(మహాదేవ్)
చిన్నప్పుడు ఎప్పుడో నాన్నతో కలిసి వంట పనికి సాయంగా వెళ్లినప్పుడు జరిగిన ఒక సంఘటన నా మనసులో బలంగా నాటుకుపోయింది. నాన్నలో సగం వయస్సు కూడా లేని ఒక వ్యక్తి, ఆయన్ని ఏకవచనంతో సంబోధిస్తూ మర్యాద లేకుండా మాట్లాడటం చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఇంటికి వచ్చాక నాన్నను అడిగాను-“నీకన్నా చిన్నవాడై ఉండి ఆయన అలా గౌరవం లేకుండా మాట్లాడుతుంటే, నువ్వు నవ్వుతూ సమాధానం ఎలా చెప్తావు నాన్న? మర్యాదగా మాట్లాడమని అడగాలి కదా!” అని.
దానికి నాన్న ఒక మాట చెప్పారు-“మనం చేసే వృత్తిని, స్థాయిని బట్టి మాత్రమే ఈ సమాజం మనకు గౌరవం ఇస్తుందిరా.. మన వయస్సును బట్టి కాదు. అందుకే నువ్వు బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉంటే నిన్ను గౌరవిస్తారు, నీతో పాటు నీ తండ్రిగా నన్ను కూడా గౌరవిస్తారు.”
ఆ మాటలే నా మదిలో ఎప్పుడూ మెదులుతూ, చదువులో ఎప్పుడూ టాపర్‌గానే ఉండేలా చేశాయి. కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నాన్న చాలా ఆనందపడేవారు, కానీ నేను పొందుతున్న గౌరవం ఆయనకు తెలియదు.
తర్వాత ఆ జాబ్ వదులుకుని సినిమాల్లోకి వెళ్తానంటే ముందు బాధపడినా, నా 18 ఏళ్ల కల – నాటకాల గోల ఆయనకు తెలుసు కాబట్టి అడ్డు చెప్పలేదు.
కానీ లాక్‌డౌన్ వల్ల నా ప్రయత్నాలు ఆగిపోయి, రాజోలులో మా అన్నయ్యతో కలిసి ‘ప్రగడ అకాడమీ’ పెట్టినప్పుడు నాన్న కళ్లలో అసలైన సంతోషం చూశాను. అక్కడ విద్యార్థులందరూ నన్ను, అన్నయ్యను “సార్” అని పిలుస్తుంటే.. నాన్నను “మాస్టారు గారి నాన్నగారు” అని గౌరవిస్తుంటే – నాన్న కోరుకున్న ఆ గౌరవాన్ని ఆయనకు ఇవ్వగలిగామనిపించింది.
అయితే, లాక్‌డౌన్ తర్వాత తిరిగి ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు నాలో ఒక చిన్న భయం మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సెట్‌లో లేబర్ వర్క్ చేయించుకుంటారని, డైరెక్టర్లు పచ్చి బూతులు తిడుతూ పనులు చెప్తారని ఇండస్ట్రీకి రాకముందే వినేవాడిని.
అలాంటి మెంటల్ ప్రిపరేషన్‌తోనే, ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేసిన గుర్తింపుతో వి.ఎన్. ఆదిత్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా మా చుట్టాల రిఫరెన్స్ ద్వారా జాయిన్ అయ్యాను.
కానీ అక్కడ నేను చూసింది వేరు!
ఒక దర్శకుడు తన అసిస్టెంట్‌ను కూడా “మీరు” అని సంబోధిస్తూ ఎంతో మర్యాదగా చూడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. కేవలం అసిస్టెంట్ డైరెక్టర్లనే కాదు, సెట్‌లో పని చేసే ప్రొడక్షన్ బాయ్‌ను కూడా మాట వరుసకు ఏకవచనంతో పిలవని గొప్ప సంస్కారి ఆయన. పొజిషన్ చూసి వాల్యూ ఇచ్చే ఇండస్ట్రీలో-“మనిషి అయితే చాలు, మర్యాద ఖచ్చితంగా ఇవ్వాలి” అనే సిరివెన్నెల గారి మాటలను వంటబట్టించుకున్న వ్యక్తి ఆదిత్య గారు.
ఒకవేళ ఆయన కోపంలో తిట్టినా కూడా చివర్లో “అండి” అనే తిడతారు. ఒక్క బూతు మాట కూడా ఆయన నోటివెంట ఏరోజూ వినలేదు.
ఆ తిట్టడంలో కూడా మా తప్పును సరిదిద్దే గుణం తప్ప, కావాలని grudge పెట్టుకుని తిట్టడం అస్సలు చూడలేదు.
మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని చాలా సార్లు విన్నాను. కానీ ఈయనతో పరిచయం ఉన్న వ్యక్తులు అందరూ ఆ quotationతో సంబంధం లేకుండా ఉండడం ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకు డబ్బు మీద కూడా కొంచెం మమకారం ఉండి ఉంటే.. ఇండస్ట్రీ భౌగోళిక స్వరూపమే వేరేలా ఉండేదేమో అనిపిస్తుంది.
ఆయనతో ప్రయాణంలో నాకు దొరికిన గొప్ప పాఠాలు కొన్ని:
- ఇండస్ట్రీలో మీకు నచ్చింది వచ్చే వరకు, వచ్చింది చేస్తూ ఉండండి.
- ఫిల్మ్ మేకింగ్ అంటే ఒకరి కింద పని చేయడం కాదు, అందరం కలిసి పని చేయడం.
- ఎవరు ఏ పని చెప్పినా, మీకు ఆ పని పూర్తిగా తెలియకపోతే, నేర్చుకుంటాను అని చెప్పి, ప్రత్యేకంగా టైం కేటాయించి నేర్చుకోండి.
ఇలాంటివి ఇంకా ఎన్నో, చాలా ప్రేరణ కలిగిస్తాయి.
నేను మొత్తం అయిదుగురు దర్శకులతో దర్శకత్వ శాఖలో పని చేసినప్పటికీ, ఆదిత్య గారిలోనూ, సింగీతం గారిలోనూ ఒకే రకమైన ప్రత్యేక లక్షణం ఉంది.
అది – వాళ్ల god’s gifted sense of humourతో తమ చుట్టూ ఉండే టీమ్ అందరినీ సరదాగా నవ్విస్తూనే వాళ్లకి కావాల్సిన పని చేయించుకోవడం.ఈ లక్షణమే వాళ్లతో పర్సనల్‌గా కూడా దగ్గర అయ్యేలా చేస్తుంది.
Sandeep Reddy Vanga గారు, Shiva Nirvana గారు, Sai Rajesh గారు, Anil Ravipudi గారు వంటి దిగ్గజ దర్శకులంతా ఆయన దగ్గర ఏదో సందర్భంలో కలిసి పని చేసిన వారే.
ఒక వ్యక్తిలోని టాలెంట్‌ను ఆదిత్య గారు చాలా నమ్ముతారు. అంతే కాదు, ఆ టాలెంట్‌లో ఏమైనా లోపాలు ఉంటే, ఆ లోపాలను సరిదిద్దుకునేలా మార్గనిర్దేశకం చేస్తారు. వారు మనపై ఉంచే ఆ నమ్మకమే మనలో చాలా బాధ్యతను పెంచుతుంది.
మొన్న ఈమధ్యనే నేను డైరెక్షన్ చేసిన – పునరపి జననం షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన అన్న మాట మరువలేనిది – ఈ షార్ట్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి పంపించండి, దీని worth అక్కడ ఎక్కువ ఉంది. ఆ రకంగానే నా షార్ట్ ఫిల్మ్ ఈజిప్షియన్ అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్‌లో సెలెక్ట్ అవ్వడం ఆయన దూరదృష్టికి నిదర్శనం.
హిందూ ధర్మంలో ఏదైనా సాధించాలంటే గురువు అనుగ్రహం ఉండాలంటారు. నా అదృష్టం కొద్దీ ఆదిత్య గారే స్వయంగా నన్ను Singeetam Srinivasa Rao గారి దగ్గరకు, K. Raghavendra Rao గారి దగ్గరకు తీసుకెళ్లారు.
చిన్నప్పుడు నాన్న చెప్పినట్టు – సమాజం స్థాయిని చూసి గౌరవం ఇస్తుందేమో కానీ, ఆదిత్య గారి లాంటి గొప్ప గురువులు మాత్రం మనిషిని చూసి మర్యాద ఇస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా ప్రయాణంలో ఒక సంస్కారి దగ్గర తొలి అడుగులు వేయడం, నా కెరీర్ నిర్మాణానికి పునాదిగా మొదటి మూడు రాళ్లు వారే పేర్చడం నేను పొందిన గొప్ప అనుగ్రహం.
ఇందుకు కారణం అయిన వివేక్ గారికి కృతజ్ఞతలు.
ఆదిత్య గారికి మనస్పూర్తిగా జన్మదిన శుభాకాంక్షలతో పాటు, వారు నేర్పిన సంస్కారం, సుగుణాలు నాతో ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదించాలని కోరుకుంటూ…

(Author of this article is an up coming director)

