్ ఘటనలో పదిమంది పోలీసులు పాల్గొన్నారని తెలిపింది. ప్రజలు కోరుతున్నారని ఎన్‌కౌంటర్ చేస్తే దానికి చట్టబద్దత ఉంటుందా అనే మౌలికమైన ప్రశ్నను కమిటీ వేసింది. దిశ ఎన్‌కౌంటర్లో నలుగురు మరణించారు. ఈ నలుగురు దిశను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి కాల్చి చంపారు. అనంతరం పోలీసులు వేగంగా స్పందించి, నిందితులను పట్టుకున్నారు. సీన్ రీ కనస్ట్రక్షన్ కోసం తెల్లవారుఝూమున నిందితులను హత్యాచార ఘటన స్థలానికి తీసుకెళ్ళినప్పుడు నిందితులు తిరగబడ్డారనీ, విధిలేని పరిస్థితుల్లో వారిని కాల్చి చంపామనీ పోలీసులు తెలిపారు.