రామానుజోదయం

Date:

రామానుజ వైభ‌వం-1
(డాక్ట‌ర్ ఆర‌వ‌ల్లి జ‌గ‌న్నాథ స్వామి, 9440103345)
తాను సృష్టించిన మానవులు విషయాసక్తులై గడపడం శ్రీమన్నారాయణుడిని కలవర పరిచిందట. శయ్యా, ఆసనం, వస్త్రాలు, గొడుగు మున్నగు ఉపకరణాలు చేయగలిగే సేవలను తన శరీరంతోనే నిర్వహించే ఆదిశేషువు కల్పించుకుని ‘మీ పాద సేవచేసేందుకు సర్వదా, సర్వధా నేను సిద్ధంగా ఉండగా మీకెందుకీ ఆలోచన? మీ అనుగ్రహం ఉండాలే కానీ మీకు శ్రమ లేకుండా జీవరాశులను మీ పట్ల అనురక్తులను చేస్తాను. ధర్మరక్షణకు నా వంతు పాటుపడతాను’ అంటూ భగవద్రామానుజులుగా ధరపై అవతరించాడు.
‘ప్రథమో అనంత రూపశ్చ ద్వితీయో లక్ష్మణస్థతా
తృతీయో బలరామశ్చ కలౌ రామానుజో ముని:’…
ప్రథమ అవతారం అనంతుడు కాగా త్రేత, ద్వాపర యుగాలలో లక్ష్మణ, బలరాములుగా అవతరించిన ఆదిశేషువు ఈ యుగంలో రామానుజ యతీంద్రులుగా ఆవిర్భవించారని ఆరాధకుల విశ్వాసం. త్రేతాయుగంలో అనుజునిగా అన్న శ్రీరాముడికి సేవలు అందించి, ద్వాపరంలో శ్రీకృష్ణుడి అగ్రజుడిగా పరిపాలన సాగించి, కలియగంలో సమాజోద్ధరణకు యతీంద్రులుగా అవతరించారు.
‘చైత్రార్ద్రా సంభవం విష్ణోర్దర్శనం స్థాపనోత్సుకం
తుండీర మండలే శేషమూర్తిం రామానుజం భజే’


పింగళి నామ సంవత్సర చైత్రమాసం శుక్లపక్షం పంచమి గురువారం ఆర్ద్రా నక్షత్రం కర్కాటక లగ్నంలో (కలియుగం 4118 సంవత్సరంలో ఆంగ్ల మాసం ప్రకారం 1017 ఏప్రిల్ 4వ తేదీ) ఆసూరి కేశవాచార్య కాంతిమతి దంపతులకు శ్రీ పెరుం బూదూరు (శ్రీభూతపురి)లో జన్మించారు. సంతానం కోసం పరితపిస్తున్న ఆ దంపతులు చెన్నపట్నంలోని తిరువల్లి క్కేణి కైరవణీ సరస్సులో స్నానమాడి పార్థసారథి స్వామి పెరుమాళ్‌ను ప్రార్థించారు. శ్రీహరిని ఉద్దేశించి పుత్రకామేష్టి నిర్వహించగా, ‘అనంతుడే పుత్రుడిగా అవతరిస్తాడు’ అని స్వామి అభయం ఇచ్చారు. మేనమామ, అనంతర కాలంలో రామానుజకు గురువు శ్రీశైల పూర్ణులు (పెరియ తిరుమలైనంబి) మేనల్లుని శిరస్సు చుట్టూ దివ్యంగా వెలుగుతున్న కాంతిమండలాన్ని గమనించి, సర్వ శుభలక్షణ లక్షితుడిగా గుర్తించి లక్ష్మణాచార్యులు అని నామకరణం చేశారు. శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడే కలియుగంలో కేశవాచార్య సుతుడిగా అవతరించారన్నభావనతో ‘రామానుజ’ అని సంభావించారు. భవిష్యత్తులో ద్రవిడ దేశంలోని కావేరి, తామ్రపర్ణీ నదీ ప్రాంతంలో ఒక దివ్యపురుషుడు అవతరిస్తారని ఒకప్పుడు నమ్మాళ్వార్ యోగసమాధిలో చేసిన అనుసంధాన పాశురం (తిరువాయ్ మొళి), ‘శుభం… శుభం…’ (పొలిగె) అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ బాలుడి గురించే కావచ్చని శ్రీశైల పూర్ణులకు స్ఫురించిందట.

