సిరివెన్నెల సీతారామశాస్త్రి
మే 20 సిరివెన్నెల పుట్టినరోజు
(వైజయంతి పురాణపండ)
అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలువాలే చెట్టయ్యింది
నా చిలుక నువ్వే కావాలి నా రాచిలక నువ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి
పాటను కథగా మలిచారు. అనగనగా ఆకాశం, ఆకాశంలో మేఘం ఉంది అంటూనే మేఘం వెనుక ఒక రాగాన్ని ఉంచారు, ఆ రాగంతో నింగిని కరిగించారు, ఆ కరగటంతో ఆకాశమంతా చినుకుగా మారింది. ఆ చినుకే చిటపట మని నేలను తాకుతూ పాటగా మారింది. నేలను తాకిన ఆ పాట చిలకల కోసం చెట్టుగా మారింది. ఎంత అందమైన ఆలోచన. ఈ పాటను పిల్లలకు పాఠంగా చెప్పొచ్చు. అంత అందమైన పాట. ఇప్పుడు అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో సిరివెన్నెల మేఘం ఉంది, మేఘం వెనుక సిరివెన్నెల రాగం ఉంది, ఆ రాగం నింగిని కరిగించి అక్షర చినుకులు కురిపిస్తుంది, ఆ చినుకులు అక్షరలక్షల పాటవుతుంది, అది నేలకు చేరి వాల్మీకి కోకిలమ్ లాంటి కవి చిలుకలు వాలే చెట్టుగా మారుతుంది, ఆ చిలకలన్నీ రాగాల గువ్వలవుతాయి, అనురాగాల మువ్వలవుతాయి.
ఒక కవి రాసిన పాటలు ఆ కవి జీవితానికి అన్వయంగా మారిపోతాయి.
ఆ కవి కలం నుంచి అక్షరాలు ఎండిపోయినప్పుడు, పాత అక్షరాలన్నీ సజీవాలవుతాయి. ఒక్కసారి మదిని నిద్ర లేపుతాయి.
అసలు పేరు సీతారాముడు.
అందరికీ తెలిసిన పేరు సిరివెన్నెల.
నానృషి కురుతే కావ్యం అన్నట్లుగా…
ఆయన ఋషి. ఎన్నో కావ్యాలు సృష్టించాడు.
ఎంతోమంది కావ్యకన్యకలను వివాహమాడాడు.
అన్ని వివాహాలు విజయవంతమే.
ఎవ్వరూ ఆయనను విడిచిపోలేదు.
ఎవ్వరూ విడాకులు అడగలేదు.
శ్రీకృష్ణుడికి పదహారువేల మంది గోపికలు, అష్టభార్యలు…
రాముడు ఏకపత్నీవ్రతుడు..
అయితేనేం…
రాముడు ఎంతోమందిని వరించాడు.
అదే తనప్రజలను, తన ఆప్తులను, తన సోదరులను, తన బంధువులను.
మన సీతారాముడు కూడా ఎన్నో అక్షరసమూహాలను బంధువులను చేసుకున్నాడు.
ఎన్నో అలంకారాలను తన ప్రజలుగా భావించాడు.
ఎన్నో యతులను, ప్రాసలను తన సోదరులను చేసుకున్నాడు.
మన సీతారాముడి గురించి ఏమని రాయాలి, ఎలా రాయాలి.
విధాత తలపున ప్రభవించిన నారదుడు మన సీతారాముడు.
విధాతవాణిల ముద్దుబిడ్డ.

అందుకే ఒక్క అసభ్య పదాన్ని తన కలంలోకి రానీయలేదు.
ఒక్క ద్వంద్వార్థాన్ని తన సాహిత్యంలోకి అడుగు పెట్టనీయలేదు.
బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది.. అంటూ వాయిదా పద్ధతి చదువుల విధానాన్ని వ్యంగ్యంగా పలికారు..
బలపం పట్టి భామ బళ్లో అఆ ఇఈ నేర్చుకుంటానన్నారు..
ఈ కలమేనా దినకర మయూఖ తంత్రులను పలికించింది.
ఈ కలమేనా నను గన్న నావాళ్లు నా కళ్ల లోగిళ్లు అని పలికించింది.
ఈ కలమేనా నీ కాళ్లను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు.. అని పలికించింది.
జగమంత కుటుంబం నాది అని చాలాకాలం క్రితమే చెప్పుకున్న ఋషి, తపస్వి.
నిజం.. ఆయనది జగమంత కుటుంబం. ఆయన ఏకాకిగా జీవిస్తూ పాటను మాత్రమే రచిస్తారు. ఆ తరవాత జగంలోకి ప్రవేశిస్తారు.

నిజం.. నిజం…
సరస్వతి పులకరించింది.
ఆనందంతో సరస్వతి రాగాన్ని తన వీణ మీద పలికించింది.
బ్రహ్మదేవుడు తన సృష్టికి తానే మురిసిపోయాడు.
విష్ణుమూర్తి లక్ష్మి ఇద్దరూ కలిసి పాలసముద్రంలో సిరివెన్నెలను ఒడిలోకి తీసుంటున్నందుకు సంబరపడిపోయారు.
ఇక వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరమ్… అనిపించుకున్న ఆదిదంపతులు తమను తన నీలి అక్షరాలతో నిందాస్తుతిలో పరవశింపచేసిన తమ బుజ్జి సీతారాముడు తమ దగ్గరకు వచ్చినందుకు మరింత పరవశించిపోయారు.
తన పేరు పెట్టుకున్న సీతారాముడు తన పేరును నిలబెట్టినందుకు రాముడు మరింత సంబరపడ్డాడు. రాముడిది ఒకటే బాణం అన్నట్టుగా సీతారాముడు ఒక్కడే.
ఒక్కడే ఒక్కడే
సీతారాముడు ఒక్కడే.

