జర్నలిస్ట్ లు లబ్ధిదారులు కాదు – బాధితులు

0
145

(బుద్దా మురళి)
జర్నలిస్ట్ లను కోటీశ్వరులను చేశాం . మంత్రి పొంగులేటి ప్రకటన . ఇప్పుడు జర్నలిస్ట్ లు బెంజ్ కారులో వెళ్లి ప్లాట్లు తీసుకుంటారు … ఫేస్ బుక్ లో మిత్రుడి వెటకారం . నిజానికి అలా అనడంలో అతని తప్పు లేదు .రెండు మూడు చేతులా సంపాదించే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జర్నలిస్ట్ లకు ప్లాట్లు అనగానే ఈర్ష సహజం. వారూ వీరు అని కాదు .. తోటి జర్నలిస్ట్ లే కాదు చివరకు జర్నలిస్ట్ ల బంధువులకు సైతం కోట్ల రూపాయల ప్లాట్లు కొట్టేస్తున్నారు అనే ఈర్ష అత్యంత సహజం . నిజంగా జర్నలిస్ట్ లకు మంత్రి చెప్పినట్టు కోట్ల రూపాయల ప్లాట్స్ ఇస్తే ఈర్షను భరించాల్సిందే మౌనంగా ఉండాల్సిందే కానీ వాస్తవం ఏమిటీ ?
పత్రికల్లో వచ్చే వార్తకు వాస్తవానికి చాలా సార్లు సంబంధం ఉండదు . కోట్ల రూపాయల విలువైన ప్లాట్ల ప్రకటన కూడా అలాంటిదే … ఈ విషయంలో జర్నలిస్ట్ లు లబ్ధిదారులు కాదు బాధితులు …
ఔను నిజం బహుశా ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో జర్నలిస్ట్ లు బాధితులుగా నిలిచిన వ్యవహారం ఇదొక్కటే …
దాదాపు రెండు దశాబ్దాల క్రితం జర్నలిస్ట్ లు ఇంటి స్థలం కోసం రెండేసి లక్షలు చెల్లించారు . కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్టు అనేక కారణాలతో జర్నలిస్ట్ ల భూమి ఇప్పుడు ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయంగా మారింది . అప్పటి రెండు లక్షల విలువ ఎంత అంటే … అప్పుడు ఓ పది మంది జర్నలిస్ట్ ల బృందం భువనగిరి దగ్గర తుర్కపల్లి లో భూమి కొనాలి అని వెళితే ప్రధాన రోడ్డులో ఎకరం 80 వేల ధర చెప్పారు … అంటే అప్పుడు రెండు లక్షలు ప్రభుత్వానికి చెల్లించడం కన్నా తుర్కపల్లి లో పొలం కొని ఉంటే రెండు లక్షలతో రెండున్నర ఎకరాలు వచ్చేది . ఇప్పుడు అక్కడ ఎకరం పొలం ధర కోటిన్నర . ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ పై ఆశలు పెట్టుకోకుండా అదే డబ్బుతో పొలం కొంటే దాదాపు మూడు కోట్ల ఆస్తి పరుడు అయి ఉండేవాడు … ఒక్క తుర్కపల్లి లోనే కాదు ఆ డబ్బుతో ఎక్కడ భూమి కొన్నా ఇలానే ఉండేది . ఈ లెక్కలు ఎందుకు అంటే జర్నలిస్ట్ లను కోటీశ్వరులను చేశాం అని మంత్రి మాటలు విని నిజం అనుకుంటున్నారు అని … జర్నలిస్ట్ లు లబ్ధిదారులు కాదు బాధితులు అని చెప్పాలి అని …
నిజాం పేట్ , పేట్ బషీర్ బాద్ లలో ysr కేటాయించిన స్థలం కోర్టు తీర్పు తో ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది . అమ్ముకుంటుంది . వేల కోట్లు ప్రభుత్వ ఖజానా లో చేరుతుంది . జర్నలిస్ట్ ల జీవితాలు మాత్రం వీధిన పడ్డాయి .


