స‌జావుగా పెట్రో ఉత్ప‌త్తుల స‌ర‌ఫ‌రా…

0
89

రాష్ట్ర, జిల్లాల్లోనూ క‌మిటీల ఏర్పాటు.. నోడ‌ల్ ఆఫీస‌ర్ల నియామ‌కం

పీఎం వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, మార్చి 27: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి స‌మీక్ష‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆధ్వ‌ర్యంలో ఒక క‌మిటీని నియ‌మించి ప‌రిస్థితులను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల ప‌రిస్థితుల నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం సాయంత్రం నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ప‌లు అంశాల‌ను ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైద‌రాబాద్‌లోని క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి సీఎస్ ఆధ్వ‌ర్యంలోని క‌మిటీ ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టికప్పుడు స‌మీక్షిస్తోంద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్లారు. 33 జిల్లాల్లోనూ గ్యాస్ స‌ర‌ఫ‌రా, పెట్రోల్‌, డీజిల్ విక్ర‌యాలు.. బ్లాక్ మార్కెట్ నిరోధానికి క‌మిటీలు ఏర్పాటు చేసి నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించిన‌ట్లు సీఎం తెలిపారు.

ప్రాధాన్య క్ర‌మంలో ఆసుప‌త్రులు, పాఠ‌శాల‌లు, అనాథాశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాల‌కు క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ల‌ను పంపుతున్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు. ప్ర‌తి బంక్‌లో స్టాక్ ఎంత ఉంది.. ఎంత వినియోగిస్తున్నార‌నే దానిపై అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నార‌ని సీఎం తెలిపారు. తెలంగాణలో సాధార‌ణ రోజుల్లో రోజుకు 36,189 కిలో లీట‌ర్ల పెట్రోల్‌, డీజిల్ వినియోగం జ‌రుగుతుంద‌ని, ప్ర‌స్తుతం 1,88,210 కిలోలీట‌ర్ల నిల్వ‌లు ఉన్న‌ట్లు సీఎం వివ‌రించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ కొర‌త‌పై సోష‌ల్ మీడియాలో అపోహ‌లు, భ‌యాందోళ‌న‌లు క‌లిగేలా పోస్టులు పెడుతున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు సీఎం తెలిపారు.

తెలంగాణ‌లో శిలాజ ఇంధ‌నాలపై (బొగ్గు, చ‌మురు, గ్యాస్‌) ఆధార‌ప‌డ‌డం త‌గ్గించి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్స‌హిస్తున్నామ‌ని.. పున‌రుత్పాక విద్యుత్ ఉత్ప‌త్తి పెంచుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ‌లో ఈవీలపై వంద శాతం రోడ్డు ప‌న్ను, రిజిస్ట్రేష‌న్ ఫీజు మిన‌హాయించామ‌న్నారు. ఈవీల త‌యారీ, బ్యాట‌రీ ఎకోసిస్ట‌మ్ ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి పీఎం మోదీ దృష్టికి తీసుకెళ్లారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో 1.20 ల‌క్ష‌కుపైగా ఉన్న పెట్రోల్‌, డీజిల్ ఆటోల‌ను రిట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్ర‌క్రియ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. ఆర్టీసీలో ఇక ముందు అన్ని ఈవీ బ‌స్సుల‌నే వినియోగించనున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here