రెండు నిర్ణయాలూ రైతులకు మద్దతుగానే…
కేంద్రం, ఏపీ వెనకడుగు
3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న ప్రధాని
ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరించుకున్న జగన్
ఫుల్ స్టాప్ కాదు విరామమేనంటున్న పెద్దిరెడ్డి
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
మూడు రోజుల వ్యవధిలో రెండు కీలక నిర్ణయాలపై వెనకడుగు. నిర్ణయం తీసుకున్న తరవాత వెనక్కి తగ్గిన సందర్భాలు భారత రాజకీయ చరిత్రలో చాలా అరుదు. స్థిర చిత్తులైన ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇలా తమతమ నిర్ణయాలపై వెనకడుగు వేశారు. ఏడాది క్రితం చేసిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకున్నట్లు ప్రధాని చేసిన ప్రకటన, అలాగే ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును వెనక్కితీసుకోవడం నిజంగా సంచలనమే. వ్యవసాయ చట్టాలపై రైతులు ఏడాదిగా ఢిల్లీ వేదికగా ఆందోళన చేస్తున్నారు. వందల సంఖ్యలో రైతులు అశువులు బాశారు. సంస్కరణల అంశంలో ఎంతో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చిన మోడీకి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం ఆశ్చర్యమే. డీ మానిటైజేషన్, జిఎస్టీ, వంటి నిర్ణయాలలో కఠినంగానే ఉన్న నరేంద్ర మోడీ వ్యవసాయ బిల్లుల అంశంలో వెనక్కి తగ్గడమే కాకుండా తన నిర్ణయం పట్ల అన్నదాతలకు క్షమాపణ కూడా చెప్పారు. బహుశా ఆయన క్షమాపణ చెప్పిన సందర్బం ఇదొక్కటేనేమో. గోద్రా అల్లర్ల అంశంలో కూడా ఆయన వెనక్కి తగ్గలేదు.
న్యాయస్థానాలు ఆయనను నిర్దోషిగానూ ప్రకటించాయి. రైతుల విషయంలో కఠినంగా సాగడం, అందునా ఎన్నికల సమయంలో ఇలాంటి వైఖరి చేటు చేస్తుందనే బెరుకు ఉండి ఉండవచ్చు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా మరో మూడు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. పెట్రోలు ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడం, వాటిని అదుపులోకి తెచ్చే పరిస్థితులు లేకపోవడం సహా మరిన్ని అంశాలు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించాయి. ఎన్నికల ముంగిట పట్టు సడలించకపోతే మొత్తానికే మోసం వచ్చే అవకాశం ఉంది. అందుకే వ్యవసాయ చట్టాలపై వెనకడుగు వేస్తే పోయేదేముందని అనుకున్నట్లుంది. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలా అని పాలకులు ప్రయత్నిస్తారు. కుదరకపోతే తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తారు. ఇక్కడ మోడీకి ఈ రెండూ కనిపించలేదు. సమస్యలలో తీవ్రంగా ఉన్నది ఎంచుకున్నారు… వ్యవసాయ చట్టాలకు మంగళం పాడారు.
మరో పక్క, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ డిమాండ్ పక్కలో బల్లెంలా మారింది. పంజాబ్‌లో కొన్నట్లే తెలంగాణలోనూ ధాన్యం మొత్తం కొనాలని భీష్మించుకున్నారు ఆయన. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ధాన్యం అంశం తేలితే తప్ప రాష్ట్రానికి తిరిగి వెళ్ళనంటున్నారు. ఈ క్రమంలో సమస్యలను జటిలం చేసుకోవడం కంటే తప్పించుకుని ఉపశమనం పొందడం మేలని ప్రధాని భావించినట్లున్నారు. అందుకే సత్వరం నిర్ణయానికి వచ్చారు. అమలులో పెట్టారు.
ఏపీలో జగన్ వెనుకంజ
సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు ఉండాల్సిందేనని పట్టుబట్టిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, టీడీపీ ప్రభుత్వం పెట్టిన సిఆర్‌డిఏ బిల్లును చెత్తబుట్టలో వేసింది. ఇలా చేసి, 700 రోజులు పైనే అయ్యింది. ఇది అమరావతికి భూములిచ్చిన రైతులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అప్పటి నుంచి వారు రాజధాని అమరావతిలోనే ఉండాలని ధర్నా చేపట్టారు. హైకోర్టునూ ఆశ్రయించారు. కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసులో వ్యతిరేక సంకేతాలు కనిపిస్తున్నాయి.
హైకోర్టును తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటంటూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లూ వార్తలు వచ్చాయి. అంతకు మించి బీజేపీ తన స్టాండ్ మార్చుకుంది. రాజధాని అమరావతిలోనే ఉండాలని స్పష్టంచేసింది. కేంద్రం కూడా ఇదే ఉద్ఘాటించింది. రాజధాని అంశం రాష్ట్రం పరిథిలోనిదేనని ఇప్పటి వరకూ అంటూ వచ్చిన కేంద్రం కూడా ఇదే దారి పట్టింది. అంతకు మించి, ఇటీవల తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరయ్యారు.
మరోవంక తమకు న్యాయం చేయాలని అమరావతి రైతులు న్యాయ స్థానం నుంచి దేవస్థానం వరకూ అంటూ తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎటూ ఉండనే ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడమెలాగో అనే అంశంపై తలమునకలవుతున్న రాష్ట్ర ప్రభుత్వం సమస్యల నుంచి గట్టెక్కడానికి మార్గాలను వెతుకుతోంది. ఒకవేళ న్యాయస్థానంలో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అప్రతిష్ట పాలవుతారు. అందుకే మూడు రాజధానుల ఏర్పాటు, సిఆర్డిఏ రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రజల విస్తృత, విశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులను ప్రస్తుతానికి ఉపసంహరించుకుంటున్నాం..త్వరలో మరోసారి సమగ్రమైన బిల్లును ప్రవేశపెడతాం అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇదే విషయమై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇది స్వస్తి కాదు విరామం మాత్రమే. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం అని ప్రకటించారు.
ఈ రెండు నిర్ణయాలను తీసుకున్న సమయాలనూ, కారణాలనూ విశ్లేషిస్తే ప్రజల శ్రేయస్సూ, రాష్ట్రాభివృద్ధి కాకుండా తమ పార్టీల భవిష్యత్తు దృష్ట్యా చేపట్టినవేనన్నది సీనియర్ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక్కటి దిక్కు లేదు, మూడు అంట…. Hahaha