మోడల్ కాలనీ దీనికి ప్రత్యక్ష సాక్ష్యం
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
బతకడం ముఖ్యం కాదు..
ఎలా బతికామో ప్రధానం. ఏళ్ళొచ్చినా ఎప్పుడూ తమ జేబులు నింపుకుందామని చూసేవారు ఎక్కువ.
వ్యక్తుల దగ్గర నుంచి నాయకుల వరకూ ఎవరూ ఇందుకు మినహాయింపు కాదు.
పరుల కోసం బతకడం ఒక కళ. అది అందరికీ చేత కాదు. అలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. వారి సేవలకూ హద్దులు ఉండవు.
వారి తపనంతా సమాజం కోసమే.
వారు తామున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితం కారు. అడిగిందే తడవుగా సాయం చేయడానికి ముందుంటారు.
అటువంటి వారి వల్లనే ఈ సమాజం ఈ మాత్రమైనా ప్రశాంతంగా జీవిస్తోంది. అలాంటి వ్యక్తులలో ఒకరు జె.ఎస్.టి. సాయి గారు. ఇ . ఎస్. ఐ. సమీపంలోని మోడల్ కాలనీలో ఉంటారు. కాలనీని తనదిగా భావిస్తారు. ఆయన పుట్టిన రోజును కాలనీలో ఒక పండుగలా చేసుకున్నారు. పెద్దలను ఇలా గౌరవించాలని చాటారు. ఆ కార్యక్రమంలో పాత్రికేయులు జి. వల్లీశ్వర్, వైజయంతి, సామాజికవేత్త మారుతి ప్రసన్నలను సత్కరించారు. కార్యక్రమానికి హారజరైన వారిలో అంతా ఆరుపదులు నిండినవారే. కొంతమంది పాటలు పాడారు. కొందరు ప్రసంగించారు. కొందరు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇలా సమష్టిగా కార్యక్రమం నడిపించారు.

ఆ కాలనీకి ఒక పార్కు ఉంది. అందులో చక్కటి హాలు ఉంది. ఆ హాలులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆద్యంతం మోడల్ కాలనీ సొసైటీ కార్యవర్గం ఆధ్వర్యంలో చక్కగా సాగింది. పుట్టిన రోజు కార్యక్రమం అంటే సాయంత్రం ఏ హోటల్లోనే, ఫంక్షన్ హాల్లోనో చల్లని వాతావరణంలో చేసుకుంటారు. ఈ జన్మదిన కార్యక్రమం ఉదయం పదకొండు గంటలకు పచ్చని చెట్ల సాక్షిగా సాగింది.
ఈ జన్మదిన కార్యక్రమానికి సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించారు. శ్రీమతి ఇనగంటి లావణ్య, ఎస్.బి.ఐ. విశ్రాంత ఉన్నతాధికారి శ్రీమతి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. సత్కారం అందుకునేవారు కూడా ప్రసంగించారు. జె.ఎస్.టి. సాయి గారిచేత కార్యక్రమం ఆఖరులో కేక్ కట్ చేయించారు. ఆహ్లాదంగా సాగిన ఈ కార్యక్రమానికి వారు పెట్టిన పేరు “ఆత్మీయ సమావేశం”. ఒక కాలనీ ఎలా ఉండాలి? కాలనీలో పనులు ఎలా చేయాలి? పెద్దలను ఎలా గౌరవించాలలి? అనే విషయాలను ఈ కార్యక్రమం చెప్పింది. అందరూ ఈ అంశాలను పాటిస్తే అన్ని కాలనీలు బాగుంటాయి.








