ఇది ర‌జ‌నీ ఆకాశ‌వాణి

Date:

దిగ్దంతుల‌తో కార్య‌క్ర‌మాలు
మ‌రుపురాని మ‌ధుర క్ష‌ణాలు
భ‌క్తి రంజ‌ని ఓ హైలైట్‌
ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌కు పెట్టింది పేరు
జ‌న‌వ‌రి 29 బాలాంత్ర‌పు వారి జయంతి
(వైజ‌యంతి పురాణ‌పండ‌)
ఆకాశ‌వాణి, విజ‌య‌వాడ కేంద్రం అన‌గానే మొద‌ట గుర్తొచ్చే పేరు బాలాంత్ర‌పు ర‌జ‌నీకాంత‌రావు. ఆయ‌న ప్ర‌వేశం త‌ర‌వాత ఆ కేంద్రం కొత్త పుంత‌లు తొక్కింది. భ‌క్తి సంగీతంలో ఎన్నో వేల మెట్లు పైకి ఎక్కింది. ఆయ‌న రూపొందించ‌ని కార్య‌క్ర‌మం లేదు. సృజించ‌ని ప్రొగ్రామ్ లేదు. అన్ని విభాగాల్లోనూ ఆయ‌న ముద్ర సుస్ప‌ష్టం. అనిర్వ‌చ‌నీయం. అద్వితీయం. నిరూప‌మానం. ఇంకా ఎన్ని ప‌దాలున్నాయో అన్ని ప‌దాలూ అన్వ‌యించుకోవ‌చ్చు. ఆయ‌న ప్ర‌తిభ‌ను కొల‌వ‌డానికి కొల‌మానం లేదు.


ఇది రజనీ విజయం…
ఆకాశవాణి ద్వారా శ్రోతలను భక్తిరంజని కార్యక్రమంతో ఓలలాడించిన వైతాళికుడు ఆయ‌న‌.
సంగీతం ద్వారా భూగోళశాస్త్ర పాఠాన్ని వీనులవిందుగా వినిపించిన ప్రతిభామూర్తి ఆయ‌న‌.
పిపీలికాది బ్రహ్మ పర్యంతాలను తన సంగీత నైపుణ్యంతో జన సామాన్యానికి చేరువ చేసిన సంగీతమూర్తి…
తెలుగు సినిమాలకు… సంగీత, సాహిత్యాలను సమకూర్చిన వాగ్గేయకారులు…
ఘంటసాల, బాలమురళి, భానుమతి, బాలసరస్వతి, చిట్టిబాబు (వీణ) వంటి వారిని ఆకాశవాణికి పరిచయం చేసిన రసహృదయులు…
తండ్రి నుంచి సాహిత్యాన్ని, గురువు మందా కృష్ణమూర్తి నుండి సంగీతాన్ని ఔపోసన పట్టిన సరస్వతీ పుత్రులు…. సుమారు ఏడు దశాబ్దాలకు పైగా కళాసేవ చేసిన కళాపిపాసి…


జ‌న‌వ‌రి 29 బాలాంత్రపు రజనీకాంతరావు జయంతి…
2014లో ఆయ‌న ఈ వ్యాస ర‌చ‌యితకు ఇచ్చిన ముఖాముఖి ఇది.


రేడియో డైరెక్ట‌ర్ కావ‌డం దేవుడిచ్చిన వ‌రం
నేను రేడియో డైరెక్టరుని కావడం దేవుడు ఇచ్చిన వరంగా భావించాను. ఆకాశవాణికి ప్రత్యేకత తీసుకొచ్చాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి చేత రేడియో కోసం ఎన్నో గేయాలు, రూపకాలు రాయించాను. ఉదయం రేడియో పెట్టగానే వారి మనస్సుకి ఆహ్లాదం కలిగించేలా భక్తిరంజని కార్యక్రమం రూపొందించాను. ఎందరో సంగీతకారుల చేత స్తోత్రాలు, భక్తిగేయాలకు సంగీతం చేయించాను. నేను కూడా స్వయంగా అనేక భక్తి గీతాలను స్వరపరిచాను. శ్రోతలకు సంస్కృతంలోని మాధుర్యాన్ని అందచేయాలనే సత్సంకల్పంతో ‘సంస్కృత పాఠం’ కార్యక్రమం ప్రారంభించాం. ఇవే కాకుండా… ఈ మాసపు పాట, పిల్లల కార్యక్రమం… ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రఖ్యాతి చెందడానికి దోహదపడ్డాను. ప్రముఖ సంగీతకారులు ‘ఓలేటి వెంకటేశ్వర్లు’ చేత సంగీత శిక్షణ కార్యక్రమం, ఉషశ్రీ ధర్మసందేహాలు కార్యక్రమం ఎంత ప్రసిద్ధి చెందాయో అందరికీ తెలిసిందే. ఆకాశవాణికి ఉషశ్రీని కలవడానికి ఎంతో మంది వస్తుంటే, నా ఉద్యోగికి ఇంత పేరుప్రఖ్యాతులు రావడం నాకు సంతోషం కలిగించింది. నా దగ్గర పనిచేసే వారికి అవార్డులు వస్తే సంబరపడ్డాను.


విశ్వనాథను మరచిపోలేను…
జపాన్‌ రేడియో వారు ‘పిల్లలకి జాగ్రఫీ ఎలా బోధించాలి’ అనే అంశంపై పోటీ నిర్వహించినప్పుడు… నేను నదీ ప్రవాహం అంశంగా గోదావరి పుట్టుక నుంచి అది సముద్రంలో కలిసేవరకు ప్రవహించే మార్గాన్ని, పరిసరాలను స్పృశిస్తూ ఒక రూపకం చేశాను. అందులో… పిల్లలు గోదావరిలో తొంగిచూసి ‘నువ్వు మా అమ్మవి’ అని పలికినప్పుడు, ఆ నది పరవశించిపోయిన సందర్భంలో, ‘ఉప్పొంగిపోయింది గోదావరి’ అంటూ బాపిబావ (అడవి బాపిరాజు) పాటను వాడాను. అలాగే విశ్వనాథ కిన్నెరసాని పాటలు, ఇంకా ‘పాపికొండల నడుమ నేను’ లాంటి పాటలతో ఈ రూపకం రూపొందించాను. మొదటి బహుమతి వచ్చింది. పారితోషికంగా 33 వేల యెన్స్‌ (జపాన్‌ కరెన్సీ) ఇచ్చారు. నేను సింహభాగం తీసుకుని, మిగతాది, అందులోని వారందరికీ పంచేశాను. అది చూసి కవిసమ్రాట్, ‘మా రచనలు ఉపయోగించుకున్నందుకు నిజానికి మాకు ఇవ్వక్కర్లేదు. కాని మీరు ఇచ్చారు. సంతోషంగా ఉంది…’ అని ఆనందబాష్పాలతో నన్ను అభినందించారు. విశ్వనాథ అంతటివారు అలా మాట్లాడటం నేను ఎన్నటికీ మర్చిపోలేను.


పదాలలో సంగీతం ఉంది…
ఆ తరవాత ‘ఆదికావ్యావతరణం’ పేరుతో స్వరచిత్రం రూపొందించాను. వాల్మీకి రామాయణంలోని మొదటి శ్లోకమైన ‘మా నిషాద ప్రతిష్ఠాం…’ లోని అక్షరాల్లో స్వరాలున్నాయని గమనించాను. స్వరాల ప్రకారం సంగీతం సమకూరిస్తే ఉచ్చారణ సరిగ్గా వస్తుందని ప్రముఖ సంగీతవిద్వాంసులు శ్రీఓలేటి వెంకటేశ్వర్లుతో చేయించాను. పదాలలో సంగీతం ఉందని మొట్టమొదట నేనే చెప్పాను. వాద్యగోష్ఠితో కలిసి క్రౌంచమిథునాలకి సంబంధించిన రిహార్సల్స్‌ ఒక చెట్టు కింద రాత్రి దాకా సాధన చేశాం. ప్రముఖ వయొలిన్‌ విద్వాంసులు శ్రీనల్లాన్‌చక్రవర్తుల కృష్ణమాచారి చేత వయొలిన్‌ మీద ‘మా…సా…’ అంటూ స్వరాలలో పక్షుల శబ్దాలను పలికించే ప్రయత్నం చేస్తున్నాను. అదేమి దైవఘటనో తెలియదు గాని, సరిగ్గా అదే సమయానికి చెట్టు మీది పక్షులన్నీ మేం చెప్పినట్టుగా శబ్దాలు చెయ్యడం ప్రారంభించాయి. అందరికీ ఒళ్లు పులకరించింది. అదొక మధురానుభూతి.
(జనవరి 29, 1920 రజనీ జన్మదినం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నన్ను పరిశోధన జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి

(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)  దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్...

స్వర యోగి త్యాగరాజు

నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత...

Most Important exponents of Vaishnava tradition

Today is the 1007th birth anniversary of Ramanujacharya Why returns...

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...