క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణను అందించిన డాక్టర్ నోరి
దత్తాత్రేయుడుకి సీఎం అభినందన
హైదరాబాద్, మే 15: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణుడు అయిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణను సీఎంకు ఆయన అందజేశారు.
తెలంగాణలో క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర నివేదికను అందజేసినందుకు సీఎం రేవంత్ డాక్టర్ నోరిని అభినందించారు.

నోరి దత్తాత్రేయుడు రూపొందించిన అట్లాస్ క్యాన్సర్‌పై పోరాటానికి ఎంతో ఉపయోగకరమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి కారణాలను అన్వేషించే అవకాశం ఈ నివేదిక ద్వారా లభిస్తుందన్నారు. డేటా ఆధారంగా క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని రేవంత్ వెల్లడించారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సను ఆరోగ్యశ్రీ కింద మరింత సమర్థవంతంగా అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చోంగ్థూ పాల్గొన్నారు.

