బయట అమ్మి నష్టపోవద్దని రైతులకు పిలుపు
డెడ్‌లైన్ విధించి 24 గంటలు గడవకముందే ముఖ్యమంత్రి నిర్ణయం
హిట్లర్లే కొట్టుకుపోయారంటూ పరోక్షంగా వ్యాఖ్య
కేంద్రమే బలంగా ఉండాలనుకుంటున్నారంటూ విమర్శ
రాష్ట్రాలను బలహీనపరుస్తారని మండిపాటు
హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్ చేశారు. అది సెల్ఫ్ గోల్ అని బీజేపీ అంటోంది. కాదు కేంద్రం చేతులెత్తేసింది కాబట్టే రైతును నష్టపెట్టడం ఇష్టంలేక రాష్ట్రమే అందుకు నడుం బిగించిందని టీఆర్ఎస్ అంటోంది. క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఖరీఫ్ ధాన్యాన్ని మొత్తం రాష్ట్రమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. కనీస ధర 1960రూపాయలను చెల్లిస్తామని చెప్పారు. ఆఖరు గింజను సైతం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలు అనే సూత్రాన్ని పాటిస్తోందన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్‌పైనా విమర్శలు కుప్పించారు. ధాన్యం కొనుగోలు అంశంపై ఈ నెల 11న న్యూఢిల్లీలో దీక్ష చేసిన కేసీఆర్, కేంద్రానికి 24గంటల డెడ్‌లైన్ విధించి 24 గంటలు గడవకముందే ధాన్యం మొత్తాన్ని కొనాలనే నిర్ణయం తీసుకున్నారు.
గోయల్‌కు జ్ఞానం ఉందా?
కేంద్రమంత్రి పీయూశ్ కు మెదడు, జ్ఞానం, బుద్ధి వుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనడం చేతగాక.. నూకలు తినమని అవమానిస్తున్నారని మండిపడ్డారు. పీయూశ్ గోయల్‌కు విపరీతమైన గర్వం, అహంకారం వుందన్నారు. అన్నం అందించే వారికి నూకలు తినమని చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమని తెలిపారు. నూకలు తినమని చెప్పి, తెలంగాణ ప్రజలను అవమానించారని కేసీఆర్ విమర్శించారు. కేంద్రానికి పరిపాలన చేతకావడం లేదని, తమ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేసవిలో రికార్డు స్థాయిలో వరి సాగు
తెలంగాణలో క్యా చమత్కార్ హై రావ్ సాబ్ అంటూ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ తనతో అన్నారని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్క యాసంగిలోనే తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి సాగైందని, దేశంలో ఎక్కడా లేని స్థాయిలో తెలంగాణలోనే వరి సాగైందని తెలిపారు. ఇదే తెలంగాణ చమత్కార్ అని కేసీఆర్ పీయూశ్ గోయల్‌కు ఈ సందర్భంగా దీటైన సమాధానమిచ్చారు. తాము దద్దమ్మలని, ధాన్యాన్ని కొనుగోలు చేయడం తమతో చేతకాదని కేంద్రం చెప్పేస్తే సరిపోతుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
కొనడం చేతకాక చేతులెత్తేశారు
ధాన్యం కొనడం కేంద్రానికి చేతకావడం లేదని, చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రతి సారీ ఓ మెలిక పెట్టి, కేంద్ర ఆహారభద్రత చట్టం కింద ఉన్న బాధ్యతను కేంద్రం విస్మరించి, నాటకాలు ఆడుతోందని సీఎం విరుచుకుపడ్డారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా కేంద్రం అనేక వేల టన్నుల బాయిల్డ్ రైస్ ఎగుమతి చేశారని, అయినా అబద్ధాలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
ధాన్యం ఎంతొచ్చినా కొంటాం
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం వెల్లడించారు. క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో సమృద్దిగా పంటలు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని, రైతాంగం సుఖంగా వుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తమ చర్యల వల్ల ఒక కోటి ఎకరాల పంట విస్తీర్ణం పెరిగిందని, అందుకే పంటలు బాగా పండాయని వివరించారు. అయితే కేంద్రంలో పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక ప్రభుత్వం వుందని, ఇది భారత రైతాంగ దురదృష్టమని విరుచుకుపడ్డారు. 13 నెలల పాటు రైతాంగం ఢిల్లీలో ధర్నాకు దిగాయని, చివరికి కేంద్రం దిగివచ్చి, ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేశారని గుర్తు చేశారు.
చరిత్రలో హిట్లర్లు, ముస్సోలినీలు, నెపోలియన్లు కొట్టుకుపోయారంటూ కేంద్రాన్ని ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య చేశారు. రాష్ట్రాలపై కేంద్రం పన్నుల భారాన్ని మోపుతోందని మండిపడ్డారు.