రామానుజ వైభవం – 4
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
రామానుజ యతీంద్రుల జీవిత ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహత్తర ఘట్టం అష్టాక్షరి,చరమ శ్లోక రహస్యార్థ ఆస్వాదన, దానిని జనవాహినికి వెల్లడించడం.దీనిని సాధించడంలో ఆయన చూపిన సహనం అనన్య సామాన్యం. అందుకే ఆయన ‘సమతామూర్తి’గానే కాదు….‘సహనమూర్తి’ గానూ నీరాజ నాలందుకుంటున్నారు. ఆధ్మాత్మిక హక్కుల సాధనలో,దానిని లోకానికి పంచ డంలో వెనకడుగు తెలియని ధీశాలి.
గోష్ఠీపురంలో గోష్ఠీపూర్ణులనే (తిరుక్కోటియూర్‌నంబి) కుశాగ్రబుద్ధిశాలికి శుశ్రూష చేసి వారి వద్ద గల రహస్యార్థాలను తెలుసుకుని నీ జ్ఞాన సంపదను విస్తృతపరచుకోవాలన్న గురువు మహాపూర్ణుల హితవుతో అక్కడికి బయలు దేరారు. తిరుమంత్రం (అష్టాక్షరి), భగవద్గీతలో భగవానుడు చెప్పిన చరమ శ్లోకం (‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. .’)నిగూఢార్థాన్ని గురువుతో ముఖతః నేర్చుకోవాలన్ననిబంధన మేరకు గోష్ఠీపూర్ణులను ఆశ్రయించారు. ఆయన ప్రయత్నం వెంటనే సాకారం కాలేదు. వాటిని బోధించేందుకు గోష్ఠీపూర్ణులు సత్వరమే సుముఖత వ్యక్తం చేయలేదు. రకరకాల నిబంధనలతో పద్దెనిమిదిసార్లు తిప్పుకున్నారు. రామానుజులకు లక్ష్యసాధన దిశగా మరింత పట్టుదల పెరిగి శ్రీరంగం నుంచి సుమారు 150 మైళ్లు దూరాన గల తిరుక్కోటియూర్‌కు విసుగు చెందక అన్నిసార్లు తిరిగారు. ‘కార్యాతురాణాం న నిద్ర నసుఖం’ అనే ఆర్యోక్తికి నిదర్శనంగా నిలిచారు.
రామానుజుల వినయసౌజన్య సౌశీల్య సంపద నచ్చిప్పటికీ మంత్రార్థం తెలుసుకోవడంలో ఆయనకు గల పట్టుదల దీక్షాదక్షతలను పరిశీలించేందుకు గురువు అలా వ్యవహరించారని చెబుతారు. ‘ఈ కలికాలంలో మంత్ర మంత్రార్థ గ్రహణానికి తగిన యోగ్యత కలవారే కనిపించడం లేదు. అలాంటప్పుడు నీకు ఎలా ఉపదేశించగలను?‘ అని కూడా ప్రశ్నించారు. శిష్యుని జ్ఞానతృష్ణకు సానపట్టే ప్రయత్నంలో భాగంగానే గోష్ఠీపూర్ణులు అలా వ్యాఖ్యానించి అనేక నిబంధనలు విధించారంటారు. ‘తిరుమంత్రోపదేశం పొందేందుకు మాసం పాటు ఉఫవాసం చేసి, సంసారం పట్ల రక్తిని త్యజించాలి’ అని ఒకసారి, ‘అహంకార మమకారాలను విసర్జించేందుకు ప్రయత్నించి రావాలని’ అని మరోసారి, ఇలా తిప్పుకుంటూనే ఉన్నారు. గురువు పెట్టే పరీక్షలలో విజయం సాధిస్తూనే ఉన్నారు. అయినా మంత్రోపదేశం కలగదేమోననే ఏదో చింతతో నిద్రాహారాలకు దూరమైన వైనం ఈనోటా ఆనోట గోష్ఠీపూర్ణులదాకా చేరింది. శిష్యుడి దృఢ చిత్తం తెలిసి ఎట్టకేలకు మంత్రోపదేశానికి అంగీకరించి, ఆహ్వానించారు.
