ప్రవచించేది శాంతి వచనం…చేసేది అధర్మ
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు
అంతర్జాతీయ బీమా కంపెనీలకు బీజేపీ నేతలు బ్రోకర్లు
కేంద్రానికి సిగ్గూ శరం లేవు
బీజేపీ పాలనను చూస్తూ ఊరుకోం
ఆర్బిట్రేషన్ సెంటర్ చూసి మోడీకి నిద్ర పట్టడం లేదు
జోక్ ఆఫ్ ది మిలీనియం నదుల అనుసంధానం
హైదరాబాద్, ఫిబ్రవరి 1: తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా దారుణంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆయన విమర్శలు ఆయన మాటల్లోనే… నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో శాంతిపర్వంలోని శ్లోకాన్ని ఉటంకించారు. భీష్మాచార్యులు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకు సందేశం ఇస్తూ ఈ శ్లోకం చెప్పారు. పూజలు చేసినప్పుడు శాంతి మంత్రం చెబుతారు. లోక హితాన్ని చెబుతూ ముగిస్తారు. స్వస్తి ప్రజాభ్యాం… లాంటిదే ఇది కూడా.రాజ్యాన్ని రాజు ఎలా పరిపాలించారో శ్లోకంలో చెప్పారు. చెప్పింది శాంతిపర్వంలో శ్లోకం… ప్రవచించింది అధర్మం, అసత్యం అని కేసీఆర్ అన్నారు. దేశ ప్రజలను మంత్రి వంచించారు. కల్ల డొల్ల, గోల్‌మాల్ గోవిందం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరగింది. ఆమె 30కోట్లని చెప్పారు. వీరికి 12800కోట్లు కేటాయించారు. ఇంతకు మించి సిగ్గూ శరం ఉండదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌కు 33వేల 600కోట్లు కేటాయించాం. దేశంలో కేటాయించిన డబ్బు మా రాష్ట్రంలో కేటాయించినంత లేకపోవడం దారుణమన్నారు.
పేదలకు బడ్జెట్‌లో కేటాయింపులు గుండు సున్న అన్నారు. ఎంతోమంది రైతులు చనిపోయిన తరవాత వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటూ ప్రధాని క్షమాపణ చెప్పారు. రైతులు ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేదు. ఎరువుల మీద సబ్సిడీ 35వేల కోట్లు తగ్గించారు. ఉపాధి హామీ పథకంలో కూడా 25వేల కోట్లు కోత పెట్టారు. 98వేల కోట్ల నుంచి 73 వేల కోట్లకు తగ్గించారు. రైతులపై మోడీకి ఉన్న ప్రేమ ఇది. యూరియాపై 12,700కోట్లు సబ్సిడీ తగ్గించారు. నిర్మల సీతారామన్ ఆత్మవంచన చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదు. కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైందనీ, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. గుజరాత్‌లో మోడీ ఏదో పొడిచేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు.
దొంగ ప్రచారంతో గుజరాత్ మోడల్‌ను చూపారు. పైన పటారం లోన లొటారం…అన్నారు. అది చూసి, మోడీ ఏదో ఉద్దరిస్తారని ప్రజలు పట్టం కట్టారు. ఎనిమిదేళ్ళలోఆయన బండారం బయటపడింది. దళితులకు, పేదలకు మొండిచేయి, ఉపాధి నిదులు కట్… తప్ప ఏమీ లేదు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గంగా నదిలో శవాలు తేలేలా చేసింది. అంత దరిద్రపు గొట్టు ప్రభుత్వమిది. కేంద్రం అవలంబించే పవర్‌పాలసీ అత్యంత దుర్మార్గమైంది. కరోనాతో దేశం అంతా అతలాకుతలమైంది మిడతల దండును తట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలే మిడతల దండును చంపేయడంతో మనకి ముప్పు తప్పింది. మిడతలు 8 లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నాయి. వాటికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు అవి విజృభించి, మనుషుల్ని చంపుతాయన్నారు. వైరస్‌లను తట్టుకోవడానికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను తట్టుకోవడానికి 12 వేల కోట్లతో అధునాతనమైన ఆస్పత్రులు నిర్మించామన్నారు. అన్నీ ఆక్సిజన్ బెడ్స్‌చేశామన్నారు. ఇది సన్నద్ధత… ప్రజలను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నమిది.
