గణ తంత్రం – నాయకుల మంత్రం
కొలువు తీరిన ప్రధానులు – సాధించిన ఘనతలు
దేశాభివృద్ధికి బాటలు వేసిన మహామహులు
నాటి నెహ్రూ నుంచి నేటి మోడీ వరకూ
(వైజయంతి పురాణపండ, 8008551232)
గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి స్వయంగా మువ్వన్నెల పతాకను ఎర్ర కోట మీద రెపరెపలాడిస్తారు. కాని ఈసారి ఎందుకని ఇంతమంది ప్రధానమంత్రులు ఇక్కడ కొలువు తీరారు.
అందుకు కారణం లేకపోలేదు.
అందరికీ ఆహ్వానం అందింది.
వారికే ఆశ్చర్యంగా ఉంది.
మనల్నందరినీ ఎందుకు ఇక్కడ సమావేశపరిచారు, అసలు ఈ సంవత్సరం మనల్నిఎందుకు ఆహ్వానించారు. అసలు మనకు ఆ ఆహ్వానం పంపింది ఎవరో తెలియట్లేదు అనుకుంటూ వారిలో వారు చర్చలు జరుపుకుంటున్నారు.
అంతలోనే అటువైపుగా మొగలి రేకుల గుబాళింపును, పొగడ పుష్పాల పరిమళాన్ని, మల్లెల మాధుర్యాన్ని, జాజుల సువాసనను సన్నని మలయమారుతం పరవశంతో తీసుకువచ్చింది.
అందరూ ఒక్కసారిగా అటువైపు తమ తలలను తిప్పారు.
నెమ్మదిగా ఒక కాంతి పుంజం తమ వైపుకి వస్తున్నట్లు గమనించారు.
ఆ కాంతి పుంజం భారత పతాకలోని మువ్వన్నెలతో మేళవించిన వస్త్రాలు ధరించి రావటం గమనించారు.
అందరి కళ్లు విప్పారాయి.
అందరి గుండెలు జల్లుమన్నాయి.
అందరి హృదయాలు ఆనందబాష్పాలతో తడిసిపోయాయి.
వారికి తెలియకుండా వారి చేతులు రెండూ ఒక్కటయ్యాయి.
అందరి గొంతులు ఒకేసారిగా..
తల్లీ ప్రణామాలు. మాతా వందనాలు…
అని పలికాయి.
వచ్చింది ఎవరో కాదు..
భరతమాత…
తన బిడ్డలను ఆశీర్వదించడానికి అక్కడకు వచ్చింది.
ఇందులో కొందరు ప్రధానులు ఇప్పటికే పుణ్యలోకాలకు చేరినప్పటికీ, ఆ తల్లికి మాత్రం అందరూ తన సమక్షంలో ఉన్న భావనే.
అందుకే అందరినీ ఒకసారి చూడాలనిపించి, అందరికీ లేఖలు పంపింది భరతమాత.
అందరినీ తన చుట్టూ కూర్చోపెట్టుకుంది.
కమ్మటి వెన్నతో కలిపిన సంపూర్ణ ఆహారాన్ని అందరికీ తినిపించింది.
అందరూ తనకు పసిపిల్లలే కనుక గోరుముద్దలే తినిపిస్తూ, పొంగిపోతోంది భరతమాత.
భారత తొలి ప్రధాని నెహ్రూ…
అమ్మా! ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఈ సంవత్సరం అందునా గణతంత్ర దినోత్సవం నాడు మమ్మల్ని ఎందుకు సమావేశపరిచావు… అంటూ తల్లి దగ్గర గారాలుపోతూ అడిగారు.
ఏం లేదు నాయనా! ఈ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుతున్నారు కదా.
నన్ను బంధవిముక్తి రాలిని చేయటానికి ఆ రోజుల్లో నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. మొట్టమొదటి ప్రధానిగా 17 సంవత్సరాల పాటు ఎంత చక్కటి పరిపాలన అందించావో నేను కళ్లారా చూసి పరవశించిపోయాను. నా కష్టాలు స్వయంగా చూసిన నీకు, నన్ను ఏ విధంగా కాపాడుకోవాలో తెలిసిన మనసుతో సుపరిపాలన అందించావు.. అని ఆ తల్లి నెహ్రూను ముద్దాడుతుంటే…
అమ్మా! నా మీద ఎన్నో నిందారోపణలు ఉన్నాయి కదా, నన్ను నువ్వు ఇలా ప్రశంసిస్తున్నావెందుకు? అంటూ అమాయకంగా తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
తల్లికి బిడ్డలు చేసిన మంచి పనులే కనిపిస్తాయి, వారిలోని చెడును వీలైనంతవరకు పక్కకు నెట్టేయడానికే ప్రయత్నిస్తుంది. నువ్వు కూడా సాధారణ మానవుడివే కనుక, తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటావు. కాని భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసి, పరిపాలన సులభం చేశావు. పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి ఆర్థిక సంస్కరణలు చేశావు. ఇది చాలదా నేను సంపన్నంగా ఉండటానికి… అంటూ నెహ్రూ చేసిన మంచిని మాత్రమే ప్రస్తావించింది.
త్రివిక్రముడు లాల్ బహదూర్
అంతలోనే అందరికంటె పొట్టిగా ఉన్న చిరునవ్వుల లాల్ బహదూర్ శాస్త్రిని ఒళ్లోకి తీసుకుని, నువ్వు త్రివిక్రముడివి నాయనా! అంటుంటే…
ముసిముసిగా నవ్వుతూ…
అమ్మా నేను ఏం చేశానమ్మా నీ కోసం… అంటూ సందేహంగా ప్రశ్నించాడు.
జైజవాన్ జైకిసాన్ నినాదం తీసుకొచ్చావు.
పాల ఉత్పత్తి పెరగటం కోసం శ్వేత విప్లవం ప్రవేశపెట్టావు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని హరితవిప్లవం కూడా చేశావు. 1965లో నా మీదకు పాక్ సైన్యం వచ్చి యుద్ధం చేస్తున్న సమయంలో దేశాన్ని ఎంతో జాగ్రత్తగా నడిపించావు. నీ మరణానంతరం నువ్వు భారతరత్నవు అయ్యావు.. అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుంది.
గుల్జారీలాల్, మొరార్జీ దేశాయ్
అంతలోనే గుల్జారీలాల్ నందా తల్లి దగ్గరకు వస్తూ, అమ్మా నేనేం చేశానని నాకు ఈ గౌరవం ఇస్తున్నావు అన్నారు.
నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వే కదా రెండుసార్లు గట్టెక్కించావు. అది ఎంతో అవసరం, నువ్వు వచ్చి ఉండకపోతే, ఈ దేశంలో అల్లకల్లలోలాలు వచ్చి ఉండేవి అంటూ మరింత ముద్దాడింది ఆయనను.
నిండు నూరేళ్లు బతికిన మురార్జీ దేశాయ్‌ని ఒడిలోకి తీసుకుంటుంటే… ఆయన సిగ్గుపడుతూ… నేనేం సాధించానమ్మా, ఎక్కువ కాలం పరిపాలించలేకపోయాను… అని దిగాలుగా పలుకుతుంటే… నా పొరుగుదేశాలైన చైనా, పాక్‌లతో స్నేహ సంబంధాలు పునరుద్ధరించావు. అంతేనా నా రక్షణ కోసం అణు వ్యవస్థను పటిష్టం చేశావు. నన్ను కంటికి రెప్పలా కాపాడటానికి నువ్వు వేసిన అడుగులు నేటికీ కొత్తవారికి మార్గదర్శకం అవుతున్నాయి.. అంటూ ఆశీర్వదించింది.
నవ ఇండియా రూపకర్త ఇందిర
పక్కనే నిలబడి అంతా తిలకిస్తున్న ఇందిరమ్మను తన పక్కనే కూర్చోబెట్టుకుని…
నువ్వు గరీబో హఠావో అన్నావు. అంతేనా ఆడమగ కూలీలకు సమాన వేతనం ఇవ్వాలన్నావు. ఎంత పని చేస్తే అంత పనికీ ఇద్దరికీ సమాన వేతనం అనే నీ సిద్ధాంతం ఎంతోమంచి చేసింది. అన్నిటికంటె ముఖ్యంగా బ్యాంకులను జాతీయం చేశావు. ఇది నువ్వు మాత్రమే చేయగలను అనిపించుకున్నావు. నన్ను పరిపాలించిన మొట్టమొదటి మహిళవు నువ్వే. మీ తండ్రి తరవాత అతి ఎక్కువకాలం అంటే పదహారు సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించావు. కాని ఏం లాభం నీ అంగరక్షకుల చేతిలో హతమయ్యావు. ఆ రోజు నేను ఎంతో విలపించాను తల్లీ. నన్ను పరిరక్షిస్తూ, నీ రక్షణ నువ్వు చూసుకోలేకపోయావనుకున్నాను.. అంటూ ఇందిరమ్మను కన్నీళ్లతో ముద్దాడింది భరతమాత.
సాంకేతిక విప్లవధారి రాజీవ్
తల్లి పక్కనే ఉన్న ముద్దుల తనయుడు రాజీవ్‌గాంధీని చూస్తూ, నువ్వు కూడా నీ తల్లిలాగే బలైపోయావు. సాంకేతిక విప్లవం తీసుకువచ్చి భారతదేశాన్ని ముందుకు నడిపించావు. నీకు ఎంతో భవిష్యత్తు ఉందనుకుంటుండగానే నీ సేవలు ముగించవలసిన పరిస్థితి వచ్చింది.. అంటూ మౌనంగా విలపించింది భరతమాత.
ఎంతోకొంత సేవ…
అక్కడే వరుసలో కూర్చున్న విపి. సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్‌లను చూస్తూ, మీరు తక్కువ కాలమే పరిపాలించినా, మీకు నాకు చేయగలిగినంత సేవ చేశారు. ఐదు సంవత్సరాలు నన్ను పరిపాలించాలంటే ఎన్నో కలిసిరావాలి. అవి కలిసివస్తే మీరు కూడా మరిన్ని మంచి పనులు చేసి ఉండేవారు… అంటూ వారిని ఓదార్చింది.
ఆర్థిక సంద్రాన్ని దాటించిన పీవీ
ఏ భావమూ లేకుండా, పెదవులు విరుచుకుని కూర్చున్న పి.వి.నరసింహారావును చూస్తూంటే… ఆయన బాధగా… అమ్మా నా మీద ఎన్నో నిందలు ఉన్నాయి అంటూ తల్లి దగ్గర నోరు విప్పాడు.
అవన్నీ రాజకీయాలలో సహజం నాయనా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నువ్వు తీసుకున్న ఆర్థిక సంస్కరణల నిర్ణయం నన్ను ఈ నాటికీ సంపన్నంగా ఉంచింది. నిన్ను ప్రపంచమంతా కొనియాడింది. నువ్వు నిస్వార్థంగా సేవ చేశావని నాకు తెలుసు. అదే ఈ రోజు నన్ను ప్రపంచ దేశాల మధ్య తలెత్తుకునేలా చేసిందని ఆర్థికవేత్తలందరూ చెబుతున్నారు. ఇదేదో నేను నిన్ను పొగడటం కాదు నాయనా… అంటూ ఆయనను ఆశీర్వదించింది.
వాణిజ్య విస్తృతి..విదేశీ సంబంధాల మిత్రుడు వాజపేయి..
పక్కనే కవితలు రాసుకుంటూ, చిరునవ్వులు చిందిస్తున్న వాజ్‌పేయ్‌ను చూస్తూ, రారా నా కన్నతండ్రీ! నువ్వు అణ్వాయుధ బలాన్ని పెంచావు, వ్యాపారం విస్తృతమయ్యేందుకు వీలుగా స్వర్ణ షడ్భుజి పేరున రహదారులను విస్తృతం చేసి అభివృద్ధికి బాటలు వేశావు. విదేశీ సంబంధాలు మెరుగుపరిచావు. ఒకటిరెండు సార్లు నువ్వు ఇబ్బందులు పడినా… కార్గిల్ యుద్ధంలో విజయం సాధించావు. అది నా జీవితంలో మరపురాని రోజు. నాకోసం అహర్నిశలు శ్రమిస్తున్న సైనికులు విజయగర్వంతో కనిపించినరోజు నేను పరవశించిపోయాను…అంటూ ఆయనను ప్రేమగా అక్కున చేర్చుకుంది.
సుస్థిర పాలక మౌని మన్మోహన్
అక్కడే గడ్డం తడుముకుంటూ, మౌనంగా నవ్వుతున్న మన్‌మోహన్‌సింగ్‌ను చూస్తూ… నన్ను ఎక్కువ కాలం పరిపాలించిన మూడోవ్యక్తివి నువ్వే. నువ్వు ఆర్థిక సరళీకరణ ప్రక్రియను కొనసాగించావు. అందువల్లే పాలన సుస్థిరంగా ఉండటానికి కృషి చేశావు… అని బుజ్జగించింది.
చిక్కు సమస్యలకు పరిష్కారం మోడీ
పక్కనే కూర్చున్న మోదీని చూస్తూ…
ఇప్పుడు నువ్వే కదా నన్ను కాపాడుతున్నావు. ఎన్నో సంవత్సరాలుగా పీట ముడి వేసుకున్న సమస్యల చిక్కుముడిని విడదీశావు. కల్లోల కాశ్మీర్‌ను ప్రశాంతం చేసి, దాల్ లేక్‌లో హాయిగా విహరించేందుకు కృషి చేశావు. అయోధ్య రామాలయాన్ని నిర్మించి, రాములవారిని గౌరవించుకున్నావు. ఒకే దేశం ఒకే పన్ను విధానం తీసుకు వచ్చావు. అవినీతిని తగ్గించడానికి నగదు చెల్లింపుల విధానాన్ని డిజిటలైజ్ చేశావు. మెరుపు దాడుల ద్వారా నా మీదకు వస్తున్న శత్రువులను తరిమావు. ఏభై ఏళ్ల తరవాత ఇజ్రాయిల్తో స్నేహ సంబంధాలు నెలకొల్పావు. నువ్వు మరిన్ని మంచి పనులు చేసి, నా ఖ్యాతిని ఖండాంతరాలకు మరింత విస్తృతం చేయాలి.
మీ అందరికీ ఒక్కటే మాట చెబుతున్నాను. ఎదుటివారు చేసిన మంచిని ప్రశంసిద్దాం. చెడును విడిచేద్దాం. నా అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడండి. రాజకీయం అంటే రాజ్యం లేదా దేశం సుస్థిరంగా ఉండటం కోసం చేయవలసిన కార్యమే కానీ, ఒకరి మీద ఒకరు అధిపత్యం సంపాదించుకోవటం కోసం చేసేది రాజకీయం కాదు. ఈ ఒక్కమాటే నేను ఈ రోజు మీ అందరికీ చెప్పదలచుకున్నాను.
మీరింతమంది నన్ను ఇంత చక్కగా పరిపాలించారు కనుకనే, నేటికీ ప్రపంచ దేశాలలో నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. త్వరలోనే నాకు జరగబోయే అమృతమహోత్సవ్ నాడు మీతో పాటు, మన రాష్ట్రపతులను కూడా కలుస్తాను.
ఆ రోజు కోసం ఎదురుచూస్తుంటాను.
మీరంతా ఎవరి ప్రదేశాలకు వారు వెళ్లండి నాయనా!
అంటూ భరతమాత ప్రవేశంచిన గుబాళింపుతో అక్కడి నుంచి నిష్క్రమించింది.
(భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సృజన రచన)