తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి: రేవంత్

0
61

  • పెట్టుబడుల‌కు అనువైన వాతావ‌ర‌ణం క‌ల్పిస్తున్నాం
  • ఫార్చ్చున్ 500 కంపెనీలు ఫ్యూచ‌ర్ సిటీకి రావాల‌నేదే ల‌క్ష్యం
  • రాష్ట్రంలో పాల‌సీ పెరాల‌సిస్ లేదు…
  • సీఐఐ ఉత్త‌ర భార‌త ప్ర‌తినిధుల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్, జులై 31: వివిధ రంగాల్లో పెట్టుబ‌డుల‌కు తెలంగాణ సుర‌క్షిత స్థాన‌మ‌ని, తెలంగాణ‌కు వ‌చ్చి పెట్టుబ‌డులు పెట్టాల‌ని భార‌త ప‌రిశ్ర‌మ‌ల స‌మాఖ్య (సీఐఐ) ఉత్త‌ర భార‌త ప్ర‌తినిధుల‌ను ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలోని ప్ర‌జా ప్ర‌భుత్వం పెట్టుబడుల‌కు రక్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డితో సీఐఐ ఉత్త‌ర భార‌త ప్ర‌తినిధులు శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న‌ట్లే, సీఐఐ కూడా 130 ఏళ్ల నుంచి విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంద‌న్నారు. తెలంగాణ బిడ్డ పి.వి.న‌ర‌సింహారావు ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్పుడు తీసుకువ‌చ్చిన స‌ర‌ళీక‌ర‌ణ‌, ప్రైవేటీక‌ర‌ణ‌, ప్రపంచీక‌ర‌ణ (LPG) ఫ‌లితాల‌ను ఇప్పుడు మ‌నం అనుభ‌విస్తున్నామ‌ని సీఎం అన్నారు.

ప్ర‌భుత్వాలు మారినా తెలంగాణ‌లో పారిశ్రామిక విధానాలను మార్చ‌డం లేద‌ని సీఎం అన్నారు. 1994 నుంచి 2004 వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబునాయుడు అనేక పెట్టుబ‌డులను ఆక‌ర్షించార‌ని, బిల్ గేట్స్ , బిల్ క్లింట‌న్ లాంటి దిగ్గ‌జాల‌ను హైద‌రాబాద్ కు తీసుకువ‌చ్చార‌ని సీఎం గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు కాంగ్రెస్ పాల‌న‌లో అంత‌ర్జాత‌య ఎయిర్ పోర్టు, అవుట‌ర్ రింగ్ రోడ్డు, ఫార్మా, ఐటీ కంపెనీలు హైద‌రాబాద్‌కు వ‌చ్చాయ‌న్నారు. 2014 నుంచి 2023 వ‌ర‌కు బీఆర్ఎస్ పాల‌నలో వాళ్లు కొన్ని పాల‌సీలు తీసుకువ‌చ్చార‌ని, వాటిని కొన‌సాగిస్తూనే తాము స‌రికొత్త పాల‌సీలు తీసుకువ‌చ్చామ‌ని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేద‌ని, నాయ‌కులు ఎవ‌రైనా, పార్టీ ఏదైనా మంచి పాల‌సీ తీసుకువ‌స్తే అది కొన‌సాగుతోందన్నారు. తాము తీసుకువ‌చ్చిన పారిశ్రామిక విధానాల‌తో పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్నామ‌ని, మంచి ప్ర‌తిపాద‌న‌ల‌తో వ‌చ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామ‌ని సీఎం తెలిపారు.

ఫార్చ్యున్ 500 కంపెనీలు భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో పెట్టుబ‌డులు పెట్టాల‌నేది త‌మ ఆకాంక్ష అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో గ‌త డిసెంబ‌ర్ లో గ్లోబ‌ల్ స‌మ్మిట్ ఏర్పాటు చేశామ‌ని, స‌మ్మిట్లో 175 దేశాల ప్ర‌తినిధులు పాల్గొన్నార‌ని సీఎం వివ‌రించారు. తెలంగాణ రైజింగ్ -2047 పాల‌సీని గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో ప్ర‌క‌టించామ‌ని సీఎం తెలిపారు. ప్ర‌స్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా అయిదు శాతంగా ఉంద‌ని, అది10 శాతంగా ఉండాల‌న్న‌దే త‌న‌ ల‌క్ష్యమ‌ని సీఎం వెల్ల‌డించారు.

కాలుష్యంతో ఢిల్లీ, వ‌ర్షాల‌తో ముంబ‌యి, ట్రాఫిక్ క‌ష్టాల‌తో బెంగ‌ళూరు, ప్ర‌కృతి వైప‌రీత్యాల‌తో చెన్నై స‌త‌మ‌వుతున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ‌ను క్యూర్‌, ప్యూర్‌, రేర్‌గా విభ‌జించామ‌ని సీఎం తెలిపారు. 160 కి.మీ. పొడ‌వైన ఔట‌ర్ రింగు రోడ్డు లోప‌ల ప్రాంతాన్ని క్యూర్‌గా గుర్తించామ‌ని, ఇక్క‌డ స‌ర్వీస్ సెక్టార్‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని సీఎం తెలిపారు. ఔట‌ర్ రింగు రోడ్డు నుంచి రీజిన‌ల్ రింగు రోడ్డు వ‌ర‌కు ప్రాంతాన్ని ప్యూర్‌గా గుర్తించామ‌ని, అక్క‌డ మాన్యుఫ్యాక్చ‌ర్ రంగానికి ప్రాధాన్య‌మిస్తున్నామ‌ని సీఎం తెలిపారు. రీజిన‌ల్ రింగు రోడ్డు వెలుప‌ల వ్య‌వ‌సాయ రంగానికి, అగ్రి ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం వివ‌రించారు.

ప్యూర్‌, రేర్ ప్రాంతంలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూములు ఇవ్వ‌డంతో పాటు ఇత‌ర వ‌స‌తులు క‌ల్పిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి మ‌చిలీ ప‌ట్నం పోర్టు వ‌ర‌కు 12 లేన్ల రహ‌దారి నిర్మించ‌నున్నామ‌ని, విభాగాల వారీగా క్ల‌స్ట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌ని సీఎం వివ‌రించారు. వరంగ‌ల్, ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టుల నిర్మాణాల‌కు కేంద్రం నుంచి అనుమ‌తి తెలిపింద‌ని, 7 బుల్లెట్ ట్రైన్ల ను కేంద్రం ప్ర‌క‌టిస్తే 3 తెలంగాణకు వ‌చ్చాయ‌న్నారు. శంషాబాద్ నుంచి చెన్నై, శంషాబాద్ నుంచి పూణె, శంషాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయ‌న్నారు. పొరుగు రాష్ట్రాల‌తో పోటీ ప‌డ‌ద‌ల్చుకోలేద‌ని, ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో పోటీ ప‌డి చైనా + కంట్రీగా తెలంగాణ‌ను నిల‌ప‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2037 నాటికి వన్ ట్రిలియన్ డాల‌ర్ల‌ ఆర్థిక వ్యవస్థ‌గా తెలంగాణ‌ను తీర్చిదిద్దుతామ‌ని సీఎం తెలిపారు.

తెలంగాణ సంస్కృతి త‌మ‌కు పెద్ద ఆస్తి అని, హైద‌రాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్ర‌జ‌లున్నార‌ని సీఎం తెలిపారు. ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టిన దానికి రెట్టింపు ఆదాయం వ‌స్తుంద‌ని సీఎం అన్నారు. పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ‌కు ఏం కావాలో చెబితే ఆ వ‌స‌తులు కల్పిస్తామ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నిత్యం అందుబాటులో ఉంటార‌ని, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి ప్ర‌తి రెండు నెల‌ల‌కోసారి, తాను ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి అందుబాటులో ఉండి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని సీఎం తెలిపారు. తెలంగాణను మీ సొంత ప్రాంతంగా భావించాల‌ని సీఐఐ ప్ర‌తినిధుల‌కు సీఎం సూచించారు.

ఏఐ సునామీతో వైట్ కాల‌ర్ జాబ్‌లు పోతున్నాయ‌ని, దాంతో తాము నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీక‌రించిన‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పబ్లిక్,ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ నెల‌కొల్పామ‌ని, దానికి ఛైర్మ‌న్ గా ఆనంద్ మ‌హీంద్రా, డైరెక్ట‌ర్లుగా కార్పొరేట్‌ కంపెనీల దిగ్గ‌జాలు ఉన్నార‌ని సీఎం తెలిపారు. దేశంలోనే త‌మ‌ది బెస్ట్ స్కిల్‌ యూనివ‌ర్సిటీ అని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఐటీఐల‌ను ఏటీసీలుగా మార్చుతున్నామ‌ని, అందులో శిక్ష‌ణ పొందిన వారికి 100 శాతం ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని సీఎం తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల‌నే బోధిస్తున్నామ‌న్నారు. ఇక్క‌డి జీసీసీ ల్లో 200 కంపెనీలు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు వ‌చ్చాయ‌ని, అమెజాన్ డేటా సెంట‌ర్ల పైన రూ.ల‌క్ష కోట్ల పెట్టుబ‌డి పెడుతోంద‌ని, అదాన్ రూ.35 వేల కోట్లు డేటా సెంట‌ర్ పైన పెట్టుబ‌డి పెడుతోంద‌ని సీఎం తెలిపారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు రామ‌కృష్ణారావు, ప‌రిశ్ర‌మ‌ల శాఖ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ కృష్ణ ఆదిత్య‌, సీఐఐ నార్త‌ర‌న్ రీజియ‌న్ వైస్ ఛైర్మ‌న్ శార‌దా సూరి మార్వా, ప్ర‌తినిధులు కృష్ణ బోధ‌న‌పు, గౌర‌వ్ మ‌హేశ్వ‌రి, వ‌నిత దాట్ల‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వినోద్ కె బాప్న త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • తెలంగాణ పారిశ్రామిక విధానాల‌కు ఆక‌ర్షితుల‌మ‌య్యాం..: పునీత్ కౌరా, ఛైర్మ‌న్‌, సీఐఐ నార్త‌ర‌న్ రీజియ‌న్

తెలంగాణ పారిశ్రామిక విధానాలు చాలా బాగున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఇస్తున్న మ‌ద్ద‌తుతో జీసీసీలు హైద‌రాబాద్‌కు వ‌రుస క‌డుతున్నాయి. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అనువైన వాతావ‌ర‌ణం ఇక్క‌డ ఉంది. మౌలిక వ‌స‌తులు, ప్ర‌భుత్వ స‌హాయ స‌హ‌కారాలు మెరుగ్గా ఉండ‌డంతోనే స‌మావేశానికి హైద‌రాబాద్‌ను ఎంచుకున్నాం. ఇక్క‌డ అధ్య‌య‌నం చేసేందుకు వ‌చ్చాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here