ఢిల్లీలో రేవంత్: కేంద్ర మంత్రులతో భేటీ

0
57

తుమ్మిడిహెట్టికి అనుమ‌తులు ఇప్పించండి..
తెలంగాణ‌-మ‌హారాష్ట్ర స‌మావేశం
జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి విన‌తి
పీఎంకు లేఖ‌… పీఎంవో స్పంద‌న‌పై చ‌ర్చ‌..
చ‌ర్చ‌ల ప్ర‌క్రియ ప్రారంభిస్తామ‌ని తెలిపిన‌ కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌
ఢిల్లీ, ఆగస్టు 05:
ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మ‌హారాష్ట్రలో ముంపు ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని వివ‌రించారు. జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆయ‌న కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి బుధ‌వారం స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్య‌త‌, ప్రాజెక్టుకు అనుమ‌తులు మంజూరు కోరుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి తాను రాసిన లేఖ‌, దానికి ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం స్పందించి జ‌ల్ శ‌క్తి కార్యాలయానికి పంపిన లేఖ‌ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌ల్‌శ‌క్తి మంత్రితో ప్ర‌స్తావించారు. తుమ్మిడిహెట్టి వ‌ద్ద 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గ‌తంలోనే రెండు రాష్ట్రాల మ‌ధ్య ఒప్పందం కుదిరిన విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి వ‌ద్ద 148 మీట‌ర్ల నుంచి 152 మీట‌ర్ల వ‌ర‌కు ఎత్తుతో బ్యారేజీ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్ర‌ల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ సెంట‌ర్ (CWPRS) అధ్య‌య‌నం నిర్వ‌హించింద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. CWPRS అధ్య‌య‌నం ప్రకారం 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపులో పెద్ద‌గా తేడా లేద‌ని స్ప‌ష్ట‌మైంద‌న్నారు. ముంపులోనూ 50 శాతం న‌దీ గ‌ర్భం (రివ‌ర్ బెడ్‌)లోనే ఉంటుంద‌ని కేంద్ర మంత్రి పాటిల్‌కు సీఎం వివ‌రించారు. 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేప‌డితే గ్రావిటీ ద్వారా కావ‌ల్సినంత నీరు స‌ర‌ఫ‌రా చేయ‌లేమ‌ని, కాబ‌ట్టి 150 నుంచి 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని కేంద్ర మంత్రి పాటిల్‌ను సీఎం కోరారు.


గ్రావిటీ ద్వారా నీటిసరఫరాకు అవకాశం
తుమ్మిడిహెట్టి వ‌ద్ద 150 నుంచి 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేప‌డితే గ్రావిటీ ద్వారానే నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. గ్రావిటీ ద్వారా నీటి స‌ర‌ఫ‌రాతో విద్యుత్ వినియోగం భారం ఉండ‌ద‌ని, ఈ నేప‌థ్యంలో బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని కోరారు. ఈ అంశంపై సాధ్య‌మైనంత త్వ‌ర‌గా తెలంగాణ‌, మ‌హారాష్ట్రల మ‌ధ్య స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యితే పూర్తిగా వెనుక‌బ‌డిన ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీటి వ‌స‌తి ఏర్ప‌డుతుంద‌ని సీఎం వివ‌రించారు.
చర్చల ప్రక్రియకు కేంద్ర మంత్రి సంసిద్ధత
ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి లేఖ అందింద‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ అంశంపై మొద‌ట కేంద్ర జ‌ల సంఘం (సీడ‌బ్ల్యూసీ) ఆధ్వ‌ర్యంలో స‌మావేశం ఏర్పాటు చేసి తొలుత తెలంగాణ‌, మ‌హారాష్ట్ర స్థాయి అధికారుల‌తో చ‌ర్చ‌ల ప్ర‌క్రియ ప్రారంభిస్తామ‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి తెలియ‌జేశారు. ఆ త‌ర్వాత తెలంగాణ‌, మ‌హారాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రుల స‌మావేశం ఏర్పాటు చేస్తాన‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి ముఖ్య‌మంత్రికి తెలిపారు.


స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, వేం న‌రేంద‌ర్ రెడ్డి, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, గ‌డ్డం వంశీకృష్ణ‌, ఎం.అనిల్ యాదవ్‌, డాక్ట‌ర్ క‌డియం కావ్య‌, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్య‌నాధ్ దాస్‌, నీటి పారుద‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఈ.శ్రీ‌ధ‌ర్ పాల్గొన్నారు.


భూపేంద‌ర్ యాద‌వ్‌తో సీఎం భేటీ
పర్యావరణ అనుమతులపై విజ్ఞప్తి
పాల‌మూరు-రంగారెడ్డి, గౌర‌వెల్లి, సీత‌మ్మ సాగ‌ర్‌, డిండి ప్రాజెక్టుల‌కు స‌త్వ‌ర‌మే ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పార్ల‌మెంట్‌లో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో ఈ ప్రాజెక్టుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు వెంట‌నే మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం పాల‌మూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోత‌ల‌పై రూ.3,187 కోట్లు, సీత‌మ్మ సాగ‌ర్‌పై రూ.1,835 కోట్లు, గౌర‌వెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధుల‌ను వ్య‌యం చేసింద‌ని కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించారు. అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ప‌నులు నిలిచిపోయాయ‌ని, ఫ‌లితంగా ప్రాజెక్టుల వ్య‌యం పెరుగుతోంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. సుప్రీంకోర్టు తీర్పు సానుకూల‌త నేప‌థ్యంలో ప్రాజెక్టుల‌కు తక్ష‌ణ‌మే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, వేం న‌రేంద‌ర్ రెడ్డి, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, గ‌డ్డం వంశీకృష్ణ‌, ఎం.అనిల్ యాదవ్‌, డాక్ట‌ర్ క‌డియం కావ్య‌, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్య‌నాధ్ దాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here