తొలిసారి రాత్రి ప్రసంగించిన ప్రధానిగా చరిత్ర
తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్బంగా కార్యక్రమం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: భారత దేశం గురువారం ఓ అసాధారణ దృశ్యాన్ని వీక్షించబోతోంది. సూర్యాస్తమయం తరవాత ఎర్ర కోట నుంచి ప్రసంగించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించబోతున్నారు. సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజు అంటే ఏప్రిల్ 21న ప్రధాని ఎర్రకోట నుంచి ప్రసంగించబోతున్నారు.
గురు తేజ్‌బహదూర్ 400వ జయంతిని పురస్కరించుకుని ఆయన జాతినుద్దేశించి మాట్లాడబోతున్నారు. అయినా ప్రసంగించేది ఎర్రకోట బురుజుల నుంచి కాదు. ఎర్రకోట ఆవరణలోని పచ్చికబయలులో ఏర్పాటయ్యే జయంతి కార్యక్రమంలో ప్రధాని మాట్లాడతారు. ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవాన కాకుండా ఎర్రకోటలో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఇది రెండోసారి. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 సంవత్సరాలైన సందర్భంగా 2018లో మోడీ ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఆ తరవాత మళ్ళీ ఇదే తొలిసారి. అక్కడి నుంచే ఆయన ప్రసంగించడానికి ప్రత్యేక కారణమూ ఉంది. సిక్కుల తొమ్మిదవ గురువైన తేజ్ బహదూర్‌ను ఉరి తీయాల్సిందిగా మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు 1675లో ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని ఇక్కడి నుంచి మాట్లాడడానికి ఇదే కారణం.కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గురువారం రాత్రి 9.30 గంటలకు ప్రధాని అక్కడ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కులాలు, జాతుల మధ్య ఐకమత్యం అవసరం గురించి ఆయన మాట్లాడతారని అధికారిక సమాచారం. 400మంది సిక్కు కళాకారులతో సంగీత కార్యక్రమం ఉంటుంది. గురు తేజ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని మోడీ ఓ స్మారక నాణెన్ని విడుదల చేస్తారు.