“మీడియా ముఖచిత్రం మారుద్దాం”

0
58

ప్రముఖ పాత్రికేయుడు ఎం.వి.ఆర్. శాస్త్రి పిలుపు
పత్రిక స్వేచ్ఛ రాజ్యంగంలో లేదు

(పి వి రమణా రావు)

జర్నలిజం లో కొత్త ఒరవడి సృష్టించే దిశగా అడుగులు వేసి మీడియా ముఖ చిత్రాన్ని త్వరలో మారుద్దామని ప్రముఖ పాత్రికేయుడు ఎం.వి.ఆర్. శాస్త్రి పిలుపు ఇచ్చారు.
ఆంధ్ర భూమి దినపత్రికలో సంపాదకుడిగా, ఈనాడు, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి దినపత్రికల్లో వివిధ హోదాలలో పనిచేసిన శాస్త్రి అమృతోత్సవ వేడుకలు (75 వ జన్మదినోత్సవ వేడుకలు) బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ కమిటీ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కమిటీలు సంయుక్తంగా శాస్త్రికి “లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డును” అందచేశాయి.
సన్మానికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ శాస్త్రి మాట్లాడారు. జర్నలిజం లో ఒక ఉద్యమాన్ని తీసుకువద్దామని, యాక్షన్ ఓరియెంటెడ్ గా పనిచేద్దామని యువ జర్నలిస్టులకు పిలుపు ఇచ్చారు. పనిచేసే వాళ్ళు సజీవులుగా ఉంటారని, పనిచేయలేక పోతే జీవచ్ఛవాలుగా మిగిలిపోతారని అన్నారు.
“ధర్మశక్తి” పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశామని, ధర్మనిధిగా “క్లౌడ్ ఫండింగ్” వసూలు చేసి ఈ – పేపర్, డిజిటల్ ఛానల్ ఏర్పాటు చేయాలన్నది తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. సరైన మీడియా సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా జర్నలిజం విలువలు పెంచవచ్చన్నారు. సోషల్ మీడియా ద్వారా సమాజానికి ఉపయోగపడే అద్భుత వార్తా కథనాలు ప్రజలకు అందించవచ్చన్నారు.

ఎన్.టి. రామారావు టిడిపిని ఏర్పాటు చేసినప్పుడు “ఈనాడు” తెలుగు దినపత్రిక ప్రతిపక్ష పాత్ర పోషించి అధికారం లోకి వచ్చేలా పనిచేసిందని గుర్తు చేశారు.
రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు మీడియా సంస్థలకు యజమానులు కావడం వల్ల మీడియా స్వతంత్రంగా పనిచేయలేక పోతుందన్నారు. ప్రత్యేక వార్తా కథనాలు, ఇన్వెస్టిగేషన్ వార్తలు రావడం లేదన్నారు.
రాజ్యాంగ పరంగా మీడియాకు స్వేచ్ఛ లేదని శాస్త్రి తెలిపారు. అందుకే రాజ్యాంగాన్ని మార్చాలని అడగాలన్నారు.

మీడియా వ్యవస్థ కుళ్ళిపోయిందని, భ్రష్టు పట్టిందని సమాజం లో కొందరు అనుకుంటున్నారని, కానీ శాసన, ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థలతో పోలిస్తే నాలుగో స్థంభంగా పేరున్న మీడియా చాలా చక్కగా పనిచేస్తోందని శాస్త్రి స్పష్టం చేశారు. మొదటి మూడు వ్యవస్థలు అవినీతికి ఆలవాలం అయ్యాయని అన్నారు. ఈ మూడు వ్యవస్థలను సక్రమ మార్గం లో పెట్టాల్సిన బాధ్యత మీడియా పై ఉందన్నారు. అందుకే మీడియా పట్ల నేటికీ సమాజానికి గౌరవం ఉందన్నారు.

జర్నలిస్టులు సరైన వేతనం లేక దుర్భర జీవితం కొనసాగిస్తున్నారని. అడుక్కునే వారికన్నా తక్కువ ఆదాయం తో బతుకుతున్నారని గుర్తు చేశారు. విధి నిర్వహణ తర్వాత క్షేమంగా ఇంటికి చేరతామన్న గ్యారంటీ లేదన్నారు. పనిచేసే సమయంలో కనీస వేతనం లేదని, రిటైరయిన తర్వాత పెన్షన్ సౌకర్యం లేదన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అహంకారంతో జర్నలిజాన్ని, జర్నలిస్టులను అవమానిస్తున్నారని శాస్త్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. జీవన సాఫల్య పురస్కారం వల్ల తనపై బాధ్యత మరింత పెరిగిందని శాస్త్రి అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here