(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
సుమారు 35 ఏళ్ళ క్రితం.. రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రం ప్రాంగణం. జనం కిటకిటలాడిపోతున్నారు. ఇంతలో ఓ యువకుడు కారులోంచి దిగాడు. జనం అంతా ఆయనవైపు పరుగులు తీశారు. ఒక్కసారిగా తొక్కిసలాట స్థాయికి చేరింది. ఆ గందరగోళంలో ఆ యువకుడు గట్టిగా అరిచాడు. వెంటనే అలెర్ట్ అయిన అక్కడి వారు ఏం జరిగిందని చూశారు. ఆ యువకుడి అరికాలు సైకిల్ చైన్‌లో ఇరుక్కుపోయింది. రక్తం కారుతోంది. వెంటనే సైకిల్ మెకానిక్‌ని పిలిపించి, చైన్ కట్ చేయించి… ఆ యువకుణ్ణి ఆస్పత్రికి పంపారు. ఫస్ట్ ఎయిడ్ తీసుకుని ఆ యువకుడు ఆనం కళాకేంద్రానికి తిరిగి వచ్చాడు. వస్తూనే స్టేజ్ ఎక్కాడు. మరుక్షణం మైక్ ఆ యువకుడి చేతిలోకి వచ్చింది. అంతే అతని గొంతు ఖంగున మోగింది… జైజై శివశంకర్…కాంటా లగే న కంకర్ అంటూ అతను పాడుతుంటే ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. ఆప్ కీ కసమ్ చిత్రంలో కిశోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన పాట ఇది. ఇంతకీ ఆ యువకుడికి రాజమండ్రీ కిశోర్ కుమార్ అని పేరు. ఎక్కడ పాడినా ఈ పాట పాడాల్సిందే. ఆయనే శ్రీపాద జిత్ మోహన్ మిత్రా. వృత్తిరీత్యా అడ్వొకేట్. ప్రవృత్తి పాటలు పాడడం. ఏ నవరాత్రి ఉత్సవం జరిగినా రాజమండ్రిలో ఆ రోజుల్లో మ్యూజికల్ నైట్స్ పరిపాటి. వాటిలో జిత్ మోహన్ మిత్రా పాడే కిశోర్ కుమార్ పాటలు హైలైట్. హైలైటేమిటి ఉండాల్సిందే… అంత పాప్యులర్ ఆయన గొంతు.
తరువాత ఆయన సినిమాల్లోనూ ప్రతిభ కనబరిచారు. శంకరాభరణంలో శంకర శాస్త్రిని ఎగతాళి చేసే పాత్ర జిత్ మోహన్ మిత్రకు పేరు తెచ్చిపెట్టింది. ప్రముఖ హాస్య నటుడు అలీ చిన్నతనంలో జిత్ మోహన్ మిత్ర మ్యూజికల్ నైట్స్‌లో షోలే చిత్ర డైలాగ్స్ చెప్పేవారు. అలీ సినీ ప్రస్థానానికి మిత్రా పునాదిగా నిలిచారు.
ఈ నెల 30న ఆయన అశీతి అంటే ఎనబై ఏళ్ళ జన్మదినాన్ని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిత్‌మోహన్ మిత్రా పుట్టిన రోజు అంటే నాకు ఈ సంఘటన గుర్తుకొచ్చింది. ఆ సంఘటన జరిగినప్పుడు నేనూ అక్కడే ఉన్నా. అందుకే గుర్తుచేసుకున్నా. శ్రీపాద జిత్‌మోహన్ మిత్రాకు వ్యూస్ జన్మదిన శుభాకాంక్షలను అందిస్తూ ఆయన అశీతి వేడుక ఫొటోలను అందిస్తోంది.