విజయన్ పై విమర్శలతో ఆకట్టుకున్న ప్రచారం
కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒక కొత్త కెరటం వెల్లువలా ముంచెత్తింది. కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టి విడిచిపెట్టిన ఆ అస్త్రమే రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రులతో ఇతర రాష్ట్రాలలో ప్రచారాలకు శ్రీకారం చుట్టిన పార్టీ బీజేపీ. 1984 లో ఎన్టీఆర్ సారధ్యంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ లో ముఖ్య భూమిక బీజేపీదే. ఆ పార్టీ సలహా మేరకే ఎన్టీఆర్ దక్షిణాది రాష్ట్రాలలోని కాకుండా, ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందుకోసం ఆయన హిందీ మాట్లాడడం కూడా నేర్చుకున్నారు. ఆ తరవాత నుంచి రామకృష్ణ హెగ్డే, దేవీ గౌడ, తదితరులు ఆయన బాటలో నడిచారు. 2004 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైస్సార్ ను కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిమిత్తం కర్ణాటకు పంపింది.
ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తాజా ఎన్నికల్లో కేరళంలో మొత్తం మూడు రోజులు ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన అక్కడి ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పై విమర్శలు గుప్పించారు. బీజేపీతో పినరాయి ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపిందని చెప్పారు.
అక్కడితో ఆగకుండా, కేరళంలో జరిగిన అభివృద్ధి గత కాంగ్రెస్ ముఖ్యమంత్రుల చలువ వల్లనేనని తెలిపారు. కేరళంలో పంచాయిరాజ్ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కారణం కె. కరుణాకరన్, ఊమెన్ చాందీ పరిపాలనేనని రేవంత్ చెప్పారు. మంచిని మంచిగానే చెబుతా…. అలాగని తప్పులు చేస్తే విమర్శించక మాననని స్పష్టం చేశారు.

రేవంత్ విమర్శలకు కేరళం ముఖ్యమంత్రి జవాబు చెప్పుకోవలసి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి తమ ప్రభుత్వంతో పోలికే లేదని ఆయన చెప్పారు. తమ వద్ద జరిగిన అభివృద్ధిని అంశాలవారీగా వివరిస్తూ, లేఖ విడుదల చేయాల్సివచ్చింది.
దీనికి రేవంత్ కౌంటర్ లేఖ విడుదల చేశారు. తెలంగాణాలో అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు వివరించారు. అందులో సూపర్ సిక్స్ హామీల గురించి కూడా ప్రస్తావించారు. కేరళం అభివృద్ధి మోడల్‌లోని లోపాలను ఎత్తిచూపుతూ, గత 60 ఏండ్లలో జరిగిన అక్కడి అభివృద్ధికి పినరాయి విజయన్, ఎల్డీఎఫ్ ప్రభుత్వం మాత్రమే కారణమని చెప్పడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు, ఇక తెలంగాణలో గత 28 నెలల్లో సాధించిన సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ ప్రగతిని రేవంత్ రెడ్డి లేఖలో స్పష్టంగా వెల్లడించారు.
తెలంగాణపై కేరళం సీఎం పినరాయి విజయన్ చెప్పిన అసంబద్ధ ఆరోపణలకు సంబంధించిన గణాంకాలన్నీ 2023-24 నాటివని, అవి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చివరి దశకు సంబంధించినవని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఏ ముఖ్యమంత్రి ఇంతవరకూ ప్రత్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేసింది లేదు. తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయమని అభ్యర్ధించేవారు. ప్రచారానికి పరిమితమయ్యే వారు.
ఇప్పుడు రేవంత్ కేరళంలోని ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. అక్కడకు వెళ్లి ఆ ప్రభుత్వ పనితీరును తూర్పారబట్టడం ఆయనలోని ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. విమర్శకు జవాబు కాకుండా తెలంగాణాలో కాంగ్రెస్ పాలనను తప్పు పడుతూ కేరళం ముఖ్యమంత్రి రాసిన లేఖకు రేవంత్ ధీటుగా బదులు చెప్పడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానంలో కొత్త ఆశలను రేకెత్తించింది.

వాస్తవానికి, రేవంత్ 2024 ఎన్నికల్లో ఫైర్ బ్రాండ్ గా మారి, కె.సి.ఆర్. గడీల పాలనను బద్దలు కొట్టారు. మాటకు మాట బదులు చెప్పి, ప్రజల మనసులు దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీని పదేళ్ల తరవాత తెలంగాణాలో గద్దెపై కూర్చోబెట్టేలా చేశాయి. కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వం ఒకరిపై నమ్మకం ఉంచిందంటే… దానికొక అర్ధం ఉంటుంది. 2004 లో వైస్సార్ పై ఇలాంటి నమ్మకాన్ని సోనియా పెంచుకున్నారు. ఫలితంగా పదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది.

తరవాత తెలంగాణ ఆవిర్భావం అనంతరం కె.సి.ఆర్. రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఈ సమయంలోనే, సోనియా గాంధీ రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించారు. కె.సి.ఆర్ ప్రాంతీయ యాసలో చేసే విమర్శలకు, రేవంత్ అంతకు రెట్టింపు పౌరుషాన్ని ప్రదర్శించారు. తన పదునైన విమర్శలతో ఓటర్ల దృష్టిని మరల్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి అంతులేని ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఆయన దానిని నిలబెట్టుకుంటూ, తనదైన శైలిలో సాగుతున్నారు. కేరళంలో యూ.డి.ఎఫ్. అధికారంలోకి వస్తే, ఆ ఘనతలో రేవంత్ రెడ్డిdi కూడా కీలక భూమిక అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ ఉండదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లా భావిస్తున్న ఈ ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా వున్నా, కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అఖండ కీర్తి లభిస్తుంది. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న సామెతకు కొత్త అర్ధం చెబుతూ తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఎల్.డి.ఎఫ్. కూటమికి ఊపిరాడకుండా చేశారు రేవంత్.

