ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆసక్తి
గెలిచేదెవరు? ఓడేదెవరు?
బీజేపీ గెలిస్తే మధ్యంతరానికి ఎక్కువ అవకాశాలు
యూపీలో ఓడితే షెడ్యూలు ప్రకారమే ఎలక్షన్స్
ఎన్నికల ముంగిట బడ్జెట్‌పై ఆసక్తి
అది ఎన్నికల నియామవళి పరిథిలోకి రాదా?
(కూచిమంచి విఎస్ సుబ్రహ్మణ్యం)
ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు ముంగిట్లో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కొవిడ్ నిబంధనలను ఫిబ్రవరి వరకూ పొడింగించింది. కరోనా నట్టింట్లోకి ఒమిక్రాన్ వచ్చేసింది. డెల్టాను అది మట్టుపెట్టేస్తోంది అంటున్నారు. కానీ కొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్, మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తూ చేతులు దులిపేసుకుంటున్నాయి. ఒమిక్రాన్ సోకితే ఏం వాడాలో సోషల్ మీడియాలో ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. ప్రముఖ వైద్యులు అసలు భయపడొద్దంటున్నారు. సామాన్యుడు మాత్రం పొట్టకోసం తిప్పలు పడుతూనే ఉన్నాడు. అంటే ఎవరి పని వారు చేసుకుని వెళ్లిపోతూనే ఉన్నారు. ఎవరూ ఆగట్లేదు. అలాగే నిర్మలా సీతారామన్ కూడానూ. బడ్జెట్ ప్రతులను సిద్ధం చేసేసారు. ఫిబ్రవరి ఒకటిన జాతీయ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బ్యాగ్ తుడుచుకుంటున్నారు.
ఎన్నికల్లో గెలుపెవరిదనే అంచనాలు ఎవరికి వారు వేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిదనే సర్వేలు కూడా చేసేశారు. కీలకమైన ఉత్తర ప్రదేశ్లో బీజేపీదే గెలుపని సర్వేశ్వరులు ఘంటాపథంగా చెప్పేశాయి. నిజమో కాదు తేలాలంటే ఇంచుమించు రెండు నెలలు ఆగాల్సిందే. పంజాబ్, గోవాలలో ఆప్ కీలక పాత్ర పోషించబోతోంది. పంజాబ్‌లో అమరీందర్ సింగ్ కూడా అంతే పాత్ర స్వీకరించబోతున్నారు. పారికర్‌కు అవసరమైన చోట కాకుండా మరోచోట టికెట్ ఇస్తామని బీజేపీ అంటోంది. ఉత్తరాఖండ్, మణిపూర్‌లాంటి రాష్ట్రాల ఫలితాలు పెద్దగా ప్రభావం చూపవు. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌పైనే అందరి కళ్ళూ కేంద్రీకృతమయయాయి. ఎన్నికల ముంగిట బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ఒకింత సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎన్నికల నియమావళి కిందకు రాదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలా అడిగిన వారిని నువ్వేం మేధావివయ్యా అని అడిగిన వారూ లేకపోలేదు. ఇలాంటి సందర్భాలలో ఓట్ ఆన్ అకౌంట్ కదా పెట్టాల్సింది అనే వారికి చెళ్ళుమనే సమాధానమూ ఉంది. ఓటాన్ అకౌంట్ అయితే మాత్రం వరాలు కురిపించరని నమ్మకమేమిటి? అనేది వారి ప్రశ్న. నిజమే ఇలాంటి ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానముంటుంది. తమ బిల్లులు పాస్ చేయించుకోవడానికి రాజ్యాంగ సవరణలు చేయడం కాంగ్రెస్ హయాం నుంచే మొదలైంది. కాబట్టి దేనిని కొట్టి పారేయలేం.
ఇక అసలు విషయానికి వస్తే మధ్యంతర ఎన్నికలు. అధికారంలో ఉన్న పార్టీలు తమకు అనుకూలంగా కాలం ఉందంటే మధ్యంతరానికి మొగ్గు చూపుతాయి. ఇలాంటి చర్యల వల్లే దేశంలో ఎన్నికల ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. దీన్ని అదుపు చేయడానికి మోడీ ప్రభుత్వం ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదాన్నిచ్చింది. కానీ అది ఇప్పట్లో ఫలవంతమయ్యేలా కనిపించడం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు
మొగ్గు చూపడంతోనే ఇది స్పష్టమైంది. ఇప్పటి పరిస్థితి మధ్యంతర ఎన్నికలు వస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో మధ్యంతరం రావాలంటే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా యూపీలో బీజేపీ సునాయాసంగా కాకపోయినా… పూర్తి స్తాయి మెజారిటీని సాధించాలి. ఈ ఒక్కటి అయితే చాలు మధ్యంతరం గ్యారంటీ అనేది కొందరి వాదన. కారణం. వివిధ కారణాల వల్ల కేంద్రంలో బీజేపీ ప్రతిష్ఠ దిగజారిందంటున్నారు. ఈ సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది వారి ఆలోచన. కరోనా దెబ్బకు సామాన్యులు, మద్య తరగతి వారు ఆర్థికంగా చితికిపోయారు. పెట్రోలు, నిత్యావసరాల ధరలు వారిని మరింత కుంగదీస్తున్నాయి. ఇవి కచ్చింగా వారిపై ప్రభావం చూపుతాయి. ఆ ఆగ్రహం కట్టలుతెంచుకోకముందే సొమ్ము చేసుకోవాలని అధికారం పార్టీ యోచిస్తుంది. ఇది ఇప్పుడు వచ్చిన దుర్లక్షణం కాదు. కాంగ్రెస్ హయాం నుంచి సంక్రమించిందే. ఏ పార్టీ అయినా మంచే చేయాలనుకుంటుంది. కానీ, పరిస్థితులు అనుకూలించవు. బీజేపీకి కలిసొచ్చే అంశం విపక్షాలలో ముఖ్యంగా కాంగ్రెస్‌లో అనైక్యత. అధ్యక్షుడు ఎవరో తేల్చుకోలేని దుస్థితి ఆ పార్టీది. ప్రాంతీయ పార్టీలలో ప్రధాని పదవి ఆశించే వారే ఎక్కువ. ఇలాంటి లక్షణాలున్న ప్రతిపక్షాలలో ఐక్యత అసాధ్యమనే చెప్పాలి. అదే బీజేపీకి పెద్ద బలం. అది ఉత్తర ప్రదేశ్ అయినా పంజాబ్ అయినా ఇదే పునరావృతం అవుతుంది. ఇప్పుడు సామాన్యుల దృష్టి అంతా పాంచజన్యం పూరించేదెవరనే అంశపైనే!