మరొక జన్మ ఉంటే ఆయన కూతురిగా పుట్టాలి
ఫిబ్రవరి 11 అమర గాయకుడు ఘంటసాల 48వ వర్థంతి
(ఘంటసాల శ్యామల)
జీవన స్రవంతిలో మనని అనేక దశలలో ప్రభావితం చేసేవారు ఎందరో ఉంటారు. వారిని మనం నిత్యం స్మరించుకుంటూ ఉంటాము. వారు తల్లిదండ్రులు, తోడపుట్టిన వారు, బంధువులు, గురువులు, స్నేహితులు, కళాకారులు, నాయకులు-ఎవరైనా కావచ్చు. కానీ వారందరూ ఒకే వ్యక్తి అయితే? అటువంటి అద్భుతమే మా నాన్నగారు, శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారు. 2022 ఫిబ్రవరి 11కి ఆయన ఐహిక బంధాల నుంచి విముక్తులై, తను మనసారా నమ్మిన ఈశ్వర సన్నిధానాన్ని చేరి 48 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సమయంలో వారిని గురించి కొన్ని మాటలు-
బాగా చిన్నతనంలో కేవలం గారాబం చేసే తండ్రిగా మాత్రమే పరిచయం. సర్వసాధారణమైన మధ్య తరగతి కుటుంబ పెద్ద. పది సంవత్సరాల వయసు వచ్చేసరికి నాన్నగారు సినిమాలలో పాటలు పాడుతుంటారు: ఎప్పుడూ తీరికగా కూర్చుని కనిపించరు. ఆదివారాలు కూడా పనికి వెళ్ళిపోతారు, పండుగనాడు కూడా పూర్తిగా ఇంటిపట్టున ఉండరు. అందరినీ అమ్మ, బాబు అంటూ చల్లగా నవ్వుతూ పలకరిస్తారు. అలా నవ్వుతుంటే ఎంత బాగుంటారో. ఎంత అల్లరి చేస్తున్నా ఎప్పుడూ కోపం రాదేంటో! పైగా అమ్మ తిడితే మమ్మల్ని వెనకేసుకొస్తారు. – పిల్లలు కాకపోతే నువ్వు అల్లరి చేస్తావా అంటూ సైగలు చేస్తూ నవ్వే నాన్నగారు కూడా ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేరు-ఏమీ చెయ్యలేరన్న ధైర్యం ఉండేది.
విచిత్రం-గుండె నిబ్బరం, భగవంతుడంటే అపారమైన నమ్మకం, అవమానించిన వారిని – ఆదరించిన వారిని, ఎగతాళి చేసిన వారిని-అందలం ఎక్కించిన వారిని, చిన్నవారిని-పెద్దవారినీ అందరినీ ప్రేమించి ఆదరించడం భగవంతుడి లక్షణమైతే నాన్నగారు దేవుడే. కంటికి కనబడకపోయినా ప్రతిక్షణం మనతోనే ఉన్నానన్న భరోసాని ఇచ్చేది దేవుడైతే మాకు కనిపించి, మమ్మల్ని ప్రభావితం చేసి జగమంత కుటుంబాన్ని అందించిన నాన్నగారు దేవుడే. ఇంతకన్నా వివరించడానికి, ఆ మహోన్నత వ్యక్తి గురించి చెప్పడానికి నేనెంత దానిని కనుక?? మరెక్కడైనా, మరెప్పుడైనా మరొక జన్మంటూ ఉంటే నాన్నగగారితోటే, ఆయన కూతురిగానే అవ్వాలని అహరహం ఆ అంతర్యామిని ప్రార్థించే మీ
శ్యామల
ఘంటసాల వర్థంతి సందర్భంగా ఆయన పెద్ద కుమార్తె రచించిన వ్యాసం ఇది)