మన ఆర్థిక మంత్రి గారు ఆరోగ్య విభాగంపై కేటాయింపులు ఒక్కపైసా పెంచలేదు. సాంఘిక సంక్షేమం లేదు, ప్రజా సంక్షేమం లేదు, మరి ఎక్కడికి పోతున్నాయి ఈ నిధులన్నీ. షావుకార్ల జేబులు నింపే ప్రయత్నం చేస్తోందీ కేంద్ర ప్రభుత్వం. ప్రజలలో మత పిచ్చి రెచ్చగొట్టి, ఓట్లు కొల్లగొట్టాలనేదే బీజేపీ ద్యేయం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత స్థానం అధ్వానంగా ఉంది. మన స్థానం 101. ఘనత వహించిన మోడీ గారి ప్రభుత్వం సాధించిన ఘనత ఇది. ఆహార సబ్సిడీని కూడా తగ్గించారు. ఎంఎస్‌పీ బిల్లు ప్రస్తావన లేని బడ్జెట్ ఇదొక్కటే.
ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు మోడీ గారు అని ప్రశ్నించారు. నిస్సిగ్గుగా ఎయిర్ ఇండియాను అమ్మేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారు…కానీ రెట్టింపయ్యింది పెట్టుబడులు అని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్ళలో మోడీ అన్ని రంగాల్లో విఫలమయ్యారు. దేశాన్ని ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఒక అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్పి నిజం చేస్తోంది. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయడం లేదు. బీజేపీని కూకటివేళ్ళతో పెకిలించిపారేస్తాం. నోరుమూసుకుని మీ దుర్మార్గాలను చూస్తూ పడి ఉంటామనుకున్నారా? పరిశ్రమల రంగం పెరుగుతోంది. ఐటీ రంగం పెరుగుతోంది. ఈ క్రమంలో సంస్థల మద్య గొడవలూ పెరుగుతాయి.
కోర్టు బయట పంచాయతీలు ఉన్నాయి. దేశాన్ని అమ్ముడే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ దగ్గర ఒర్లుడు తప్ప విషయం లేదు. అంతర్జాతీయ బీమా కంపెనీలకు బీజేపీ నేతలు బ్రోకర్లుగా మారారు. బ్లాక్ మనీ గాళ్ళను బయటకు పంపిది బీజేపీయే. ఈ దరిద్రగొట్టు పార్టీని కూకటివేళ్ళతో పెకిలించి పారేస్తాం. మోడీ దేశానికి కాదు…గుజరాత్‌కే ప్రధాని. చాలా బాధతో ఈ విషయం చెబుతున్నా. ప్రధాని మోదీది చాలా కురచ బుద్ది. దేశంలో ఆర్బిట్రేషన్ సెంటరే లేదు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేయడంతో మోడీకి నిద్ర పట్టడం లేదు. ఏం చేయలేక అహ్మదాబాద్‌లో మరో అర్బిట్రేషన్ సెంటర్‌పెడతామని ప్రకటించారు. క్రిప్టో కరెన్సీ మీద 30శాతం పన్నా? చట్టబద్ధం చేయడం మాని పన్ను వేస్తారా? బబుర్ర ఉండే చేస్తారా?
నదుల అనుసంధానం ఏమిటి… ఇదేం నిర్ణయం. గోదావరి నదిపై ట్రిబ్యునల్ తీర్పు ఉంది. తెలుగు రాష్ట్రాలకే ఆ జలాలపై హక్కుందనేదే ఆ తీర్పు. మా నీళ్ళను మాకు అందకుండా చేస్తావా? ఏ అధికారంతో నదుల్ని కలుపుతావు. ఇది సెన్స్‌లెస్ నిర్ణయం కాదా… మా రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలను దాచుకుని అనుసంధానం చేస్తావా! అనుసంధానానికి ప్రాతిపదిక ఏది అని ప్రశ్నిస్తున్నాను. నదుల అనుసంధానం మిలీనియం బిగ్ జోక్. జల్ శక్తి మిషన్‌కు 60వేలు కోట్లు పెట్టారట. తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనాభాకు మిషన్ భగీరథకు 40వేల కోట్లు పెట్టాం. ఇవన్నీ మాని శాంతిపర్వంలో శ్లోకాలు చెబుతారా? అవి చదవడానికి మీ మనసెలా ఒప్పింది అని అడుగుతున్నా. దేశానికి పుట్టిన కుక్కమూతి పిందె మీరు. బీజేపీ వాళ్ళు దొంగలు. వీళ్ళని కూకటి వేళ్ళతో లేపి పారేయాలని ఆవేశంగా వ్యాఖ్యానించారు.