మనసుకు హత్తుకున్న సంభాషణలు
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
ఒక కథని దృశ్య కావ్యంగా మలచడం ఒక కళ. అందుకు ఎంతో కసరత్తు అవసరం. ఊహించి రాసుకున్న కథని చిత్రీకరించడానికి కొంతమేర అవగాహన ఉంటే చాలు. అందరూ చదివిన, అందరికీ బాగా సుపరిచితమైన కథని షార్ట్ ఫిలింగా రూపొందించడం ఒక సవాలు. అది కూడా ఒక పేరెన్నికగన్న రచయిత కథ అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అంటూ అందమైన భావనను సృజన చేసిన బాలగంగాధర్ తిలక్ రచనను తెరకు ఎక్కించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్క్రీన్ ప్లే ఇందులో కీలకపాత్ర వహించింది.

తిలక్ కథ నల్లజర్ల రోడ్డు వెన్నెల్లో ఆడపిల్లలాంటి అక్షరాలైతే… దీనిని వర ముళ్ళపూడి వెండితెరపై నటులతో నటన పేరుతో ఆరబోయించారు. ఇక్కడ ముళ్ళపూడి వెంకట రమణ గారితో ఒక పోలిక చెప్పాలి.

ఆయన అక్షరాలను ఆయుధాలుగా చేసుకుని హాస్యాన్ని సృష్టిస్తే… ఆయన కుమారుడు వర స్క్రీన్ ప్లే ను సమర్ధంగా వినియోగించుకుని దర్శకత్వ ప్రతిభను విరబూయించారు. కథలో వివరించిన మానవ నైజాన్ని చక్కగా చూపించారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరాక ఒకలాగా మనుషులు మారిపోతారని చెప్పిన తిలక్ కథ నల్లజర్ల రోడ్డు.

ఇందులో పులి దృశ్యం చాలా సహజంగా వచ్చింది. 1965 ప్రాంతంలో రాత్రిపూట ప్రయాణం ఎలా ఉండేదో చక్కగా చూపించారు. నా గుడిసెలోకి పాములు రావు… ఎందుకంటే ముగ్గు వేసి మంత్రం వేశాను కాబట్టి.. పాముల్లాంటి మనుషులు మాత్రం వస్తారు అన్న డైలాగ్ పాత్రల ప్రవర్తనను ఉద్దేశించి చేసినట్టే అనిపించింది. వాస్తవ కథనాల ఆధారంగా తీసే ఎపిసోడ్లు చూసిన మనకి, ఇప్పుడు తిలక్ కథలోని మానవ నైజాన్ని చక్కగా చిత్రీకరించారు.
మహాదేవ్, యశోర, సమ్మెట గాంధీల నటన ఆకట్టుకుంది. రాజీవ్ కనకాల, గిరిధర్ నటన అక్కడక్కడా తేలిపోయినప్పటికీ, మొత్తం మీద బాగుంది. తిలక్ అక్షరాలను సుమ మరింత ప్రభావశీలంగా స్వరబద్ధం చేసిఉంటే ఇంకా బాగుండేది. దసరా సందర్భంగా చక్కని ఎపిసోడ్ ను ఆకట్టుకునే సంభాషణలతోనూ, స్క్రీన్ ప్లే తోనూ కథాసుధలో అందించిన దర్శకుడికి అభినందనలు చెప్పకుండా ఉండలేము.
https://www.instagram.com/reel/Dd75QQnuffH/?stkn=NjFhOGMzYTE3ZQ==


