ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక: 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం

0
80

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్లాన్

జూన్ 2న తెలంగాణ పండుగ వేడుకలా జరుపుకోవాలి

పౌర సేవలను సులభతరం చేసే సంస్కరణలు

సీనియర్ ఐఏఎస్ అధ్యర్యంలో ఏకసభ్య కమిటీ

కార్యదర్శుల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైదరాబాద్ , ఫిబ్రవరి 28: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ‘ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ ప్రణాళికను అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పండుగ.. జూన్2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకను పురష్కరించుకొని 99 రోజుల పాటు జరిగే ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామ స్థాయి నుంచి మండలస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని, అందుకు అవసరమైన ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి ఆచరణలో చూపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయాలని, రాష్ట్రమంతటా 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను షెడ్యూలును రూపొందించాలని సీఎస్ ను ఆదేశించారు.
ఫైళ్లలో ఉన్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఫలితాలుగా మారాలని, ప్రజలకు పథకాల ప్రయోజనం ప్రత్యక్షంగా చేరేలా యంత్రాంగం మొత్తం ఒకే లక్ష్యంతో పనిచేయాలని సీఎం సూచించారు.

ఈ 99 రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు అన్ని విభాగాలు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని ఆఫీసుల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు ప్రతి శాఖ, ప్రతి జిల్లా, ప్రతి అధికారి మిషన్ మోడ్‌లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

శనివారం సాయంత్రం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ రామకృష్ణారావు, డీపీజీ శివధర్​ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్​ రెడ్డి, సీఎంవో అధికారులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వచ్చే 99 రోజులు అత్యంత కీలకమని, ప్రతి రోజును అమూల్యంగా భావించాలని అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.

99 రోజుల కార్యక్రమ పురోగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తానని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని సీఎం తెలిపారు. అధికారుల పనితీరు లోపాలను సహించబోమని హెచ్చరించారు. ఐఏఎస్ అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక అని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం.. అమల్లోకి తెచ్చిన ప్రతి పాలసీ విజయం, వైఫల్యాలన్నీ మీపైనే ఉన్నాయని అన్నారు. శాఖల మధ్య సమన్వయం కీలకమని, ప్రజా పాలన‌‌– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావాలంటే విభాగాల మధ్య అడ్డంకులు తొలిగిపోవాలని అన్నారు.

సాంకేతిక సంస్కరణలపై కమిటీ

పరిపాలనలో అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని సమర్థంగా వినియోగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పౌరులకు అవసరమైన సేవలన్నింటినీ మరింత సులభతరం చేయాలని స్పష్టం చేశారు. ఇంటి నుంచే ఆన్ లైన్ ద్వారానే అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని ఆదేశించారు.

కరెంట్ మీటర్, తమ ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులకు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలని అన్నారు. వాహనం కొన్న షోరూమ్ లో రిజిస్ట్రేషన్ జరిగే విధానం అమల్లోకి వచ్చిందని, ఇలా ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు.

ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం ఉండాలని సూచించారు. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడు వారాల్లో కమిటీ తమ నివేదికను అందజేయాలని చెప్పారు. ప్రతి విబాగం ఈ ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ను అమలు చేయాలని, అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్ లను రాబోయే 20 సంవత్సరాలకు సరిపడేలా అప్ డేట్ చేసుకోవాలని చెప్పారు.

సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులోనూ సాంకేతికత ను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మహాలక్ష్మి, రేషన్ కార్డులు, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ అర్హులైన వారందరికీ చేరాలని, సొంత స్థలముండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి అందించాలన్నారు. రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలన్నారు.

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్య ను అందించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయటంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఐఏఎస్ అధికారి తమ శాఖలో బెస్ట్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసుకోవాలని, తమంతట తాముగా గర్వపడే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. చేసినంత మాత్రాన సరిపోదని, ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్నారు.

ప్రభుత్వ పథకాలు, హామీలు ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ అభివృద్ధి పథంలోనూ, పరిపాలనలోనూ తెలంగాణను తిరుగులేని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పని చేయాలని అన్నారు.

తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించి దేశంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. కోర్ అర్బన్ రీజియన్ లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు.. ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీకి అవసరమైన మాన్యుఫాక్షరింగ్ జోన్ భవిష్యత్తులోనూ కీలకంగా మారుతుందన్నారు. దాదాపు 10 వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించే మాన్యుఫాక్చరింగ్ రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సేవా రంగం, తయారీ రంగంలో వస్తున్న పెను మార్పులు గమనంలోకి తీసుకోవాలని, శాఖలపైన ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలని అధికారలను అప్రమత్తం చేశారు.

అన్ని విభాగాల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు.

రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదని ఆదేశించారు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలి..బడ్జెట్ ప్రతిపాదన లో వీటిని చేర్చాలని సూచించారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను రాబట్టుకునేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని, నిధుల సద్వినియోగం చేపట్టడం వల్ల ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా రాష్ట్రం సాధించుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు.

హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్తో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరం, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ ఎంవోయూలన్నీ ఫలవంతమయ్యేలా కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, అవి గ్రౌండయ్యేంత వరకు సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా ఈ పెట్టుబడులన్నీ సాకారమైతే తెలంగాణ పారిశ్రామిక రంగం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీ దేశ ఆర్థిక స్థితిని మార్చబోతుందన్నారు.

పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు కోరుకున్న మార్పును అందిస్తామనే హామీతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం గుర్తుచేశారు. ఈ రోజుతో ప్రభుత్వం రెండేళ్లు మూడు నెలలు పూర్తి చేసుకుందని, ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నారని తెలిపారు. అందుకే వరుస ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు.

ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పునరంకిత భావంతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకుని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించాలని అధికారులను హెచ్చరించారు. వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రెండేళ్లు తొమ్మిది నెలలకు సరైన దిశా నిర్దేశంతో కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని మాటలతో కాకుండా సుపరిపాలనతో గౌరవించాల్సిన బాధ్యత తనతో పాటు అధికారులు అందరిపైనా ఉందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here