షరతులతో ‘అష్టాక్షరి’
‘ఈ తిరుమంత్రం అసాధారణమైనది. విన్నంతనే విష్ణు పథం చేర్చగల ఇది అన్యుల చెవిన పడకూడదు. ఎన్నో పరీక్షలకు తట్టుకొని మంత్రరాజాన్ని పొందుతున్నావు. అనర్హులు, అయోగ్యులకు వెల్లడించరాదు. అందుకు భిన్నంగా వెల్లడిస్తే రౌరవాది నరకాలకు పోతావు’ అని గురువు హెచ్చరించారు. మంత్రోపదేశం పొందిన రామానుజులు ‘నన్ను నడిపించే విష్ణువే లోకాన్ని నడిపిస్తున్నాడు. అందరి వాడైన నారాయణుడికి సంబంధించిన మంత్రరాజం కొందరికే పరిమితమా? ప్రహ్లాద, నారద, అంబరీష, గజేంద్రాదులను తన్మయులను చేసిన వేదాల సారమైన నారాయణ మంత్రం తన ఒక్కడికే సొంతం కావడం ఎంత సబబు? ఆలోచనలో పడ్డారు. పైగా మంత్రప్రాప్తి ఎంత శ్రమతో కూడినదో అవగతం కావడం, తనలాంటి వారికే ఇలాంటి అనుభవం ఎదురైతే సామాన్యుడి పరిస్థితేమిటనీ ఆలోచన చేశారు. వ్యక్తిగత స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సు మిన్న అని, వేదవేదాంతాలు అభ్యసించలేని, యమనియమాదులను పాటించలేని పామరజనులకు లింగవయోజాతి కులాలకు అతీతంగా ఈ మంత్రార్థం అందవలసి ఉందని నిశ్చయానికి వచ్చారు. ఈ విషయంలో గురువాజ్ఞను ధిక్కరించిన ఫలితంగా తనకు నరకప్రాప్తి కలిగినా ఫర్వాలేదని, ఈ మంత్రార్థం తెలిసిన వారు పరమపదవాసి శ్రీమన్నారాయణుని దివ్య చరణారవిందాలను ఆశ్రయిస్తారు కదా? అని మనోనిశ్చ యానికి వచ్చి ఆధ్యాత్మిక సంస్కరణకు శ్రీకారం చుట్టారు.
తిరుమంత్రం వెల్లడి
గోష్ఠీపురంలోని శ్రీసౌమ్యనారాయణ పెరుమాళ్ కోవెల పైభాగం నుంచి రామానుజులు తిరుమంత్రార్థాన్ని ప్రకటించారు. అష్టాక్షరిని అందరితో పలికించారు. తాను నేర్చుకున్న విశేషాలను సుదీర్ఘంగా వివరించారు. అప్పటిదాకా కొందరికే పరిమితమైన మంత్రార్థ రహస్యం బహిరంగమైంది. ఆయన తెగువ గురువు గోష్ఠీపూర్ణులకు ఆగ్రహం తెప్పించింది. వాగ్దాన భంగానికి పర్యవసానాన్ని మరోమారు గుర్తుచేశారు. అయినా చలించని రామానుజ ‘నా చర్యతో జనులంతా ముక్తిమార్గంలో పరమాత్ముడిని చేరగలినప్పుడు నేనొక్కడిని నరకానికి పోతేనేం? అందుకే ఈ సాహసం చేశాను’అని బదులిచ్చారు. శిష్యుడి ధర్మ దృక్పథం, ఉదాత్తభావం, సమాజ హితానికి ముగ్ధుడైన గురువు గోష్ఠిపూర్ణులు ‘నాకంటే చాలా మంది కంటే గొప్పవాడివి’ (ఎమ్బెరుమానార్) అని అక్కున చేర్చుకోవడమే కాదు తన కుమారుడు సౌమ్య నారా యణుని భవితను శిష్యునికి అప్పగించారు. ‘రామానుజుల ఈ మహా త్యాగమహిమతో వైష్ణవదర్శనం ఇకపై రామానుజ దర్శనం’ అనే పేరుతో ప్రసిద్ధమవుతుందని ప్రకటించారు. అదే ‘రామానుజ సంప్రదాయం’గా చెబుతారు. లోకుల పట్ల రామానుజల దయ సముద్రమంతటిది అనే భావనతో కూరత్తాళ్వార్ ఆయనను ‘దయైకసింధో’ అని అభివర్ణించారు.
చిత్తశుద్ధే ప్రధానం
నారాయణ మంత్రోచ్ఛారణకు దేశకాలాదులు అడ్డురావని, ప్రపన్నులకు దేశకాలనియమాలు వర్తింపవని, దానిని సర్వవేళలా ఉచ్ఛరించ వచ్చని సూచించారు రామానుజులు. భగవదారాధనకు చిత్తశుద్ధే ప్రధానమని, శ్రీమన్నారాయణుడి అర్చన పరమ సాత్త్వికం కనుక జంతుబలులు అవసరంలేదంటూ తామసారాధనలను నిరసించారు. ఆయన నిత్యం ఉపదేశించే మంత్రార్థాలను, వేదవేదాంత రహస్యాలను తెలుసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఎందరెందరో వచ్చేవారట. వారందరికి మఠంలో తదీయారాధన (భోజన సదుపాయాలు) కల్పించేవారు.
‘అత్యంజుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికి భక్తి మార్గం సమానమేనని ప్రబోధించిన ఆధ్యాత్మిక సారథి భగవద్రామానుజులు’అని స్వామి వివేకానంద, ‘ధార్మికంగా, సామాజికంగా విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టిన మహాస్రష్ట. ధైర్యంతో కూడిన ప్రేమ, వెన్నుచూపని నైతిక యుద్ధ కౌశల్యం, ఎంచరానంత బలమైన ఆత్మబలం, భావితరాలపై ప్రేమ లాంటి విశేష గుణాలు ఆయన సొంతం’ అని సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు, ‘ఒక వర్గానికి పరిమితమైన మోక్షద్వారాలను సర్వులకూ తెరిచిన సమాతామూర్తి రామానుజులు అని తమిళ ప్రసిద్ధ కవి భారతీదాసన్ శ్లాఘించారు. (వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్ట్)