సీఎం జగన్‌ను కలిసిన నాల్కో, మిథానీ సీఎండీలు
వెయ్యి మంది వరకూ ఉపాధి
అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 25: నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝ సోమవారం నాడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. నాల్కో, మిధాని సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ (యూడీఏఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్ అల్యుమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకానున్న నేపథ్యంలో వీరు సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రూ. 5,500 కోట్ల ఖర్చుతో పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఏడాదికి 60,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు రెండున్నరేళ్ళలో పూర్తవుతుంది. దాదాపు 750 – 1000 మందికి ఈ ప్రాజెక్టులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యోగావకాశాలు లభించే అవకాశముంది. ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ఎదురవుతున్న సమస్యలను అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సంబంధిత సమస్యలను తక్షణం వివిధ శాఖల అధికారులకు సీఎం ఆదేశాలు చేశారు. రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటుచేయాలని సీఎం జగన్ సూచించారు. దీనికి సంస్థ సీఎండీలు అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలో అల్లాయ్ పరిశ్రమ
Date: