జూన్ 2 నాటికి టిమ్స్‌లు పూర్తి స్థాయి సేవ‌లందించాలి

0
52
  • ఏడాదిలో ఉస్మానియా సేవ‌లు ప్ర‌జ‌ల‌కు అందాలి
  • మూడు టిమ్స్‌ల‌కు ఏకీకృత నియామ‌కాలు
  • నిమ్స్‌… టిమ్స్‌ల మ‌ధ్య స‌మన్వ‌యం ఉండాలి
  • వైద్యులు, సిబ్బంది నియామ‌క ప్ర‌క్రియ వేగ‌వంతం చేయండి
  • వైద్య, ఆరోగ్య శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, నవంబర్ 12: వ‌చ్చే జూన్ 2వ తేదీ నాటికి అల్వాల్‌, ఎల్ బీ న‌గ‌ర్ టిమ్స్‌లు, వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి, నిమ్స్ విస్త‌ర‌ణ ప‌నులు పూర్తి కావాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వ‌చ్చే ఏడాది డిసెంబ‌రు నాటికి ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి ప‌నులు పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించేలా చూడాల‌న్నారు. వైద్య, ఆరోగ్య శాఖ‌పై ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. టిమ్స్‌, వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి, నిమ్స్ విస్త‌ర‌ణ‌, ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రుల నిర్మాణ ప‌నులు, ఆయా ఆసుప‌త్రులకు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామ‌కాలు ఏక‌కాలంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్స కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా సీఎం గుర్తు చేశారు. మూడేళ్ల‌లోనే 9 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామ‌న్నారు.

స‌న‌త్ న‌గ‌ర్‌, అల్వాల్‌, ఎల్‌బీ న‌గ‌ర్ టిమ్స్‌ల్లో వైద్యులు, ఇత‌ర సిబ్బంది నియామ‌కాల‌కు సంబంధించి ఏకీకృత విధానం పాటించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా మూడు టిమ్స్ మధ్య వైద్యులు, సిబ్బంది బదిలీలు జరిగేలా ఉండాలన్నారు. ఆసుపత్రుల నిర్వహణ, హౌస్ కీపింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో చేపట్టాలని సీఎం సూచించారు. టిమ్స్ ల పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హౌస్ కీపింగ్ సిబ్బందిపై పర్యవేక్షణకు విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామన్నారు. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలకు వేరే సిబ్బంది ఉంటే, వైద్యులు పూర్తిగా వైద్య సేవలపైనే దృష్టి సారించే అవ‌కాశం ఉంటుంద‌ని సీఎం అన్నారు.

నిమ్స్ లో శ‌స్త్రచికిత్స‌ల‌కు స‌మ‌యం ఎక్కువ తీసుకుంటున్నందున స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిమ్స్‌లో బెడ్స్ లేక‌పోయినా, శ‌స్త్రచికిత్స‌ల‌కు ఆల‌స్య‌మైనా స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్‌ను వినియోగించుకోవాల‌న్నారు. ఈ విష‌యంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, నిమ్స్‌, టిమ్స్ డైరెక్ట‌ర్లు నిత్యం స‌మ‌న్వయం చేసుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. టిమ్స్ లో వైద్యుల నియామ‌కం పూర్త‌య్యే వ‌ర‌కు బ‌య‌టి నుంచి వైద్యులను నియమించుకోవాల‌ని, అందుకు అవ‌స‌ర‌మ‌య్యే మొత్తాన్ని వెంట‌నే విడుద‌ల చేస్తామ‌ని సీఎం తెలిపారు. వైద్యులు, సిబ్బంది నియామ‌క ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని సీఎం ఆదేశించారు. తాము అధికారంలోకి వ‌చ్చాక కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామ‌ని సీఎం తెలిపారు. నిర్మాణంలో ఉన్న‌మరో 79 డయాలసిస్ సెంటర్ల ప‌నులు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల‌ని సీఎం ఆదేశించారు.

టిమ్స్ తో పాటు బోధ‌న క‌ళాశాల‌లు, న‌ర్సింగ్ క‌ళాశాల‌ల ప‌నులు, ప‌రిక‌రాల కొనుగోలు ప్ర‌క్రియ ఏక‌కాలంలో పూర్త‌వ్వాల‌ని, అందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించుకొని అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వ ఆసుప్ర‌తుల్లో వైద్యులు, సిబ్బంది హాజ‌రైన స‌మ‌యం, విధుల నుంచి వెళ్లే స‌మ‌యాన్ని న‌మోదు చేయాల‌ని, హాజ‌రు విష‌యంలో బ‌యోమెట్రిక్ విధానం అమ‌ల‌య్యేలా చూడాల‌ని, ఏఐతో ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సీఎం శాఖాధికారుల‌ను ఆదేశించారు.

మూడేళ్ల‌లోనే ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచిన విష‌యాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ల (OP) సంఖ్య 7 కోట్ల నుంచి 9 కోట్లకు పెర‌గ‌డం, ఇన్ పేషెంట్ల (IP) సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెర‌గ‌డంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి గ‌తంలో సగటున 3.9 శాతం కేటాయించగా, గత మూడేళ్లుగా సగటున 4.8 శాతం నిధులు కేటాయిస్తున్న విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. మూడేళ్ల‌లోనే వైద్యులు, న‌ర్సులు, ఏఎన్ఎంలు, పారా మెడిక‌ల్ సిబ్బంది క‌లిపి 13,401 నియామ‌కాలు పూర్తి చేశామ‌ని సీఎం తెలిపారు. మ‌రో 5,640 నియామ‌కాల ప్ర‌క్రియ కొనసాగుతోంద‌న్నారు. ప్ర‌జారోగ్యానికి పెద్ద పీట వేసే క్ర‌మంలో వైద్యారోగ్య శాఖ‌కు అవ‌స‌ర‌మైన నిధులును ఎంత మొత్త‌మైనా విడుల చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. స‌మీక్ష‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి, సీఎం కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, వైద్య‌, ఆరోగ్య శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ క్రిస్టినా జోంగ్తూ, టీజీఎంఎస్ఐడీసీ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌, వైద్య‌, ఆరోగ్య శాఖ క‌మిష‌న‌ర్ ముష్ర‌ఫ్‌ అలీ ఫ‌రూఖీ, ఆర్ అండ్ బీ కార్య‌ద‌ర్శి ఇలంబ‌రితి, నిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రాహుల్ దేవ‌రాజ్‌, టిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ న‌రేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here