నలుగురిలో పడ్డ పాము చావదు అని ఏదో సామెత చెప్పినట్టు ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదు అని దాదాపు 50 మంది ఆంధ్ర జర్నలిస్ట్ లు ముందుగానే మేల్కొని తమ డబ్బు వెనక్కి తీసుకోని ఆ డబ్బుతో ఆంధ్ర లో ప్లాట్స్ కొన్నారు .
రెండు దశాబ్దాల క్రితం డబ్బు కట్టిన వారికి ఆర్ బి ఐ వడ్డీ రేటు ప్రకారం వడ్డీ చెల్లించి కట్టిన డబ్బు తిరిగి చెల్లించమని అత్యున్నత కోర్ట్ తీర్పు . సహకార బ్యాంకు లో వడ్డీ ఒక శాతం ఎక్కువ ఉంటుంది . కొంపదీసి ఒక శాతం ఎక్కువ ఇస్తారేమో అని ఆర్బీఐ రేటు అని తీర్పు … రాజ్ దీప్ సర్దేశాయ్ వంటి హేమా హేమీలైన జర్నలిస్ట్ లను చూసిన ధర్మ ప్రభువులు జర్నలిస్ట్ లు కూడా ఐఏఎస్ , mla లతో సమానం అనేశారు . జర్నలిస్ట్ పోతే చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించే స్థితిలో చాలా మంది ఉంటారని ఢిల్లీ ధర్మ ప్రభువులకు తెలిసే అవకాశం తక్కువ .
రెండు లక్షలు చెల్లించడానికి ఒక్కొక్కరిది ఒక్కో దయనీయ మైన కథ .
మా ఉమ్మడి ఆస్తిలో నా వాటా నాలుగు ఎకరాలు అమ్మి రెండు లక్షలు చెల్లించా … ఇప్పుడా పొలం విలువ కోటి పైనే మీరిస్తాను అని ఫ్యూచర్ సిటీలో ఐదు వేలకు గజం దొరుకుతుంది. నన్ను చూసి మా వాళ్ళు నవ్వుతున్నారు అని ఓ జర్నలిస్ట్ మంత్రికే చెప్పారు … నెలకు ఐదు శాతం వడ్డీ తెచ్చిన వాళ్ళు కొందరు. 13 వేలకు తులం లా బంగారం అమ్మినవారు కొందరు. వేజ్ బోర్డు సిఫారసుల మేరకు జీతాలు ఇచ్చే సంస్థలు చాలా తక్కువ .. చాలా మందిది దయనీయ స్థితి.
ఇదంతా ఎందుకు ?
20 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు అనే వార్త వారానికి ఓ సరైన వస్తుంది . ఇది చూసి ప్రభుత్వం కోట్లు రూపాయలను జర్నలిస్ట్ లకు దోచి పెడుతోంది అనే అభిప్రాయం ఉంది . ఇచ్చింది లేదు చచ్చింది లేదు. వార్త చదివిన అందరిలో ఈర్ష …
అయిపోయింది ఇప్పుడేం చేయాలి ?
ఫ్యూచర్ సిటీ లోనే కాదు ఆదిలాబాద్ అడవుల్లో ఇస్తాం అన్నా మౌనంగా తీసుకోవాలి . ఇక్కడ అధికారంలో ఉన్నది ysr కాదు రేవంత్ రెడ్డి .. సుప్రీం చెప్పినట్టు వడ్డీ తో డబ్బు తీసుకోవాలి అన్నా తాతలు దిగిరావాలి. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సుప్రీం కు వెళితే కొన్నేళ్ల తరువాత మన డబ్బు మనకు రావచ్చు. సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వరు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడగాలి. అలా ఎన్నిసార్లు అడుగుతారు.


