పనితీరే కలెక్టర్లకు గీటురాయి: రేవంత్ రెడ్డి

0
64

మార్చి 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక

జూన్ 12 వరకు అయిదు దశల్లో కార్యక్రమం

జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 0 3 : ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయటంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.

సచివాలయంలో మంగళవారం జరిగిన అన్ని జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను అత్యంత బాధ్యతతో, ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలని ఆదేశించారు. ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్ కెరీర్‌కు పునాదిగా నిలుస్తుందన్నారు. హోళీ పండుగ శుభాకాంక్షలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ప్రారంభించారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఐఏఎస్ సర్వీస్ దేశంలోనే అత్యున్నతమని, జిల్లా కలెక్టరుగా పని చేయడం ప్రతి అధికారికి ఒక గొప్ప అవకాశం అని అన్నారు. ప్రజలను నేరుగా కలిసే అధికారం, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందని గుర్తుచేశారు.

జిల్లాల్లో కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి తనకు నివేదికను అందించాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. నెలలో అయిదు రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆషామాషీగా మీరు ఐఏఎస్ కాలేరు. ఐఏఎస్లందరూ కలెక్టరుగా పని చేయాలని కలలు కంటారు. అత్యున్నతమైన గౌరవముండే సర్వీసులో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుంది. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే మీరు కలెక్టర్లుగా కొనసాగుతారు. కలెక్టర్లుగా క్షేత్ర స్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే.. కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలి..’ అన్నారు.

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో, వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలని సీఎం సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

శాఖల వారీగా పది వారాల పాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలని సీఎం సూచించారు.

99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చేపట్టే గ్రామ సభలను ప్రజలకు అవగాహన కల్పించేలా నిర్వహించాలని సూచించారు. సంక్షేమ పథకాల ద్వారా ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు.. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వివరాలను తెలియజేయాలన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి రూ.500 సిలిండర్, 200 యూనిట్లలోపు గృహాలకు ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలన్నీ గ్రామలవారీగా సమాచారాన్ని సిద్ధం చేయాలని, ఆ వివరాలను నివేదించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ప్రతి గ్రామంలో పునరుత్పాదక విద్యుత్తుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. సోలార్ విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించాలని, సోలార్ విద్యుత్తును గ్రిడ్కు కనెక్ట్ చేసుకుంటే వచ్చే ఆదాయంపై ప్రచారం చేపట్టాలన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ల వినియోగంతో వచ్చే లాభాన్ని కూడా రైతులకు తెలియజేయాలన్నారు. అన్ని పాఠశాలలు, విద్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లలోనే 62,749 ఉద్యోగ నియమాకాలు చేపట్టిందని, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జాబ్ మేళాలు నిర్వహించాలన్నారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మార్చే సంస్కరణలను అమలు చేస్తున్నామని, కార్పొరేట్ ఆసుపత్రులకు మించి మెరుగైన వైద్య ఆరోగ్య సేవలను అందించేలా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దే కొత్త మార్పులు తెస్తామన్నారు. కలెక్టర్లు అందుకు అవసరమైన సలహాలు సూచనలతో పాటు, తమ ఆలోచనలను పంచుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయని, ప్రతీ పాఠశాలలో ప్రతి రోజు ఒక్కో అధికారి మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలని, పిల్లలతో పాటు భోజనం చేసే బాధ్యతలు అప్పగించాలన్నారు. జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. పాఠశాలలు, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదని, డీఈవోలతో పాటు అక్కడి కలెక్టర్లపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని కలెక్టర్లు గుర్తించాలన్నారు. వాళ్లకు ఇచ్చే పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో ఎక్కడా రాజీ పడవద్దని చెప్పారు.

వచ్చే విద్యా సంవత్సరంలోనే వంద నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన మండలాల్లో ఒక తెలంగాణ ఇంటిగ్రేటేడ్ స్కూల్ను ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించటంతో పాటు స్కూలు బస్సులు, పాలు, అల్పహారం, మధ్యాహ్న భోజనం అక్కడే అందిస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల స్కూల్ ను తీర్చిదిద్దినట్లుగా అన్ని రకాల వసతులతో ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేల సూచనలతో ఏ నియోజకవర్గంలో ఏ స్కూల్ ను ఎంపిక చేయాలి, అక్కడున్న మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజున జూన్ 12న రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించాలని, ఇప్పట్నుంచే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.


ప్రభుత్వ ఆసుపత్రులను కూడా తరచుగా సందర్శించాలని, సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. వైద్యంపై ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోందని, ఏటా సీఎంఆర్ ఎఫ్, ఆరోగ్య శ్రీకి దాదాపు రూ.2500 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. అంత ఖర్చు పెడితే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అద్భుతమైన సేవలను అందించే వీలుంటుందని చెప్పారు. భవిష్యత్ లో అన్ని మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను అనుసంధానం చేస్తామన్నారు. త్వరలోనే సనత్ నగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ వరంగల్ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయన్నారు. సర్జరీలు చేసే డాక్టర్లకు ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇవ్వటంతో పాటు అడ్మినిస్ట్రేషన్ను, డాక్లర్ల సేవలను విభజించే ఆలోచన ఉందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తుందని సీఎం చెప్పారు.

బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుంటే, అందులో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు లేకుండా బోగస్ ఉద్యోగులుగా ఇంతకాలం జీతాలు తీసుకున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ దందాకు పాల్పడ్డ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పదేండ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేసి వీరి పేరిట జీతాలు పొందిన ఏజెన్సీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామన్నారు. జీతాల పేరిట గత పదేండ్లుగా చేసిన దుర్వినియోగంపై కేసు నమోదు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

జిల్లాల్లో ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి తిరిగి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని సీఎం అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు రూ.3900 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల దగ్గరే ఉందని, వాటిని రికవరీ చేసేందుకు కేసులు పెట్టి వసూలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

కొన్ని జిల్లాల్లో ఇసుక మాఫియా , అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం వస్తుందని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే చర్యలను సహంచేది లేదని, ఎక్కడ ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిస్తే వెంటనే ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు.

రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ అవకతవకలు లేకుండా జరిగేలా పర్యవేక్షించాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా ఉండేలా చూడాలని, దళారులను కట్టడి చేయాలని ఆదేశించారు.

భూభారతి దరఖాస్తులన్నీ గడువులోగా పరిష్కరించాలని, అక్రమాలు జరిగితే వెంటనే గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలుండాలని, వివిధ ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్​ పోర్టులు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు నూటికి నూరు శాతం తమ భాగస్వామ్యం పంచుకోవాలని పిలుపునిచ్చారు.

‘ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది వార్షిక పర్ఫామెన్స్ రిపోర్ట్ ఆధారంగా మీ పనితీరుకు అవార్డులు, రివార్డులుంటాయి. జూన్ లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం… ’ అని సీఎం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here