ఇది మన నగరం కాదు ద్వీపం!
రేవంత్ కలలను మన హైడ్రా సాకారం చేస్తుందా?
(బాలినేని నాగభూషణ రావు, 9849969262)
(హైడ్రా పేరు వినగానే, హైద్రాబాదులో నీటివనరుల ప్రాంతంలో ఆక్రమణలను నిర్దయగా తొలగిస్తున్న సంస్థ గుర్తొస్తోందా? ఆగండాగండి. ఈ హైడ్రా వేరు. దీని కథేమిటో చదవండి.)
హైడ్రా అనే పదానికి పూర్తి అర్ధం “సమృద్ధిగా సముద్రపు నీరు కలిగి వున్న ద్వీపం”. ఆ పేరుతో ఒక అద్భుతమైన పట్టణం వున్నది.

మన తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా (Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency – HYDRA)పేరు వింటేనే రాజకీయ నేతల గుండెల్లో కలవరం మొదలవుతోంది. హైడ్రా లాంటి సంస్థ ఒకటి వుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ అది చేసే పనులు మాత్రం వద్దని కొందరు వాదిస్తున్నారు. ఈ వాదించే వారు హైడ్రా బాధితులు కావడమే ఇందుకు కారణం. చెరువుల కబ్జాలను పోషించి పెద్ద ఎత్తున సంపాదించిన రాజకీయ నేతలు, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు హైడ్రా చేస్తున్న పనులను తీవ్రంగా అడ్డుకునేందుకు, ప్రజలను రెచ్చగొడుతున్నారు.
హైడ్రా బాధితులకు న్యాయం చేసేందుకు పలు చర్యలు చేపట్టడం ద్వారా చెరువులను పరిరక్షించాలన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం స్వాగతించదగినదే. చిన్నపాటి వర్షం పడినా ముంపుతో అల్లాడిపోయే హైద్రాబాదును ముంపులేని నగరంగా, భవిష్యత్తులో మంచినీటి కొరత లేని రాజధానిగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వున్నారు. ఇందుకు ప్రజలు సహకరిస్తే బృహత్తరమైన ఆ స్వప్నం నెరవేరే రోజు ఎంతో దూరం లేదు.

ఈ విషయాన్ని పక్కన పెడితే “హైడ్రా” పేరుతో ఒక సుందరమైన నగరం ఉందన్న విషయం మీకు తెలుసా!? నగరం అనే కంటే అది ఒక దీవి అంటే బాగుంటుంది.
ఏడు చిన్న ద్వీపాలు కలిసి సరోనిక్ ఐలాండ్ (Saronic Islands). వీటికి మరో పేరు… అది సరోనిక్ గల్ఫ్. ఈ ద్వీపాలు గ్రీకు (Grece) దేశంలో వున్నాయి. ఏథెన్స్ నగరానికి సమీపంలో వుండే ఈ దీవులు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ప్రకృతికి నెలవైన ఈ దీవులు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో మనసు మైమరపించే విధంగా ఉంటాయి. ఈ దీవుల్లో ప్రముఖమైనది “హైడ్రా” నగరం లేక దీవి. ఆ దీవి మొత్తం కలిపినా 56 కిలోమీటర్లకు మించి ఉండదు.

క్రిస్టల్ వాటర్, రిలాక్సింగ్ వాతావరణం, సుదీర్ఘ చరిత్ర సరోనిక్ గ్రీస్ యొక్క అత్యంత విలక్షణమైన లక్షణాలు, ఇవి ఒక్కొక్కటి విభిన్నమైన పాత్రను కలిగి ఉంటాయి. పోరోస్ సెయిలింగ్‌కు చాలా బాగుంది, హైడ్రా అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి ఉంది,
హైడ్రా ద్వీపం 1821లో జరిగిన గ్రీస్ స్వాతంత్య్ర పోరాటం సమయంలో ప్రముఖ పాత్ర పోషించింది. 1950లలో లియోనార్డ్ కోహెన్, ఆక్సెల్ జెన్సన్ వంటి కళాకారుల బృందం ఉండడంతో కళాకారుని కాలనీ అనే బిరుదును పొందింది. ప్రసిద్ధ విప్లవకారుడు, కెప్టెన్ ఆండ్రియాస్ మియౌలిస్ గ్రీకు వీరులలో ఒకరు. అతని గౌరవార్థం వార్షిక పండుగను నిర్వహించడం ద్వారా ద్వీపం ఇప్పటికీ అతనిని స్మరించుకుంటుంది.

గ్రీక్ రాజధాని నుండి చిన్న ఫెర్రీ రైడ్ ద్వారా ఇక్కడకి చేరుకోవచ్చును. ప్రశాంతమైన ఇంకా మంత్రముగ్ధులను చేసే వాతావరణంలో సందర్శకులందరికీ హైడ్రా అనువైనది! హైడ్రాలో రవాణా సౌకర్యాలు కేవలం ఒంటెలు, పడవులు మాత్రమే. ఎటువంటి వాహనాలను అనుమతించని కారణంగా అది ఎంతో శాంతియుతంగా, ప్రత్యేక ప్రాంతంగా కన్పిస్తోంది.
ఈ ద్వీపంలో ట్రెక్కింగ్ అత్యంత ప్రధానమైంది. సాంప్రదాయ అద్భుతమైన వాస్తుశిల్పం, వాహనాలు లేకపోవడం, నివాసుల ఆతిథ్యం వంటివి హైడ్రా పట్ల పర్యాటకులు ఆదరణ చూపడానికి కారణమవుతున్నాయి. పశ్చిమ తీరం సహజ నౌకాశ్రయాలు ఉన్నాయి. హైడ్రా భౌగోళికంగా రాతి ప్రాంతం. ఈ ద్వీపంలో అనేక కొండలు, పర్వతాలు ఉన్నాయి. ఎత్తైనది ఎరోస్ పర్వతం, జోగేరి పర్వత శ్రేణి హైడ్రాకు దక్షిణాన, ఉత్తరాన ఓంబరీ శ్రేణి ఉంది. స్థానికులు తమ ఇళ్లను నిర్మించడానికి బూడిద రాయిని ఉపయోగించారు.
హైడ్రా నైట్ లైఫ్ కి ప్రసిద్ధి. ఓడరేవు వెంట అనేక బార్‌లు, క్లబ్‌లు ఉన్నాయి. అధునాతన శైలితో, హైడ్రాలోని నైట్ లైఫ్ చిల్ మ్యూజిక్, ఆల్-నైట్ పార్టీలకు ప్రత్యేకం. ఇక్కడ బీచ్ బార్‌లు ఉదయం కేఫ్‌లు, క్యాంటీన్‌లుగా పనిచేస్తాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత బార్‌లుగా మారుతాయి. ఇవి సముద్రం అందమైన ప్రకృతి వీక్షణలను అనుమతిస్తుంది. హైడ్రాలో అత్యంత ప్రసిద్ధ ఉత్పత్తి అమిగ్డలోటా అని వ్యవహరించే బాదం స్వీట్లు.

ఇక సమృద్ధిగా సముద్రపు నీరు కలిగి వున్న ద్వీపం మాదిరిగానే… చుట్టూ నీటి చెరువులతో కళకళలాడే మాదిరిగా మన హైడ్రా (హైద్రాబాద్) నగరం కూడా వుండాలని అందరం కోరుకుందాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ద్వారా తలపెట్టిన “చెరువుల రక్షణ” మహాయజ్ఞానికి అందరం కలిసి మద్దతు ఇద్దాం. భవిష్యత్తు తరాలకు నీటి బాధలు లేకుండా చేద్దాం.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