భ్రమలు వద్దు
పేట్ బషీర్ బాద్ , నిజాం పేట్ పై రెండు దశాబ్దాలు భ్రమల్లో ఊహల్లో గడిపాం ఇక చాలు. ఫ్యూచర్ ప్రపంచం అంతా ఫ్యూచర్ సిటీ లో దాగి ఉంది అన్నట్టు కొందరి ప్రచారం . 12 లైన్ ల రోడ్డు , బులెట్ ట్రైన్ అంటూ రియల్ ఎస్టేట్ వారిని మించి కలలు ప్రపంచం చూపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లనే కట్టే స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు . కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తారు అనే ఆశలు వద్దు … ఎక్కడ ఇచ్చినా మన ప్రాప్తం ఇంతే అనుకోవాలి. ఇప్పటికే 70 మంది ప్రాణాలు , వారి ఇంటి కలలు గాలిలో కలిసి పోయాయి . తప్పెవరిదీ కాదు … కాల ప్రభావం అంతే …
జర్నలిస్ట్ లకు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయకుండా చెయ్యి ఇచ్చింది అని వ్యాసం రాస్తే ఓ మిత్రుడు సీఎం శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహోన్నత వ్యక్తి ఎప్పుడైనా కలువ వచ్చు అని తలుపులు తెరిచే ఉంచాడు అని మరో పత్రికలో వ్యాసం రాశాడు. ఓసారి కలిసినప్పుడు చర్చలో ఎడిటర్ లు మొదలుకొని 150 మంది ప్రముఖుల సంతకాలతో అపాయింట్ మెంట్ కోరితే ఏడాది అయినా అతి గతి లేదని అని అతనే అన్నాడు. ఏయే పరిస్థితుల్లో ఎవరు ఎందుకు ?ఎలా రాస్తారో ? తెలుసు కాబట్టి మౌనంగానే విన్నాను.
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు జర్నలిస్ట్ ల హెల్త్ కార్డు కోసం జర్నలిస్ట్ ల నుంచి డబ్బు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించారు . హెల్త్ కార్డు ఇవ్వలేదు. డబ్బులు తిరిగి రాలేదు. ప్రభుత్వం వద్ద డబ్బు వ్యవహారాలు ఇలానే ఉంటాయి. గోడకు కొట్టిన సున్నంలాంటిదే …
20 ఏళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోయాం … పోరాటానికి ఇంకా వయసు లేదు . అడవిలో ప్లాట్ ఇచ్చినా తీసుకోని శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపమని … జీవితానికి అండగా ఉంటుంది అనుకున్న ప్లాట్ కోల్పోయినందుకు బాధ సహజం. బాధ , ఆక్రోశం తో తప్పు నీది అంటే నీది అని ఒకరిపై ఒకరు తోసేసు కోవడం మాములే . ఎలాగూ కోల్పోయాం .. ఆలోచనలతో ఆరోగ్యం కోల్పోవడం అవసరమా ?


తోక టపా
జర్నలిజం లోకి వచ్చి మూడేళ్లు అయితే , మరో రెండేళ్ల కోసం దొంగ సర్టిఫికెట్ పెడితే పట్టుపడిన జర్నలిస్ట్ కోర్టుకు వెళ్లడం తో వివాదం . చివరకు రెండు దశాబ్దాల ప్రయాణంలో ఇప్పుడు ఆ జర్నలిస్ట్ కూడా రిటైర్ అయ్యాడు. ఎవరికీ ప్లాట్ రాకుండా చేశా అనే తృప్తి అతనికి మిగిలింది … చెరపకు రా చెడేవు అంటారు ..
బాబూ జర్నలిస్ట్ లు బాధితులే కానీ లబ్ధిదారులు కాదు .
వారానికి ఓ సారి జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు అనే వార్తలు చూసి ఈర్ష పడకండి .


(వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్టు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here