రామలింగేశ్వరునికి మహాకుంభాభిషేకం
పూర్ణాహుతిలోనూ పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు
యాదాద్రి, ఏప్రిల్ 25: యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి అనుబంధ ఆలయం ‘పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ’ పునఃప్రారంభ మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులు పాల్గొన్నారు.
అనంతరం ‘పర్వత వర్దిని సమేత శ్రీ రామలింగేశ్వర స్పటిక లింగాని’కి అభిషేకం నిర్వహించారు. శివాలయ మహా కుంభాభిషేకంలో భాగంగా మధ్యాహ్నం 12.30 గంటలకు యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతిలో సిఎం కెసిఆర్ దంపతులు పాల్గొన్నారు.
సోమవారం ఉదయం యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు తొలుత లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు వేదోచ్చారణతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో సిఎం దంపతులు పూజలు నిర్వహించారు.
అనంతరం పూజారులు సిఎం కెసిఆర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు.
అక్కడనుండి నేరుగా ‘పర్వతవర్దిని సమేత శ్రీ రామలింగేశ్వర ప్రధాన ఆలయానికి సిఎం దంపతులు చేరుకున్నారు.
అక్కడ పూజారులు గర్తన్యాసము, సపరివార శ్రీ రామలింగేశ్వర స్పటిక లింగ ప్రతిష్ఠా మహోత్సవము, మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. అనంతరం అష్టబంధనం, ప్రాణ ప్రతిష్ట, ప్రతిష్టాంగ హోమము, అఘోర మంత్ర హోమము, దిక్దేవతా క్షేత్రపాల బలిహరణము, కలశ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో సిఎం కెసిఆర్ దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం సిఎం కెసిఆర్ దంపతులు తిరిగి యాదాద్రి నుంచి బయలుదేరి వెల్లారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీతారెడ్డి, రాజ్యసభ ఎంపి సంతోష్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపి బూరనర్సయ్య గౌడ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, యాదగిరి గుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.