ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణకు ప్రణాళిక తోడైతే ఆ కార్యక్రమం చక్కగా సాగిపోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రముఖ సాహితీవేత్త బి. ఎన్. మూర్తి కలం పేరు (బ్నిం) . బాపు-రమణల ప్రియ శిష్యుడు. ఆయన మార్గదర్శకత్వంలో అక్షజ్ఞ పబ్లికేషన్స్ అధినేతలు డాక్టర్ వెంకట్ ఆయన సతీమణి డాక్టర్ విద్య ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు.

హైద్రాబాదులోని తెలంగాణ సాహిత్య పరిషత్ హాలులో సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డాక్టర్ వెంకట్ కుమార్తెలు విష్ణు కృతి, పవిత్ర కృతి ప్రార్ధనతో ప్రారంభమై డాక్టర్ వెంకట్ వందన సమర్పణతో ముగిసింది. రెండు గంటల పాటు జరిగిన ఈ మొత్తం ఉత్సవంలో ఎక్కడా తడబాటు లేదు… తప్పిదం లేదు.

డాక్టర్ కె.వి. రమణాచారి, సినీ దర్శకుడు ఆదిత్య, ప్రముఖ పరిశోధకుడు రవి పాడి, 10 టీవీ సీఈఓ స్వప్న, ప్రముఖ సంగీత దర్శకుడు కలగా కృష్ణమోహన్, ప్రముఖ సినీ నటి దివ్య వాణి ముఖ్య అతిథులుగా పాల్గొని, ఆరుగురు ప్రసిద్ధిపొందిన మహిళలను సత్కరించారు. వైణికురాలు అయ్యగారి జయలక్ష్మి, సిగ్నేచర్ స్టూడియో సీఈఓ అంజలి, శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, శ్రీమతి శాంతిశ్రీ, ప్రముఖ నర్తకి దీపికా రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వైజయంతి పురాణపండ సత్కారాన్ని అందుకున్నారు.

సత్కారం అందుకోవడం సాధారణమే కానీ, వారిని గౌరవించుకున్న తీరు ఆకట్టుకుంది. చీర, తాంబూలంతో పాటు బాపు గారి శ్రీరామపట్టాభిషేకం పెయింటింగునూ, పెన్ను, పసుపు-కుంకుమ, అక్షజ్ఞ పబ్లికేషన్స్ ప్రచురణలను అందులో ఉంచారు.

కిరీటాన్ని కూడా అలంకరింపజేశారు. నగదు బహుమతిని కూడా అందించారు. ఈ మొత్తం సన్మాన కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.

సభ ఆద్యంతం బ్నిం నామస్మరణతో మారుమోగింది.