అపూర్వ తేజోరాశి ఈ బాలుడు సామాన్యుడు కాడని, అతని ద్వారా ఎన్నో ఘన, ఉత్తమ కార్యాలు జరగవలసి ఉందని, ఆయన హిందూ ధర్మ పరిరక్షణకు చుక్కానిగా నిలుస్తారని శ్రీశైల పూర్ణులు ఊహించారు.
విశాలమైన ఎత్తైన నుదురు, కోటేరు ముక్కు, పొడుగాటి చెవులు, శంఖం మాదిరిగా తీర్చిదిద్దిన మూడు రేఖలు కలిగిన కంఠం, విశాలమైన వక్షస్థలంతో వెలుగొందుతున్న ఆ బాలుడు శేషుడో లేక విష్వక్సేనుడో అయి ఉంటాడని జ్ఞానవృద్ధులు భావించారు. తమ ఇంటనే పుత్రుడు జన్మించాడన్నంత ఆనందంతో స్థానికులు బారసాల వేడుకను జరుపుకున్నారు. బ్రాహ్మణులకు భూరి దక్షిణలు, ధనధాన్యాదులు బహూకరించడంతో పాటు పురవాసులను యథోచిత సత్కారాలతో తృప్తిపరిచారు రామానుజుల తల్లిదండ్రులు. శ్రీరామచంద్రుని అవతరణతో అయోధ్య, శ్రీకృష్ణుడి వల్ల మథురలా రామానుజుల ఉదయించడంతో శ్రీభూతపురి తరించిందని సాక్షాత్తు కంచి వరదరాజస్వామి పెరుమాళ్ అనంతర కాలంలో స్తుతించారు.


యామునాచార్యుల మన్ననలు
నమ్మాళ్వార్ మొదలు పన్నెండు మంది ఆళ్వారులు విష్ణుభక్తిని పాదుకొల్పేందుకు పాటు పడగా, వారి తర్వాత యామునాచార్యులు విశిష్టాద్వైత ప్రతిష్ఠాపనలో జగదేక గురువుగా నిలిచారు. అంతటి ఆచార్యుల విశేష మన్ననలు అందుకున్న వారు రామానుజులు. ‘భవి¬ష్యదాచార్యులు’గా భావించిన ఆయనను భౌతికంగా చేరదీసి ఆశీస్సులు అందించకుండానే యామునల వారు పరమపదం (1042) చేరారు.
అనంతుడు రామానుజుల రూపంతో భువిపై కాలుమోపగానే కలిపురుషుడు భీతుడై పలాయనం చిత్తగించాడని, ధర్మదేవత స్వేచ్ఛగా విహరింపగలిగాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. కనుకనే,‘గతులన్ని ఖిలమైన కలియుగ మందును…గతి ఈతడే చూపె ఘన గురుదైవము’అని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు కీర్తించారు.


విద్య-కంచికి పయనం
ఏడవ ఏట ఉపనయన సంస్కారం పొందిన రామాజనులు తండ్రి వద్ద విద్యాభ్యాసం చేశారు. కుశాగ్ర బుద్ధిగల ఆయన విద్యలన్నింటిలో పుంభావసరస్వతియై ప్రకాశించసాగారు. పదహారవ ఏట తంజమాంబతో గృహస్థాశ్రమం స్వీకరించిన కొద్ది రోజులకే తండ్రి పరమపదం చేరారు. పితృవియోగాన్ని ఆయన నిగ్రహించుకున్నారు. మాతాసతులతో స్వస్థలంలోనే కొంతకాలం ఉండి కుటుంబ పోషణతో పాటు విజ్ఞాన తృష్ణతో (వేదాంతశాస్త్ర జ్ఞానం పొందేందుకు) యాదవ ప్రకాశకుల వద్ద శుశ్రూషకు కుటుంబాన్ని కంచికి తరలించారు. యాదవ ప్రకాశకులు మంత్రశాస్త్ర ప్రవీణులు,వేదాంత విద్యా పారగంతులు. వేదాంత చర్చలో ఆయన అజేయులు. వారి వద్ద పెద్ద సంఖ్యలో శిష్యులు ఉన్నారు. ప్రకాశకుల శిష్యుడిగా చేరిన రామానుజులను పినతల్లి ద్యుతిమతి కుమారుడు గోవిందుడూ అనుసరించారు.
‘శేషావతార రూపమశేష
జనౌఘాఘహరణ చరణాబ్జమ్
శ్రీభాష్యకార మమలం
కలయే రామానుజం కృపాసింధుమ్’
(సముద్రమంతటి అపారకరుణతో అశేష జనుల పాపహరణానికి ఆదిశేషువే కలిలో రామానుజులుగా,భాష్యకారులుగా అవతరించారు. ఆయన చరణాల విందాలకు నమస్కరిస్తున్నాను)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...

Time stopped in Bihar: Who will shut their show?

(Dr Pentapati Pullarao) No one can stop the Sun’s journey...

నన్ను పరిశోధన జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి

(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)  దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్...

స్వర యోగి త్యాగరాజు

నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత...