ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతకు ప్రత్యేక బ్యూరో

0
55

స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థపై అధ్యయనం చేయండి

డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే

విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధానికి కమిటీలు

అధికారమే కాదు బాధ్యత కూడా యాజమాన్యాలదే: రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జూలై 24: ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భధ్రత, మాదక ద్రవ్యాల నిరోధం, భద్రతపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో పూర్తి అధ్యయనం అనంతరం ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ బ్యూరో సంస్థాగత నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రతీ రెండు లేదా మూడు నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ బ్యూరో సమీక్షించేలా విధి విధానాలు రూపొందించాలన్నారు. ట్రాఫిక్ విషయంలో కేవలం నిబంధనలు విధించడం ఒక్కటే పరిష్కారం కాదని, క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ మార్పులు, పనివేళలు, రద్దీ సమయాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన అధ్యయనం చేయాలని తెలిపారు.

ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నిలిపి ఉంచడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగతున్నాయన్నారు. ఇందుకు ఇటీవల జరిగిన ప్రమాదాలను ఉదాహరించారు. ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఔటర్ పై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచనలిచ్చారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో దగ్గర దగ్గరగా ఉన్న సిగ్నల్స్ వద్ద వాహనదారులు తరచూ ఆగి వెళ్లాల్సి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకు వచ్చేందుకు అవసరమైనచోట అండర్ పాస్, ఎలివేటెడ్ కారిడార్ లను నిర్మించాలన్నారు. సాధ్యమైనంత వరకు సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాలు మూమెంట్ ఉండేలా చూడాలని సూచించారు. స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి

రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధంపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డ్రగ్స్ నిరోధం, భద్రత కమిటీలపై సమీక్షలో అధికారులతో చర్చించిన సీఎం పలు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ నిరోధంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించిందని, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలన్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో డ్రగ్స్ నియంత్రణకు విద్యార్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడంతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలను బాధ్యులను చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సంబంధిత పాఠశాల, కళాశాలలకు సంబంధించిన ప్రన్సిపాల్స్ ను బాధ్యులను చేయాలని సూచించారు. క్యాంపస్ లోపల డ్రగ్స్ కు సంబంధించి ఏ ఘటన జరిగినా సంబంధిత యాజమాన్యమే బాధ్యతవహించేలా నిబంధనలు తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. డ్రగ్స్ విషయంలో క్యాంపస్ బయట జరిగే యాక్టివిటీని గుర్తించి సమాచారాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

విద్యాసంస్థలకు అధికారంతో పాటు బాధ్యతను కూడా అప్పగించాలన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ కు సంబంధించి సమాచారం అందించేందుకు విద్యాసంస్థల ఆవరణలో టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. విద్యాసంస్థల్లో మూడు దశలుగా డ్రగ్స్ నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు. మొదటగా డ్రగ్స్ తీసుకునే వారిని గుర్తించడం, అలాంటి వారిని గుర్తించి వారి డ్రగ్స్ అలవాటును మాన్పించాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారిని శిక్షించాలని ఆదేశించారు. మొదటిసారి డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే అలాంటి వారిని డీ-అడిక్షన్ సెంటర్ కు తరలించాలని, తరచూ అలాగే పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే కొత్త చట్టాన్ని రూపొందించే అంశాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎన్.శ్రీధర్, వి.శేషాద్రి, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here